14 భక్తుడు: స్వామి! భారత రామాయణముల సూక్ష్మార్థములు చాలా చక్కగనున్నవి. నిజముగా యోచించిన, అంతకంటే వేరేమున్నవి? ఈ విధమైన భారత రామాయణములు నేటికికూడా మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియముల మూలమున ప్రతి హృదయమునందూ జరుగుచునే యున్నవి. అదేవిధముగా భాగవతము కూడా జరుగుచునే యున్నదని తెలిపితిరి. అది ఎట్లు జరుగుచున్నదో దానిని కూడా కొంత సెలవిచ్చిన భారత, భాగవత, రామాయణముల మూడింటినీ సూక్ష్మరూపమున తెలిసికొని ఆచరించుటకు ప్రారంభింతుము. కాన భాగవతమును సెలవియ్యండి.
స్వామి: నాయనా! భాగవతము ఈ భారత రామాయణములవలె గుణరూపములతో ఉండదు. ఈ గుణము, ఇంద్రియము, మనస్సు, చిత్తము అన్నింటికీ అతీతమైన ఆత్మ యొక్క రూపములు, శక్తి సామర్థ్యములు, వాటియొక్క లీలలు భాగవతము. అన్నింటికీ సాక్షిగా ఉన్నవాని అవతార కథలనే భాగవతమంటారు.
భక్తుడు: అతని రూపము లేవి స్వామి! వారు ఆ రూపము ఎత్తుటకు కారణమేమి?
స్వామి: నిజముగా చెప్పిన, అతను సర్వస్వరూపి, అతని రూపములకు హద్దు లేదు. కాని, ప్రకృతికి గోచరమగునట్లు చెప్పవలెనన్న బ్రహ్మ విష్ణు మహేశ్వర మత్స్యకూర్మ వరాహ వామన నారసింహ రామ కృష్ణ అవతారములు. లోక సృష్టి స్థితిలయముల కొరకు, దుష్టశిక్షణల కొరకు, ఆయాకాలములందు తాను ఏయే రూపమున పోయిన, తన సంకల్పకార్యములు జయప్రదమగునో తలంచుకొని, ఆయా రూపముల తనను తాను సృష్టించుకొనును. ఆ కార్యము పూర్తికాగానే తిరిగి ఆత్మస్వరూపుడుగనే యుండును.
భక్తుడు: స్వామి! రామకృష్ణాదులు కూడను దుష్టశిక్షణ, శిష్ట పరిపాలన చేసిరి కదా! వీనిలో గుణస్వరూపములుండుట, భాగవతమున గుణములు లేకుండుటేమి?
స్వామి: గుణములకు ఆది, అంతము ఉన్నది. ఆత్మకు ఆది, అంతము లేదు. రామకృష్ణాదులుకూడా గుణస్వరూపములుగా లేరే? గుణములకు అతీతులుగా ఉండి, గుణస్వరూపములను ఎట్లు వశపరచుకొనవలెనో చూపించినారు. ముందు చెప్పిన రామాయణ, భారతములకు ముగింపు ఉన్నది కదా? ఆవిధముగా భాగవతమునకు ముగింపే లేదు. ఆది భగవంతుని విషయములు తెలుపును. కాన, భాగవతమని కూడా పేరు, భగవంతుడు ఆద్యంత రహితుడు కదా? ఏయే యుగమున ఏ కార్యము నిమిత్తమై ఏయే కాలములో వచ్చుచుండునో అట్టి అవతార రహస్యమును మాత్రము తెలుపునది భాగవతము; అనిత్యమై, అసత్యమై, అంతములు కలిగిన లోకనీతులను బోధించి సత్యధర్మ శాంతి ప్రేమలను చూపించి, చేయించుటకై వచ్చినవి రామాయణ భారతములు. తెలిసినదా?
భక్తుడు: అయితే, భాగవతము మాకు అవసరమే ఉండదన్న మాట?
స్వామి: పిచ్చివాడా! భాగవతమే సాధకులకు అవసరము. అందులోనే భగవంతుని నిజమైన మర్మములూ, నిజమైన మహాత్మ్యములూ, నిజమైన మార్గములూ ఉన్నవి. రామాయణ భారతములు కొంతవరకూ లౌకికమైన సహజమానవులను ఉద్ధారము చేయుటకు నీతులు బోధించినవి. పరమాత్ముని అనుగ్రహమునకు ఎట్లు పాత్రులగుదురో చూపినవి. ఆత్మార్థమును తెలసుకొనగోరువారు, పరమాత్ముని తెలిసికొనగోరువారు భాగవతమునే ప్రధానముగా పాటింతురు.
భక్తుడు: స్వామి! భగవంతునకూ, భాగవతమునకూ, భక్తునకూ గల సంబంధమేమి?
స్వామి: మహారాజా, యువరాజా, కుమారరాజాకు ఏ సంబంధమో అదే సంబంధము. భగవంతుడు మహారాజు, భాగవతము అందులో రెండవది అనగా, పరబ్రహ్మ స్వరూపమునుంచి పాయలుగా వచ్చినది, కనుక యువరాజు, దీని ఆధారమును కోరి మూడవ స్థానమందున్నది భక్తుడు కాన, కుమారరాజు అనియు పిలువబడును. భక్తుడగు కుమారరాజుది మాత్రము సామాన్యస్థానముగాదు, రాజాస్థానమునకు అతడు అర్హుడు. ఇంక తక్కినవారందరూ వీరి ముగ్గురికి క్రిందవారలే. భక్తులగు కుమారరాజులు కానివారు భగవంతుడను రాజాస్థానమునకు అర్హులుకారు.
భక్తుడు: స్వామి? మరి యోగులు, జ్ఞానులు, తపస్సులు అనుచుందురే; వారికికూడా ఈ స్థానములకు అర్హత లేదా?
స్వామి: ఎవరైననూ సరే, భక్తి లేక పరమార్థమునందు ఇష్టము లేక, వారు మాత్రము యోగులు, జ్ఞానులు, తపస్వులు అగుదురా? వారియందును భక్తి సమాన పదార్థముగా ఉండును. అనగా, లడ్డు, మిఠాయి, మైసూర్పాకు, జిలేబి అను రకరకములైన పదార్థములున్నవనుకో. వానియన్నిటియందూ తీపి అను చక్కెర లేక అదెట్లు తయారగును? అదేరీతిగా, ఈ మూడు మార్గములందు భక్తి అను భగవంతుని మధురనామము చేరియేయుండును. లేకున్న, ఆయా పదార్థములకు ఆయా నామములు వ్యతిరిక్తములు కదా?
భక్తుడు: స్వామి! మరొకటి. భగవంతుడన్న నమ్మకముండి, అతని నామస్మరణ, రూపారాధన, జప, ధ్యాన, భజన, పూజాదులు ఉండిననే భగవంతుని చెంతకు పోవచ్చునా? లేకున్న సత్యమార్గమున, ధర్మమార్గమున, ప్రేమమార్గమున, పరోపకార మార్గమున, ఉన్న పోవుటకు వీలు లేదా?
స్వామి: పాపభీతి, దైవప్రీతి లేకున్ననూ ఈ గుణములు మాత్రము సామాన్యమైనవా? కాదు. ఇవి భగవంతుని అంతఃపురమునకు మార్గములు. వారుకూడానూ సునాయాసముగా అంతఃపురము చేరవచ్చు. అయితే దగ్గర బంధువులకూ, స్నేహితులకూ ఎంత సంబంధమో సద్గుణములద్వారానే తనను చేరువారలకు, ఈ గుణములకు నామరూపములకూడా చేర్చుకొని, తనను చేరువారలకు, ఇంతే వ్యత్యాసము. నామరూపములను స్మరించి ధ్యానించుటవల్ల గుణములుకూడా కొంత స్థిరమగును. ఈ ఆధారము లేని గుణములు అంత పరిశుద్ధముగా ఉండవు. భగవంతుని నామరూపములు కూడా గుణములను శుభ్రపరచును. గుణములను స్థిరము చేయుటే వానిపని కూడనూ.
భక్తుడు: భక్తుడూ, సద్గుణవంతుడూ ఒక్కస్థలమునే చేరుదురు కదా?
స్వామి: తప్పక. వట్టి గుణవంతుడు అర్హుడు కాగలడు. భక్తి భావముతో కూడిన గుణవంతుడు అధికారి కాగలడు.
భక్తుడు: ఇప్పుడు లోకమున చాలామంది, “మానవ సేవే మాధవ సేవ” అని చేస్తున్నారే! వారి కార్యక్రమమునకు అనుగ్రహము లేదా?
స్వామి: లేకేమి? అయితే, నిజముగా మాధవ సేవే అనే భావమున మానవ సేవ చేసినవారికి తప్పక అనుగ్రహమున్నదే. అట్టి నిజమైన భావము వచ్చుట చాలా కష్టము. మానవుడు అను తలంపు లోపల పెట్టుకొని, సేవను చేయువాడు మాత్రము మాధవ సేవ అన్నచో నిండుభావము కాదుగదా? రెండు పాయలైనవిగా ఉండును. మాధవుని సంపూర్ణ శక్తిని తెలిసికొని దానిపై విశ్వాసముంచి సర్వులయందూ మాధవుడున్నాడని దృఢముగా తలంచి, వానికి సేవ చేసిననూ మాధవునికే అని భావించిన, తప్పకవచ్చును. అంతకంటేనా? అట్లుగాక ఏదో పేరు ప్రతిష్టల కొరకు; తత్ ఫలితము, వాంఛలు మనసున ఉంచుకొని పైపైన “మానవ సేవే మాధవ సేవ” అన్న అర్థమే లేదు. నీవనుకున్న ఫలితము రాదు.
భక్తుడు: భలే బాగున్నవి స్వామి, నేటి ఉపదేశములు! భాగవతమును గురించి చెప్పుచుండిననే ఇన్ని పవిత్రనీతులు వచ్చినవే? ఇంక దాని రూపును గురించి చెప్పిన ఇంకెన్ని యథార్థములు రాగలవో? నేటికి నేను ధన్యుడను.
స్వామి: తెలిసినదా భాగవతమన్న! అది అంతములేని ఆత్మకథ, అది సూక్ష్మముననూ, స్ధూలముననూ రెండింటియందు ఒక్కటే. అది సూక్ష్మమునను అతిసూక్ష్మము, స్థూలమున అతిస్థూలము. దానికి ప్రమాణమే లేదు., అది అంతమే లేనిది. భాగవతము సూక్ష్మరూపమున వేరూ స్థూలరూపమున వేరూ లేదు. రామాయణ, భారతములు ఇతిహాసములు. భాగవతము అట్లు కాదు, కేవలము భక్తిమార్గమును తెలుపుతూ ఆత్మ స్వరూపమైయుండును. ఏనాటికైనా భాగవతమునకు అంతము లేదు, రాదు. ఈ యథార్థమే భాగవతముయొక్క అర్థము.