The Vahini series of Bhagavān Śrī Satya Sāī Bābā

Gītā Vāhini · Prabodha 21

Passage 12

Passages 1–23

“అర్జునా! సగుణోపాసన సులభమని లోకులు తలంతురు. కానీ అది అంతటి సత్యము కాదు. అది అసత్యమే అగును. ఇంద్రియ సంయమము కలుగువరకూ, అనగా ప్రారంభ స్థితియందు సగుణోపాసన కొంత తోడ్పడును. దానిని చూచుము. అంతియే.”

“అంత మాత్రముచే ఆరాధనా దైవము అనుగ్రహించి ముక్తిని అందించదు. అట్టి ముక్తిని పొందగోరువారు, మొదట దేహాభిమానము వదలవలెను. అటులకానిదే ఆత్మస్థితి కలుగదు. దేహాభిమానము అవిద్యారూపము. ఆత్మ, ప్రకృతి నుండి వేరు కావలెను. దానికి ధ్యాన తపస్సులచే అంతఃకరణములందు గల విషయవాసన నశించవలెను. అది నశించినతోడనే కొబ్బరి కురిడీలు మరల పీచుతోనూ చిప్పలతోనూ చేరనట్టు, తిరిగి మొలకెత్తనట్టు, ఎంతకాలమైననూ చెడకుండునట్టు జీవుడు జనన మరణముల బారినుండి వేరై మోక్ష సిద్ధినుండి చలించుట ఉండదు. దీనిని జీవన్ముక్తి యొక్క స్థితి అని అందురు.”

“ఇట్టి స్థితిని పొందుటకు నిర్గుణోపాసన ద్వారా దేహాభిమానము వదలవలెను. అటుల కాదేని, సగుణోపాసకులు కూడనూ సమస్త వైదిక, లౌకిక కర్మఫలములను నాయందు సమర్పించి, నేనే పరమ గతిగా ఉపాసన చేసినచో, నన్నే ధ్యానించినచో చిత్తమును నాయందే ఉంచినచో అట్టి వారిని కూడనూ నేను అనుగ్రహింతును. సంసారమనెడి సముద్రమును దాటింతును. మోక్షమను గమ్యమును చేరును. బావా! చిత్తమును నా యందే ఉంచుట అంత సులభమైన పనిగాదు. అందరికీ ఇది సాధ్యము కాదు. ఎంత అభ్యాసము చేసిననూ చిత్తమును నాయందుంచుట దుస్సాధ్యము.”

“అటులయిన ఇక వేరు మార్గము లేదా అని విచారింతువేమో! ఉన్నది, ఏమన నాకు ప్రీతిని కలిగించు కర్మలు చేయుటలో ఎవరు ఆసక్తిని చూపుదురో వారికి కూడనూ ఆత్మస్థితి కలుగును; మోక్షము సిద్ధించును. ప్రార్థన, భజన పూజాదులు సలుపుటచే పాపము నశించి అంతఃకరణ శుద్ధి అయి జ్ఞానోదయము కలుగును”. ఇట్లు శ్రీ కృష్ణభగవానుడు, సగుణ, నిర్గుణోపాసనల ద్వారా దైవానుగ్రహము సంపాదించు విధానము వివరించెను.

పాఠకులు ఈ విషయమును చక్కగా విచారించవలసిన అవసరమెంతేనియూ కలదు. అట్టి విచారణవలననే వివేక సహితమైన విషయము తెలుసు. భక్తి అనగా లోకులు తలంచు అర్థమునకు పరమాత్ముడు ఉపదేశించు అర్థమునకూ ఎంత భేదమున్నదో యోచించుడు. భగవంతునియందు అవ్యాజమైన ప్రేమయే భక్తి అని లోకులు భావింతురు. ఇంత మాత్రమునకే భక్తి అను పదమునకు సార్ధకము చేకూరదు. భగవంతుని ప్రీతితో ఆరాధించుట ఒక విధమైన సాధన మాత్రమే అగును. కానీ భక్తులు కోరువారు అంతమాత్రమునకే తృప్తిపడక, తమ ప్రేమ భగవంతుని యందు ఎంత మాత్రము కలదని, యోచించుట కంటేను, భగవంతుని ప్రేమానుగ్రహములు తనపై ఎంతమాత్రము కలవనియు, ఎట్టి కర్మలు చేసిన, ఏ రీతిగా మెలిగిన భగవంతుడు సంతుష్టుడు కాగలడు, అనగా భగవంతుని ఆనందపరచగలము. అతనిని ఆనందపరచు మార్గమేది అని యోచించి, విచారించి తదనుగుణ్యముగా ప్రవర్తించుటే భక్తియొక్క లక్ష్యమని తెలుసుచున్నది.

అయితే, సామాన్యముగా మానవ లోకమున ఇట్టి విచారణ సలుపుట లేదు. ఆరాధించువాని యొక్క ప్రేమ పరమాత్మయందు ఎంత గాఢముగా నున్నదో అంతమాత్రమే చూచుకొందురు. అట్లు చేయుటచేత, భగవత్ప్రీతికరమైన కర్మలను కాని ధర్మములను కాని కొంత యోచించకపోవచ్చును. ఆచరించక పోవచ్చును.

అందులకే కాబోలు, ఆరాధించువాని అభీష్ట కర్మలంకంటెను, ఆరాధింపబడు భగవత్ ప్రీతికరమైన కర్మలు అత్యుత్తమమైనవని కృష్ణుడు నిరూపించెను. భక్తులనబడువారు ఏ కర్మలు చేసిననూ, ఏమి తలంచిననూ, ఏమి చూచిననూ భగవత్ ప్రీతికరమైనవిగా ఉండవలెను, లేక భగవదర్పితమై యుండవలెను. అంతేకాని, తన ప్రీతి ననుసరించి సర్వకర్మలయందూ సాధన సాగిపోయిన అది సారములేని భారము కాగలదు. ఏమి చేసిననూ ఈ పని, ఈ భావము, భగవంతునికి ప్రీతి అయినదేనా, కాదా? అని విచారించుట భక్తుని యొక్క ముఖ్య కర్తవ్యము.

అట్లు కాక భగవంతునియందు గాఢమగు ప్రేమ విశ్వాసములుండియు, భగవదాజ్ఞకు విరుద్ధముగా కాని, లేక భగవానుని శాసనమైన శాస్త్రమునందు తెలుపబడిన ధర్మములకు విరుద్ధముగా కాని ప్రవర్తించిన, అట్టివారు భక్తులు కారని కూడనూ తెలుపుచున్నది గీత. అదియే “భక్తిమాన్ యః స మే ప్రియః” అని కృష్ణుడు తెలుపుటలో భావము, భక్తుడు ఏ కర్మలు ఆచరించినను తాను మమ కర్మ అని భావించకూడదు. ఈశ్వరీయ కర్మగా ఉండవలెనని కూడనూ తెలుపుచున్నాడు. అనగా కొన్ని కర్మలు తనవిగాను, మరికొన్ని కర్మలు భగవంతునివిగాను, భావించుచుందురు. అట్లు భావించుట భక్తుని లక్షణము కాదు. సర్వకర్మలు భగవదర్పితమైన కర్మలుగా భావించిన అభిమాన మమకారములందున చేరవు. మమకార అభిమానములను నిర్మూలన చేసుకొను సాధనే భక్తి. సర్వమును భగవత్ మయముగా భావించవలెను.

అందులకే భక్తుడనగా భగవంతునితో విభక్తము కానివాడని అనేక ఆధ్యాత్మిక తత్త్వములందు తెలుపబడినది. సర్వకాల సర్వస్థలయందూ భగవత్ మయమైన భావములుగా కర్మలుగా నుండవలెను. అట్లు కాక కష్టములు, నష్టములు, దుఃఖములు, బాధలు కలిగినప్పుడు మాత్రము భగవంతుడా! వీటిని నివారింపమని ప్రార్థించుట, అది తీరగనే, నెరవేరగనే భగవంతుని స్మరణ అయిననూ లేక ప్రకృతికి దాసులగుట, ఇట్టి ప్రవర్తన భక్తులకు పరమ విరుద్ధమైన పద్ధతిగా కూడనూ తెలుపుచున్నది గీత. అవసరము ననుసరించి భగవంతుని ఆరాధించరాదు.

నోరు చెడినప్పుడు ఊరగాయను కోరినట్లు, బాధలు కలిగినప్పుడు భగవంతుని కోరరాదు. అయితే, నేటి కలి మహాత్మ్యమేమో కాని, ఎక్కడ చూచిననూ ఇట్టి ఆడంబర భక్తే తాండవమాడుచున్నది. ఎంత గొప్ప సాధకులన్నవారు కాని, ఎంతో త్యాగములు చేసి దైవమే మా సర్వస్వమని భావించి ఆరాధించు భక్తులయందు కాని, కాలక్రమ స్థానములను పట్టి భక్తిని ప్రదర్శించుచున్న చర్యలే కనిపించుచున్నవి. అనేక మంది యాత్రలు సలుపు సమయములందూ, పెద్దల దర్శనమునకు వెళ్ళు సమయములందూ లేక దేవాలయములకు పోవు సమయములలో భక్తి అను బురఖాలు ధరించుచున్నారు. తిరిగి ఇంటికి చేరగానే ఆ చింతన కానీ, ఆ భావములు కానీ వెతికిననూ చిక్కవు. ఎంత ప్రయత్నించినా కనిపించవు. ఇట్టి ప్రవర్తన, భక్తి అనిపించుకోనదు.

ఇవి కేవలము ఆడంబర అవిద్యలు, సర్వస్థానములందు సర్వవేళలయందూ సర్వాత్మ భావమే నిజమైన భక్తి అని కూడనూ తెలుసుకోవలెను. కొందరు సర్వకర్మలూ భగవదర్పితమని మాటలతో తెలుపుతూ దేహార్పితము చేయుచుందురు. కృష్ణార్పణమని చెప్పుతూ పుత్రార్పితము చేయుట. రామార్పితమని అంటూ రాగార్పితము చేయుట జరుగుచుండును. అట్టి అర్పితము అర్పిత మనబడదు. మనోవాక్కాయ కర్మలతో చేసిన అర్పితము అర్పితమనబడును. భక్తి అనబడును; కానీ మాటలతో చెప్పినది మనసుతో చేయక, మనసున తలచినది క్రియతో చేర్చక ఉండుట బూటకపు ఆటలని తలంచవచ్చును. చెప్పవచ్చును.

కర్త, కర్మ, క్రియలన్నియూ పరమాత్మను ఆశ్రయించి యున్నవని దృఢనమ్మకము కలిగి దైవమునకు భక్తులు కావలెను కానీ, ధనమునకు, దారాదులకు, పుత్రాదులకు, భక్తులు కారాదు, కారాదు. అభిమానమెక్కడో అక్కడ దైవభక్తి అని చెప్పలేరు. భక్తి పరిశుద్ధమైన గంగవంటిది. కర్మ యమున వంటిది. జ్ఞానము గుప్తగామినియైన సరస్వతి వంటిది. ఇది బయటికి కనుపించునది కాదు. ఈ మూడింటి సమ్మేళనే త్రివేణి అని పిలువబడును.

అట్టి, త్రివేణి, అనగా త్రిగుణముల ఏకత్వమే మనోలయము. అదియే మమకార రహితమని అందురు. అట్లు కాక మరి కొంతమంది నిత్యము రెండు వేళల స్నానసంధ్యాదులు చేయుచు, ఆరాధన అర్చనాదులు సలుపుచు, నొసట పెద్ద పెద్ద విభూతి పట్టెలు, గంధపు పట్టెలు, కుంకుమ బొట్లు పెట్టుచు, జపమాలలు కంఠములందును హస్తములందును ధరించి దేవాలయములకు గాని, పెద్దల దగ్గరకు గాని లేక క్షేత్రముల సందర్శనమునకు గాని వెళ్ళుచుందురు, ప్రదక్షిణలు తిరుగుచుందురు. లేక సత్సాంగత్యములైన ప్రసంగములు, హరికథలు, పారాయణములు ఇత్యాది పురాణ కాలక్షేపములకు వెళ్ళుచుందురు. ఇట్టి స్థితిని, ఇట్టి కర్మలను, సత్ కర్మలనియు సదాచారములనియు చెప్పవచ్చునే కానీ ఇట్టి కర్మలు సలుపువారందరిని భక్తులని చెప్ప వీలులేదు.

భక్తికిని, వేషభాషలకునూ ఏ మాత్రమూ సంబంధములేదు. వేష భాషలున్నంత మాత్రమున అట్టివారిని భక్త కోటికి చేరిన వారనుట ఎట్లు సాధ్యమగును? భక్తి భావములో చేరినదే కాని, బాహ్యముతో చేరినది కాదు. పొగ ఉన్నచోట నిప్పు ఉన్నదని చెప్పవచ్చును. నిప్పు ఉన్న చోటంతయూ పొగ ఉండుననుట కల్ల. పొగలేని నిప్పుకూడనూ ఉండవచ్చును. కానీ నిప్పులేని పొగ మాత్రము ఉండనేరదు. అటులనే, భావములేని కర్మలు ఉండవచ్చును. కానీ, ఆడంబరకర్మలు లేని భావము లేదని చెప్ప వీలుకాదు.

బాహ్యాడంబరములు లేకపోయిననూ భావశుద్ధి ఉండి యుండవచ్చును. కాన, భావశుద్ధియే ప్రధానము! దానికి తగిన సదాచారములు వాటికి ఆధారములు. భావశుద్ధితో చేసిన కర్మలే భగవత్ కర్మలు. భావశుద్ధి లేక బాహ్యాండంబరము కొరకు చేసిన కర్మలు, ప్రకృతి కర్మలనే చెప్పవచ్చును! ఇట్టి కర్మలు భక్తునకు విరుద్ధ ప్రవర్తనలు.

తరువాత, అర్జునుడు అడిగిన ప్రశ్నలో: సగుణ భక్తుడనియు, నిర్గుణ భక్తుడనియు రెండు విధానములు కలవు. ఇందులో ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు, సగుణభక్తులనియు, అనగా రూపనామములతో ఆరాధన సలుపు వారినియు, జ్ఞాని నిర్గుణ భక్తుడనియు తలంచవలెను. వీరిరువురియందు గల భక్తి ప్రవర్తనలలో ఏది శ్రేష్ఠమైనదనియు అర్జునుని సందేహము.

ఈ విషయమున ఆనాటి అర్జునునకేకాక నేటి మానవులందరికీ ఈ సందేహము లేకపోలేదు. నేటికిని ఇట్టి సగుణ నిర్గుణ భక్తి పై అనేక వాదోపవాదములు జరుగుచునేయున్నవి. కొందరు సగుణ భక్తియే శ్రేష్ఠమనియు, మరికొందరు నిర్గుణ భక్తియే శ్రేష్ఠమనియూ, ఇంకనూ కొందరు సగుణ నిర్గుణ సమ్మేళన భక్తియే శ్రేష్ఠమనియూ ఈ రీతిగా ఒక నిర్ణయము కాక తికమకలు పడుచున్నారు. కానీ, గీత ఈ సందేహమును సులభముగా తీర్చుచున్నది. పరమాత్ముని తీర్పే సరియైన తీర్పు కానీ పామరుల తీర్పు దీనికి అన్వయించదు. ఈ మార్గులన్నియూ సాధకుని దృష్టి భేదములే కానీ సర్వేశ్వరుని సృష్టి భేదములు కావు.

ఉదాహరణమునకు ఒకటి చూతము, ఒక వ్యక్తికి రెండు పాదములున్నవి. అందులో ఏ పాదము ప్రధానమన్న కర్మ కలాపములకు కుడి యెడమ అని భేదము పాటింతుము. కానీ నడచుటకును, దేహసంబంధమైన బాధలకును రెండునూ తనవే కదా! ఏ పాదమునకు దెబ్బ తగిలిననూ ఆ పాదములు కల వ్యక్తికే కదా బాధ! ఏ కాలుకి బాధ కలిగినా తానే బాధపడును. కనుక, బాధ ఏ కాలునకూ రావలెనని ఎవరూ కోరరు. ఏ కాలునకు బాధ కలుగుటకూ ఏ వ్యక్తియూ అంగీకరించడు. ఇప్పుడు ఏ కాలు ప్రధానము, ఏ కాలు ప్రధానము కాదని ఎట్లు తెలుపగలరు? రెండు పాదములూ చేరే మానవుని నడకను సాగించుచున్నవి.

సగుణ నిర్గుణములు భగవంతుని పాదముల వంటివి. దేనికి అది ప్రధానమే. ఆధారమే. ఒకటి శ్రేష్ఠమనియూ, మరొకటి శ్రేష్ఠము కాదనియూ చెప్ప వీలులేదు. అయితే కుడి యెడములని మాత్రము చెప్పక తప్పదు; సగుణము ఎడమ కాలనియూ, నిర్గుణము కుడి కాలనియూ చెప్పవచ్చును. ఏ మంగళ కార్యమునందైనా కుడి కాలు మొదట పెట్టినట్లు, మోక్ష సాధమునకు నిర్గుణమును కుడికాలు మొదట పెట్టవలెను! అదే మంగళము. అనగా మోక్షసాధమునకు నిర్గుణుడు మొదట ప్రవేశించును. తరువాత సగుణుడు ప్రవేశించును. ప్రవేశము ఇరువురికి కలదు. అట్లు లేదని చెప్పుటకు వీలులేదు. ఎవరైననూ ఒక పాదము లోపల, మరొక పాదము వెలుపల, యెంత సేపని పెట్టుకోగలడు! అట్లుండిననూ ఏమి ప్రయోజనము? కాన, సగుణ భక్తిని సాధనంగానూ, నిర్గుణ భక్తిని సాధ్యంగానూ తలంచవచ్చును. అనగా నిర్గుణనకు విశ్వమంతయూ విశ్వేశ్వరుడని వలె కనిపించవచ్చును. సగుణుడు విశ్వము వేరుగాను, విశ్వేశ్వరుని వేరుగానూ తలంచవచ్చును, చూచవచ్చును. ఈ రెండునూ లక్ష్యార్థమున చూచిన ఒక్కటియే. ఎట్లన కొన్ని చోట్ల దారముగా ఉన్న వస్తువే మరికొన్ని చోట్ల వస్త్రముగా కనిపించును. వస్త్రము వేరు, దారము వేరుగా ఉండును కాని, దారమే వస్త్రము, వస్త్రమే దారము. దారమును వేరుగా వస్త్రమును వేరుగా, చూచుట సగుణోపాసన తత్త్వము. దారము యొక్క సమ్మేళనే వస్త్రమని రెండిటినీ ఏకముగా చూచుటే, నిర్గుణాని యొక్క తత్త్వముగా భావించవలెను.

అయితే భక్తి అనునది ఎక్కడి నుండియో వచ్చి పడునది కాదు, ఎవరూ అందించునది కాదు. భూమినుండి రాలేదు. ఆకాశము నుండి పడలేదు. తనలోనుండియే వచ్చు భగవదనురాగము, భక్తునిలోని ప్రేమవృత్తి ప్రవాహము చెల్లాచెదరై ప్రవహించక భగవంతునిపై ఏకోన్ముఖముగా ప్రవహించిన ప్రేమ ప్రవాహమే భక్తి అని పిలువబడును. ప్రేమ సర్వప్రాణుల యందును కలదు. ప్రేమలేని జీవి లేదు. పశుపక్షి మృగాదులకు, క్రిమికీటకాదులకు కూడా వాటికి తగిన ప్రేమవాటికున్నది, వేయేల? ప్రేమే జీవనము, జీవనమే ప్రేమ.

ఆయా జీవరాసులు అన్నింటికిని తమ తమ బిడ్డలపై, తల్లిదండ్రులపై, మిత్రులపై, వస్తువాహనాదులపై, తిండి తీర్థాదులపై, పరిపరివిధముల ప్రేమ ప్రవహించుచుండును. దీనిని పట్టి, తగిన నామములు నియమములగుచున్నవి. అన్నింటికిని భక్తి అని చెప్పవీలలేదు. అది సరియైనది కాదు; తమ ప్రేమ, తమ తమ బిడ్డలపై మరలినప్పుడు, అట్టి ప్రేమ వాత్సల్యమని పిలువబడును. అదే ప్రేమ దాయాదులపై తిరిగినప్పుడు, మోహమని పిలువబడును. అటులనే దీనులపై పడినప్పుడు కరుణ అనియు, సమానులపై చూపినప్పుడు మైత్రి అనియు, వస్తువాహములపై పడినప్పుడు ఇచ్ఛ అనియు, వాంఛ అనియు అందురు.

అయితే పూజనీయులైన తల్లిదండ్రులపై, విద్యాగురువులైన ఆచార్యులపై ఈ ప్రేమ ప్రవహించిన దానిని గౌరవమనియు, వినయమనియు, విధేయత అనియు అందురు.

కాని, ఒక్క భగవంతునిపై మాత్రము ప్రవహించిన ప్రేమయే భక్తి అని పిలువబడును. చాలా చీలికలుగా ఏర్పడి, క్షీణించి ఎందుకూ కొరకాక, అశాంతి, దుఃఖములకు చిక్కుకొని విలపించుటకంటే, ఏక ముఖ్యమున తన ప్రేమ ప్రవాహమును భగవత్ అనుగ్రహమను సాగరమున చేరునట్లు చేయు సాధననే భక్తి అందురు. సంసార సాగరమున చేరి, నిస్సారమగుటకన్న, సర్వేశ్వరానుగ్రహ సాగరమును చేరి సార్ధకమగుట, సచ్చిదానందమును పొందుట ఎంత పవిత్రము! జన్మ ధన్యము; అదే ఆనందము; ఈ విధమైన ప్రయత్నములతో సాధించి సంతసించినవారే గోపికలు; తలంచినవారే గోపికలు. గోపికలయొక్క మనోవాక్కాయ కర్మలన్నియూ సర్వకాల సర్వస్థలయందునూ కృష్ణచరణారవిందములందు, అర్పితములగుచుండెడివి. కనుకనే గోపికలు యోగులని పిలువబడెను. కృష్ణపరమాత్మయే గోపికలను యోగులని పిలువలేనన్న, వారలది యెంతటి పవిత్ర హృదయమో యోచించుడు!

“Arjuna, people imagine that Saguṇa-upāsanā is easy, but that is not entirely true. In the beginning, until some mastery of the senses is gained, Saguṇa-upāsanā can certainly help. Understand its place—but do not mistake the beginning for the whole path.” “Worship of a chosen form by itself does not automatically bestow Mukti. One who seeks Mukti must ultimately relinquish deha-abhimāna, for without that the Ātma-sthiti cannot be realised. Body-identification is a form of avidyā. The Ātma must be discerned from Prakṛti; for this, the viṣaya-vāsanās lodged in the Antaḥkaraṇa must be worn away through Dhyāna and Tapas. When they are destroyed, the jīva becomes free of the cycle of birth and death and does not fall away from the attainment of Mokṣa. This is the state called Jīvanmukti.” “For such freedom, Nirguṇa-upāsanā helps one transcend body-identification. Yet Saguṇa-upāsakas too can reach Me if they offer all Vedic and worldly fruits to Me, worship Me as the supreme goal, meditate on Me, and place Citta wholly in Me. I shall carry them across the ocean of Saṁsāra to Mokṣa. Bāvā, however, fixing Citta entirely in Me is not easy; even with much practice it can be difficult.” “You may therefore ask whether another path exists. It does. Whoever delights in actions that give Me joy also comes to Ātma-sthiti and Mokṣa. Prayer, bhajan, pūjā, and similar practices can wear away pāpa, purify the Antaḥkaraṇa, and prepare the dawn of Jñāna.” Thus Kṛṣṇa explained how divine Anugraha may be approached through both Saguṇa and Nirguṇa Upāsanā. The reader should enquire carefully into this. Only such Vicāra gives rise to understanding joined with Viveka. Consider the difference between the common idea of Bhakti and what Paramātma teaches. People often define Bhakti simply as guileless love for Bhagavān. That is not yet the full meaning. Loving worship is a form of Sādhana, but a bhakta should not stop at asking, “How much do I love God?” He should also ask, “How much of Bhagavān’s Prema and Anugraha is reflected in my life? What actions and manner of living delight Him? What path would bring joy to Him?” To enquire into that and live accordingly is the true direction of Bhakti. Ordinarily such enquiry is neglected. People measure only the worshipper’s emotional love toward Paramātma; as a result they may fail to examine whether their actions and dharmic conduct are actually pleasing to Bhagavān. That is why Kṛṣṇa gives greater weight to Bhagavat-prīti—to what is pleasing to the One worshipped—than merely to the worshipper’s personal preference. Whatever a bhakta does, thinks, or sees should either be pleasing to Bhagavān or consciously offered to Him. Before every action the devotee should ask: “Is this act, this thought, pleasing to Bhagavān or not?” Sādhana conducted only according to one’s own likes can become a burden without essence. The Gītā therefore does not call someone a bhakta merely because deep feeling for God coexists with conduct opposed to Bhagavān’s command or to Dharma as taught in Śāstra. This is the force of ‘bhaktimān yaḥ sa me priyaḥ’. A bhakta should not divide actions into ‘mine’ and ‘God’s’; all Karma should be treated as Īśvarīya-karma, offered to Him. When every action is Bhagavad-arpita, abhimāna and mamakāra lose their hold. Bhakti is the Sādhana of uprooting possessiveness and egoic identification by seeing all as Bhagavat-maya. Hence spiritual teaching often explains bhakta as one who is not vibhakta—not divided from Bhagavān. At all times and in all places, bhāva and action should be suffused with Him. To remember God only when pain, loss, distress, or difficulty comes, pray for relief, and then return entirely to Prakṛti once the need is satisfied—this is contrary to the spirit of Bhakti. Bhagavān is not to be worshipped only according to need. One should not seek God only when life turns bitter, as one reaches for pickle when the mouth has lost taste. Yet such display-oriented devotion is common: people may put on the cloak of Bhakti during pilgrimages, visits to holy persons, or temple worship, and then leave the corresponding thought and feeling behind when they return home. Such conduct does not deserve the name Bhakti. These are outward displays born of avidyā. True Bhakti is Sarvātma-bhāva at all places and times. Some say ‘Kṛṣṇārpaṇam’ with the mouth while offering the heart to body, family, rāga, and personal desire. An offering is real only when Manas, Vāk, and Kāya participate together. Saying one thing, thinking another, and doing a third is only pretence. With firm conviction that Karta, Karma, and Kriyā all rest in Paramātma, become a devotee of the Divine—not of wealth, possessions, spouse, children, or worldly attachment. Where possessive abhimāna dominates, divine Bhakti cannot be said to rule. Bhakti is like the pure Gaṅgā; Karma like Yamunā; Jñāna like the hidden Sarasvatī. Their confluence is the sacred Triveṇī. That Triveṇī—the union in which the three currents find one centre—is Manolaya, freedom from mamakāra. External disciplines such as daily bathing and sandhyā, worship, sacred marks, rosaries, temple visits, circumambulation, satsang, Harikathā, and scriptural recitation can rightly be called sat-karma and sadācāra. But performing them does not by itself prove that a person has become a bhakta. Bhakti has no necessary dependence on dress, language, or outward religious appearance. Smoke can indicate fire, but one cannot say every fire must produce visible smoke. In the same way, outward actions may occur without the inner bhāva; and inner bhāva can be present without ostentatious outward display. Bhāva-śuddhi may therefore exist even without external display, and that inner purity is primary. Sadācāra supports it. Actions performed with Bhāva-śuddhi become Bhagavat-karma; actions performed only for outward appearance remain within Prakṛti. Such display is contrary to the bhakta’s path. Arjuna’s question distinguishes two modes: Saguṇa-bhakti and Nirguṇa-bhakti. The Ārta, Arthārthī, and Jijñāsu generally worship through name and form and may be called Saguṇa-bhaktas; the Jñānī is the Nirguṇa-bhakta. Arjuna asks which of these modes is superior. This doubt belongs not only to Arjuna but to seekers even now. Some insist Saguṇa-bhakti is highest, others Nirguṇa-bhakti, and still others a synthesis. The Gītā resolves the quarrel simply. Paramātma’s judgement, not the quarrel of limited viewpoints, is decisive. The different paths arise from differences in the sādhaka’s standpoint, not from divisions within Sarveśvara. Consider a person with two feet. In certain actions we distinguish right from left, yet for walking both belong to the same person. Injury to either is felt by the whole person. No one wishes pain to one foot merely because the other is called ‘right’. Which foot is ultimately ‘more’ the person? Both together carry the journey. Saguṇa and Nirguṇa are like the two feet of Bhagavān. Each has its proper place and cannot simply be dismissed. One may call Nirguṇa the right foot and Saguṇa the left if an order of spiritual emphasis is needed: Nirguṇa points directly to the goal, while Saguṇa serves powerfully as Sādhana. Yet both enter the same house. The Nirguṇa vision sees the universe itself as Viśveśvara; the Saguṇa vision distinguishes the universe and its Lord for the sake of worship. At the level of Lakṣyārtha they converge. Thread and cloth look different, yet cloth is nothing but threads in relation. Seeing thread and cloth separately resembles Saguṇa-upāsanā; seeing cloth as a configuration of thread resembles Nirguṇa vision. Bhakti does not fall from somewhere outside, nor is it bestowed as a foreign substance. It rises from within as Bhagavad-anurāga. When the stream of Prema that ordinarily runs in many scattered channels becomes one-pointedly directed toward Bhagavān, that current is called Bhakti. Love exists in every living being—even animals and insects have forms of attachment and care. Prema is life, and life expresses itself through Prema. The same basic current takes different names according to where it flows. Toward children it is vātsalya; toward relatives it may become moha; toward the suffering it is karuṇā; toward equals, maitrī; toward objects, icchā or vāñchā. When that love flows toward venerable parents or Ācāryas, it becomes gaurava, vinaya, and obedience. But the love that flows wholly toward Bhagavān is called Bhakti. Instead of letting the current divide into countless channels and lose itself in unrest and sorrow, Bhakti directs it as one stream into the ocean of Bhagavān’s Anugraha. What could be more sacred than allowing the current of life to reach Sacchidānanda rather than dissipating itself in Saṁsāra? The Gopikās are held up as the example: their Manas, Vāk, and Kāya, at all times and places, were offered at Kṛṣṇa’s lotus feet. Therefore Kṛṣṇa Himself called them Yogins. Consider how pure a heart must be for Bhagavān Himself to name it so.