The Divine Ānanda of Dasara 10 October 1972, Second All-India annual meeting of the Sri Sathya Sai Seva Dal (Dasara 1972): the general meeting on the sub-committees' recommendations, Prasanthi Nilayam
సేవలద్వారా మీలోని ఆత్మతత్వమును అర్థము చేసుకోవలెను. ఇదే సత్యసాయి సేవాదళముయొక్క స్థాపనకు ముఖ్య ఉద్దేశము. నిన్న నియమించిన సబ్కమిటీలు ఎన్నో సలహాలనందించినారేకాని వాటిని ఆచరణలో పెట్టుటకు మీరు సంసిద్ధులై యున్నారా అనేది పెద్ద ప్రశ్న. మానవుడు సాకారమైన సత్యస్వరూపుడు. సమాజమనేదికూడ దైవాంశ సంభూతులైన మానవ సమూహమే; అది అహంకార ప్రేరిత సమూహముకాదు.
జీవితము భోగనిమిత్తము రాలేదు; సేవనిమిత్తమై వచ్చినదే; సమాజ సేవ నిమిత్తమై. విరాట్స్వరూపమైన సమాజముయొక్క సేవనిమిత్తమై: ప్రకృతిలోనించి ఆత్మలోనికి ప్రవేశించి ప్రకాశింపజేసేదే సాయి బోధ. మీ స్వస్థానము ఆత్మస్థానమే. నిశ్చల నిర్మల నిస్వార్థమే మీ నిజస్వరూపము. సేవ వలన లభించే ప్రేమాభివృద్ధి, అహంకార నాశనము, ఆనంద జ్యోతి. వీటిని అనుభవమునకు తెచ్చుకొనుటయే సేవాదళ సభ్యుల ముఖ్య కర్తవ్యము. సేవాదళ సభ్యుల అర్హతలు యేమిటి అనే ప్రశ్న వచ్చినది. సత్యసాయి పైన సంపూర్ణవిశ్వాసము కలిగినవాళ్లై దళములో చేరి కార్యక్రమములలో పాల్గొనుటకు అర్హులు. సత్యసాయిబోధనలపై భక్తిశ్రద్ధలు లేక, సత్యసాయి సేవాదళమువారు అని యెట్ల చెప్పుకొనేది? ఆ విశ్వాసమును దృఢము చేసుకొని, తరువాత దళములో చేరి, దానియొక్క ఆశయాలను అలక్ష్యముచేయక, వాటికి విరుద్ధముగా వర్తించక, శక్తిసామర్థ్యములన్నిటినీ వంచనలేక సేవాకార్యములలో వినియోగించండి. మీకు రూపనామములున్నవి కానీ సత్యసాయి ప్రబోధనకు రూపనామములు లేవు, కాబట్టి, కులము మతము వ్యక్తి అనే భేదాలను గమనించక, అందరూ, ఆ ఆశయాలకు తగిన జీవితమునకు పూనుకొండి. ఇంక, దళముయొక్క కన్వీనర్లకు కొన్ని నిబంధనలు; వీళ్ళకు గ్రామములకు వెళ్లి అక్కడ సాయి బోధనలను గురించి ప్రసంగించే శక్తి సామర్థ్యములు కూడ ఉండవలెను.
భారతీయ వాంగ్మయములోని రామాయణ భారత భాగవతములనే దివ్యదీపికలను అందరు చక్కగా పఠించవలెను. విద్యార్థులు పెద్దవయస్సు వాళ్లుకూడ పిచ్చి పిచ్చి కథలను చదువుదురే కానీ ఈ పవిత్రగ్రంధములను చదువుటకు పూనుకోవటములేదు. పరోపకారః పుణ్యాయ, పాపాయ పరపీడనం; పరోపకారార్థ మిదం శరీరం — అనే సూక్తులను సోదాహరణముగా ఈ గ్రంధములందించును. ఈ మూడు గ్రంధముల చక్కని పరిచయములేక భారతీయ సంస్కృతి ఎవ్వరికీ అర్థముకాదు, సభ్యులందరూ ఆ సంస్కృతిని తెలుసుకొని ఆచరించి ఆనందించవలెను. కాన, వాళ్లకు ఈ గ్రంధముల పఠన అత్యవసరము కన్వీనర్లు, లీడర్లు కాబట్టి, వారి నడకలు వారి పలుకులు అతి పవిత్రముగా వుండవలెను, ఇతరులనుసరించే కొరకు వారే ఆదర్శములనందించవలెను, కదా? కొన్ని ప్రాంతములందు కన్వీనర్లు లీడర్లుకాక, ప్లీడర్లుగా, వాగ్వాదములో సమర్థులవుతున్నారు. కన్వీనర్లు చేసి చెప్పువారుగావుండాలి కాని చెప్పి చేయించువారు కాకూడదు; ఇప్పుడు ప్రపంచమే ఆ ధోరణలో పోవుచున్నది. అన్ని క్షేత్రములలోనూ అంతే. ఇట్టివారలకు సత్యసాయి సంస్థలో యేమాత్రమూ స్థానములేదు. దీనిలో చేరి నేను పనిచేయలేను. అనిన అదిఒక్క మహాపాపమే! అట్లకాక మార్గదర్శకులుగా ఉత్సాహముతో భక్తిప్రపత్తులతో మీరు సేవసలుపిన తప్పక నేను చూచుకోగలను; స్వామి అనుగ్రహము సంపూర్ణముగా వుండును. ఇక, సేవాదళ సభ్యుల వయఃప్రమాణము. సేవ సలుపుటకు ఈ రీతి హద్దులెందుకుండవలెనని సందేహము కలిగేది సహజమే.
వాలంటీర్లకు వయఃపరిమితి నిర్ణయించనక్కరలేదు. వాళ్లు తమ శక్త్యానుసారము అవకాశము దొరికినపుడు సేవ చేయవచ్చును. అయితే, సేవాదళమునకు నియమనిబంధనలు అత్యవసరము. ఇపుడు పురుషుల వయస్సు 18-35 సం ॥ అనియూ స్త్రీల వయస్సు 18-40 సం ॥ అనియూ నిర్ణీతమైయున్నది. ఇది సరైనదే. క్రమశిక్షణమున శ్రద్ధ, ఉత్సాహము మొదలైనవి వృద్ధులలో నిరీక్షించుట కవకాశముండదు. సభ్యులందరూ సమవయస్కులైనచో వారికి సేవాకార్యములలో మరింతవుత్సాహమబ్బును. సమవయస్కులు మందలించిన, దానిని, యెక్కువ అవమానముగా భావించి, సభ్యులు దిద్దికొంటారు కూడా. 18 వయస్సుగల యువకుణ్ణి 60 సం ॥ వయస్సుగల వ్యక్తి మందలించిన, దానిని వాడు ప్రమాణముగా స్వీకరించక, అలక్ష్యము చేసే సంభవమున్నది. కాలమార్పు విషయము మీకేమి తెలియును. మీరంతా పాతకాలము వాళ్లని వాడు ఆ వృద్ధుని తిరస్కరించవచ్చును. కాబట్టి 40 సంవత్సరం వయస్సయిన తరువాత, తమ శక్తికొద్ది తాము వాలంటీర్లగా సేవ సలుపేది మంచిది. రాముడు నరాకారమును ధరించిన వ్యక్తి; సుగ్రీవుడు వానరాకారమును ధరించిన వ్యక్తి; అయిననూ వారిరువురికీ అవస్థాసన్నిహితము వలన, వయస్సన్నిహితము వలన, బాధాసన్నిహితము వలన గాఢమైన స్నేహము తటస్థించినది. ఇద్దరికీ సోదర నిమిత్తము అరణ్యవాసము సంభవించినది: ఇద్దరూ రాజ్యభ్రష్టులు! ఇద్దరికీ భార్యా వియోగము!
దీనిని బట్టి చూచిన, సమవయస్కులు యువకులు బుద్ధిబలము గలవారు సేవాదళ సభ్యులుగా వుండుటయే మంచిది అని తేలును. మనోబలము దేహబలము ఉత్సాహబలము అన్నీ పూర్తిగా సేవాకార్యములలో వినియోగించు యువకులు గ్రామసీమలలో కార్యనిరతులైనచో పల్లెలవారుకూడ సేవలో పాల్గొనుటకు పూనుకొందురు. మరొక విషయము సేవాదళము యువకుల మేలుకొరకే స్థాపితమైనది. ఇపుడు భారతీయ సంస్కృతి యేమిటో తెలియక ఆధ్యాత్మిక మార్గములో కాలుపెట్టక, యోగము, ధ్యానము, జపము అసలే పట్టక, యువకులు అశాంతికి గురియగుచున్నారు. పెద్దలంటే విశ్వాసము లేదు, పాపభీతి లేదు. దైవప్రీతి లేదు. వారు ఒక సత్యసాయి ప్రేమకు మాత్రమే కట్టుపడ్డారు కానీ మరొకరి మాటలు వినే స్వభావములో లేరు. అదికూడ యేకారణము వలన అనిన సత్యసాయి ఎల్లప్పుడూ తానుచేసి మరొకరికి చెపుతారు; ఆపని ఈపని అని లేకుండా అన్నిటిలోనూ చేరుకుంటారు. నాకూ, వారికీ సంబంధించిన ప్రేమ సూత్రము అది ఇక, కొన్ని మార్పులనుకూడ మన నిబంధనలలో చేయతలంచుచున్నాము. ఇంతవరకు ఒక లక్ష జనాభా కలిగిన పట్టణములలో మాత్రమే సేవాదళములను స్థాపించుటకు సమ్మతించినాము. ఇకపై ప్రతి పల్లెలలోనూ సేవాదళములను స్థాపించవచ్చు. దానికి యేమాత్రమూ అభ్యంతరము లేదు,
పల్లెలయందే ఇపుడు జీవితము యెక్కువ బాధగా వుండేది. అక్కడి అశక్తులకూ రోగులకూ అమాయకులకూ పలురీతుల సహాయము ఇపుడు అత్యవసరము. పట్టణములలో వీటికి యెన్నో సంస్థలున్నాయి; పల్లెలలోనే తక్కువ, ఆహారవిహారాదుల మార్పులవలన అనారోగ్యము తీవ్రమై బాధపడేవాళ్లను, అశాంతిలోపడి అల్లాడేవాళ్లను, ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశింపజేసే అవకాశమున్నది. నామసంకీర్తనతో భజనలతో అపవిత్ర వాతావరణమును శుభ్రపరచవలెను. సేవాదళములోని డాక్టర్లూ లాయర్లూ పల్లెలవారి సమస్యలను పరిహరింప పూనుకోవలయును. వారికి తగు సలహానిచ్చి, సహాయపడవలెను. ఆధ్యాత్మిక కథలను తెలిపి, వారి హృదయములలో సోదరభావమును, ప్రేమతత్వమును నాటవలెను. జిల్లాకొక కన్వీనరు, రాష్ట్రమునకొక కన్వీనరు. వీరిని సేవాదళముయొక్క స్థాపన పోషణ శిక్షణ కార్యముల అభివృద్ధి కొరకు నియమించవలెనని నా సంకల్పము. ఇక, యూనిఫారం డ్రెస్సు విషయం; మీ డ్రెస్సు వికారముగా విచిత్రముగావుంటే, మిమ్ములను యెవరూ సహాయమడుగరు, సమీపించరు. నవనవీనఫ్యాషన్లరీత్యా ఆడవాళ్లు మగవాళ్లు రకరకాల ఆడంబర అలంకారములు చేసుకొంటూ తిరిగితే సామాన్య జనులు వారినుంచి దూరముగనే వుంటారు. దేహరక్షణ మీ గౌరవరక్షణ, రెండునూ మీరు మీడ్రెస్సువలన నిర్వహించుకోవలెను, అంతే.
యూనిఫారం అని మీ డ్రెస్సుకు నేనేమాత్రము విలువనీయను అయితే, మీ మీ హృదయమునకు ప్రేమవస్త్రము ధరించండి; మీ మీ కంటికి సమదృష్టిని తగిలించండి. అదే నాకు కావలసిన మీ యూనిఫారం! నాకు సంబంధించినవరకూ అంతే చాలు! అయితే, జిల్లా సమ్మేళనములూ, స్టేట్ సమ్మేళనములూ, అఖిలభారత సమ్మేళనములూ జరుగు సమయమున, యూనిఫారం ఒకటిని ధరించవలసియున్నది. తెల్లటి వస్త్రములే. నిర్మల నిస్వార్థ మనోభావముయొక్క చిహ్నములు. నక్కలు కుక్కలు మొదలైన వికార చిత్రములు లేని, ఫుల్ఆర్మ్ షర్టులు; డ్రైనేజి పైపులవలె వద్దు, సరైన ప్యాంట్లు, వీటిని ధరించండి. ఇక, వాలంటీర్లకూ సేవాదళ సభ్యులకూగల భేదమేమి అనే ప్రశ్న వచ్చినది. సేవాదళ సభ్యులు యెల్లవేళల యెక్కడ నుండిననూ సేవకు సిద్ధముగా నుండవలెను. వారికి ప్రత్యేక ఆధ్యాత్మిక శిక్షణకూడ విధింపబడినది. వారు అనేక రీతుల సేవాకార్యములకై సుశిక్షితులుగా సదా సంసిద్ధులైయుంటారు. అయితే, వాలంటీర్లు, సమావేశములందు మాత్రము వారి వారి శక్తికొలద వారి వారి కర్తవ్యకర్మలనాచరింతురు. వారికి శిక్షణతో కానీ నిబంధనలతో కానీ అంత పనియుండదు. మరొక ముఖ్యమైన విషయము: సేవా మనోభావము మీ మీ ఇండ్లలోనే మొట్టమొదట కార్యగతము కావాలి. మీ మీ తల్లితండ్రుల సేవ చేయక, బయట మీరేమి చేసిననూ స్వామి అనుగ్రహించరు.
వారు అనారోగ్యముతో బాధపడుచుండగా, వారి శుశ్రూషను అలక్ష్యముజేసి, మీరు బయట యెంత మందికి ఉపకారముజేసిననూ, అదంతా అపకారమే అగును. వారిని గౌరవించి, వారిని ప్రసన్నులుగావించితే, తప్పక స్వామి అనుగ్రహము మీవెంట జంటవుండి కంటిరెప్పవలె మిమ్ములను కాపాడును. మీ జీవితములను పవిత్రముగావించే ప్రయత్నమును, సార్థకము చేసికొనే సాధనలను, ఇంటిలో ప్రారంభించండి తరువాత, బయటకు వెళ్ళటానికి పూనుకొండి. కాలమును వ్యర్థముచేయక, కాయమును దుర్వినియోగపరచక, కర్మాచరణయందు కాలుపెట్టండి. అహంకారమునకూ అవిశ్వాసమునకూ అవినీతికీ చోటివ్వక, ఆడంబర జీవితమునాశించక, అన్యోన్య భావమునభివృద్ధి చేసుకొని, మీ ఆత్మోద్ధారమునూ దేశోన్నతినీ లోకకల్యాణమునూ సాధించండి.