Youth must learn 18 July 1981, Annual meeting of the Kingdom of Sathya Sai, the association of the old students of the Sathya Sai College, the day after Guru Pūrṇimā, Prasanthi Nilayam
satpravartana sadbuddhi satyanirati
His poems 79
Also in his talks (3) సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్యపాలనంబు నేర్పునదె విద్య విద్యార్థి నేర్వవలయు సత్యమును తెల్పు మాట శ్రీసాయి మాట. మనుజుడైనవాడు తన దుర్గుణమ్ముల వరుసనొకటినొకటి వదల వలయు పశుగుణంబు వీడి పశుపతి కావలె సత్యమైన బాట సాయి మాట. జగతి జీవించువాడు మనుజుడు కావలె మొదట దనుజుల దుష్కృతములనెల్ల పొగడుచుండు వాడె చవట బ్రహ్మవిద్య నేర్చి యిచట ఆధ్యాత్మను కనుగొనుట రాజయోగమునకు బాట అదియె శృతులు చెప్పుమాట. ప్రేమస్వరూపులారా! మనిషి అంటే మనసు, ఆలోచన. ఆలోచనయొక్క ప్రభావ ఫలితమే తన తేజస్సు. నిత్యజీవితములో చర్యల పరిణామమును మనము ప్రత్యేకముగా అనుభవించుచున్నాము. ఈనాడు లోకము ఉండవలసినరీతిగా వుండలేదంటే, దీనికి కారణమేమి? మానవునియొక్క చర్యలు వుండవలసినరీతిగా లేకపోవటమే. మానవుని ఆలోచనలు పరిశుద్ధముగా లేకపోవటంచేతనే. మానవుడు అనేకవిధములుగా దుర్మార్గములు అవలంబించుచున్నాడు. కనుక, ఆలోచనలు పరిశుద్ధమై, పవిత్రమై, పరోపకార సంబంధమైనవిగా ఉండినప్పుడే జగత్తు ఉండవలసినరీతిగా ఉంటుంది. మానవుడు చేయు ప్రతి చిన్న పనికీ గమ్యము, లక్ష్యము ఉన్నది. ఏ పనీలేకుండా ఏ వ్యక్తికూడను బజారులో తిరగడు. ఏదో కొన్ని సామానుల నిమిత్తమై మార్కెట్టుకు వెళ్ళి తీసుకొని వచ్చి తన పని పూర్తిచేసుకుంటాడు. విద్యను పొందునిమిత్తమై విద్యార్థి విద్యాలయమునకు వెడుతున్నాడు. అచట తన కర్తవ్యమును నిర్వర్తించుకొని గృహము చేరుచున్నాడు. జీవితము ఒక దీర్ఘప్రయాణము. దానికి ఒక గమ్యము, లక్ష్యము అవసరమనేది మరచిపోతున్నాము. తాను ఎవరికోసం జీవించుచున్నాననే ప్రశ్న ఎవరికివారు వేసుకొన్నప్పుడు సరియైన జవాబు రావటం లేదు. ఏ వ్యక్తిని, ‘అయ్యా! నీవు ఎవరికోసం జీవిస్తున్నావు?’ అని అడిగితే, తాను ధీమాగా, ‘నాకోసం జీవిస్తున్నాను’ అని జవాబు చెప్పుచున్నాడు. ఇది పూర్తి తప్పు జవాబు. ఇంకా అనేక పర్యాయములు ప్రశ్నించినప్పుడు, ‘నాకోసం కాక ఎవరికోసం జీవిస్తున్నాను? నా ఆకలికోసం నేను భుజిస్తున్నాను. నా దప్పికకోసమై నేను త్రాగుతున్నాను. నా గాలిని నేను పీల్చుకుంటున్నాను. నా కాలు తెగితే నేను కట్టు కట్టుకుంటున్నాను, నా రోగమునకు నేను ఔషధము పుచ్చుకుంటున్నాను. నాకు నేనే జీవించుచున్నాను’ అని జవాబిస్తాడు. ఒక మంచముపై ఇరువురు పరుండినప్పుడు ఇరువురికీ వేర్వేరు కలలే వస్తాయిగాని ఒకే కల రావటం లేదు. కనుక, జీవితం నాకోసంకాని పరులకోసం కాదని గట్టిగా జవాబు వస్తుంది. అదే వ్యక్తి ఒక ఉద్యోగనిమిత్తమై ఒక ఆఫీసుకు వెళ్ళి ఆపీసరును ప్రాధేయపడుతుంటాడు. ఆఫీసరు ఏ చిన్న ఉద్యోగమో యిచ్చినప్పుడు, అతని దగ్గర అనేకవిధములుగా మొరపెట్టుకుంటాడు ఆ వ్యక్తి. ‘సార్! నాకు తల్లీ, తండ్రీ వుంటున్నారు, భార్య, నలుగురు పిల్లలుంటున్నారు. ఇంతమందిని నేను ఏరీతిగా సాకవలెను? కనుక, నాకు ఈ జీతము చాలదు. నాకు పెద్ద ఉద్యోగము ఇవ్వాలి’ అని ప్రాధేయపడతాడు. ఈ ఉద్యోగము ఎవరికోసము చేస్తున్నాడు? తనకోసమని కాదుకదా! తనకు తల్లి, తండ్రి, భార్య, బిడ్డలుంటున్నారు. వీరిని పోషించే బాధ్యత తనపై ఉన్నది. కనుక, ఉన్నత ఉద్యోగము కావాలని ప్రార్థించటంలో వుండే అంతరార్థమేమి? కేవలము తనకోసమే తానుకాక తన కుటుంబాన్ని పోషించటంకోసం కూడను.
అదే వ్యక్తిని మరొక ప్రశ్న అడిగిచూడండి. ‘అయ్యా! ప్రశాంతినిలయంలో గురుపౌర్ణిమ జరుగుచున్నది. మేము వెడుతున్నాము, నీవుకూడా వస్తావా?’ ‘సార్! నాకు లీవంతా అయిపోయింది. నేను రావటానికి సాధ్యం కాదు’ అంటాడు. ఇట్టి జవాబు చెప్పిన వ్యక్తి ప్రమాదవశాత్తు తన భార్యకేమైనా రోగం వచ్చిందంటే ఆమెను ఆసుపత్రిలో చేర్చి జీతము నష్టముపైన 15 దినములు ఆసుపత్రిలో ఉంటాడు. ఇంతేకాదు, తనకిష్టమైన గారెలు చేసుకొని భుజించటానికి తట్టలో పెట్టుకొనిన వ్యక్తి, ఎవరో వచ్చి, ‘అయ్యా! నీ కుమారుడు బస్సు క్రిందపడిపోయాడు’ అని చెప్పేటప్పటికి, గారెలను వదలి, ఆకలిని త్యాగంచేసి, బజారుకు పరుగెత్తుతాడు. అతనికి ఆకలి లేదా? ఆ పదార్థముపై ఇష్టము లేదా? పదార్థమన్నా ఇష్టమే. ఆకలి వెంట వుంటున్నది. అన్నింటికంటే ఇష్టమైన తన కుమారుని రక్షించుకొనే నిమిత్తమై, తన భార్యను పోషించుకునే నిమిత్తమై తాను ప్రాకులాడుచుండును. ఇదే వ్యక్తి మొట్టమొదట నాకోసం నేను జీవిస్తున్నాను అనేవాడు. లోకంలో ఈ రెండింటిని మాత్రమే గుర్తించే వ్యక్తులు అనేకమంది వుంటున్నారు. గొప్పగొప్ప విద్యావంతులు, రాజకీయ వేత్తలుకూడా ఈ రెండు కర్తవ్యములనే ముఖ్యముగా గుర్తిస్తున్నారు. దీనివల్లనే లోకమునకు తీరని బాధలు సంభవిస్తున్నాయి. మన జీవితమనేది, కర్తవ్యమనేది ఈ రెండింటియందు మాత్రమే యిమిడివుండటం లేదు. మన గ్రామంలో ఏదో ఒక విపత్తు సంభవించవచ్చు. తీరని వ్యాధులు వచ్చాయి, ఈ సమయమందు గ్రామస్తులందరూ చేరి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ నిర్ణయములో ఈ వ్యక్తికూడను ఒకడు. తన కోసము, తన కుటుంబము కోసము కాదు. గ్రామం కోసము, గ్రామసేవ నిమిత్తమై, గ్రామాభివృద్ధి నిమిత్తమై వ్యక్తులందరూ ఏకోన్ముఖులై నిర్ణయానికి వస్తున్నారు. కనుక, తానుగాక, తన కుటుంబముకాక, సమాజముకూడను ఒకటున్నదనే స్థితిని ప్రతియొక్క వ్యక్తికూడను గుర్తించాలి. మన జీవితమంతయూ సమాజమునందే జీవిస్తుంటుంది. మన పుట్టుక, మన నివాసము, మన అంతము సమాజముతోనే కట్టుబడి ఉంటుంది. సమాజమే లేకుండిన, క్షణమైనా మనము జీవించలేము. సమాజతత్త్వాన్ని, సమాజసత్యాన్ని, సమాజవిశిష్టతను గుర్తించుకొనే వ్యక్తి మాత్రమే సత్యాన్ని గుర్తించగలడు. కొంగ తన పొట్టను మాత్రమే నింపుకోటానికి ప్రయత్నిస్తుంది. ఇతర ప్రాణులయొక్క ఆకలినిగాని, అవస్థలనుగాని తాను ఏమాత్రమూ గుర్తించదు. ఆవిధముగానే ఈనాటి విద్యార్థులు తమ స్వార్థమును మాత్రమే గుర్తించుకొనక సమాజముకూడను వున్నదనే సత్యాన్ని విచారించాలి. తననుంచి ఇంకా పదిమంది సుఖిస్తున్నారనే భావము తాను అనుభవించాలి. అదియే నిజమైన వ్యక్తిత్వము. యువకులందరూ సమాజసేవలో పాల్గొని, ప్రతి ఒక్కడూ సంఘమే నాయొక్క జీవితము అనే నిర్ణయానికి రావాలి. ఈవిధమైన త్యాగమునకు పూనుకున్నప్పుడే జీవితము పవిత్రంగా రూపొందుతుంది. ఈనాడు స్నేహము, స్నేహము అంటారు. యువకులు చెడుమార్గములో స్నేహమును అభివృద్ధిపరచుకుంటున్నారేగాని, పవిత్రమైన, దివ్యమైన, ఉన్నతమైన మార్గమును అవలంబించటానికి ఈ స్నేహము ఏమాత్రమూ పనికిరావటం లేదు. స్నేహమనగా కంటికి రెప్పవలె, కాలికి చెప్పులవలె ఉండాలి. స్నేహితుని మరొక నేనుగా భావించాలి. ఇతరులకు ఏ కీడు జరిగినా అది నాకే జరుగుతున్నదనే సత్యాన్ని గుర్తించుకొన్నప్పుడే నిజమైన స్నేహితుడు కాగలడు. క్షీరములో జలము చేరినప్పుడు జలమునకు కూడను క్షీరము తన విలువనందిస్తుంది. తనయొక్క ఉత్తమ భావములను మిత్రునకు అందిస్తున్నది. పాలు కొని, కాచుటకై మనము స్టౌపైన పెట్టినప్పుడు ఈ జలము బాధపడి, మిత్రత్వాన్ని దూరంచేసుకొని పొంగి అగ్నిలో పడటానికి ప్రయత్నిస్తుంది. తనయొక్క మిత్రుడు తన్ను వదలిపెట్టి పోయెనే అని పాలుకూడను, ఏకాంతవాసాన్ని తాను భరించలేక, పొంగి క్రింద పడిపోవటానికి ప్రయత్నం చేస్తుంది. తక్షణమే మనము నీరు తీసుకొని దానిపైన చల్లుతున్నాము. తిరిగి నా మిత్రుడు చేరినాడని పాలు తగ్గిపోతాయి. ఇది నిజమైన మిత్రత్వము. తన మిత్రుడు తనను ఎడబాసిపోయినప్పుడు తాను ఈ ఎడబాటు సహించుకోలేడు. కాని, ఈనాటి మిత్రత్వము ఏరీతిగా ఉన్నదంటే పోకెట్లో మనీ చూచాడా, తండ్రియొక్క పొజిషన్ చూసాడా, హలో హలో అని వెళ్లిపోతుంటాడు. తండ్రియొక్క అధికారము తగ్గిపోయిందా, పాకెట్లో ఏమీచూడలేదా ‘గుడ్‌బై’ చెప్పి వెళ్లిపోతాడు. ఈనాడు నూటికి నూరుపాళ్లు ఇలాంటి ఫ్రెండ్సే తయారైపోతున్నారు.
చెడుమార్గములోపల, చెడుభావములలోపల, చెడు ప్రవర్తనలలోపల మిత్రత్వమనేది చాలా పెరిగిపోతూంది. ఇది అసత్యమిత్రత్వము. సత్యము చాలా నిదానంగా బయలుదేరేటటువంటిది. ఆంధ్రలోపల అనేకమంది చెప్పుకుంటారు. సత్యమనేది చెప్పులను తొడుక్కునేలోపల అసత్యము జగత్తంతా చుట్టివస్తుందని. ఈనాటి విద్యార్థులయందు సహనభావము క్షీణించిపోయింది. సహనము, కరుణ, సమైక్యము.... ఈ మూడూ ఉండినపుడే ఉన్నత భావాలు అభివృద్ధి అవుతాయి. సానుభూతి, కరుణ ఈ రెండూ వుండినప్పుడే పశుత్వమునుండి మానవత్వానికి చేరుకోవచ్చును. మన కళాశాల విద్యార్థులు పశువులుగాక పశుపతులుగా దేదీప్యమానముగా జగత్తునకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలని ఆశిస్తున్నాను. అన్నము లేక అలమటించుచున్న సమయములో పట్టెడన్నము పొట్టన పెట్టినప్పుడే ఎంతో కృతజ్ఞత చూపుచున్నాము. అనారోగ్యము సంభవించినప్పుడు డాక్టరు వచ్చి రోగనివారణ చేసినప్పుడే అతనికి ఎంతో కృతజ్ఞతను అర్పిస్తుంటాము. కష్టాల సమయములో ఆదుకొన్న వ్యక్తులకు ఎంతగానో కృతజ్ఞత చూపుతుంటాము. ఉద్యోగములు లేక అల్లాడుచున్న వారికి ఏ చిన్న ఉద్యోగము ఇచ్చినప్పటికీ ఆ ఆఫీసరును ఎంతనో స్మరిస్తుంటాడు. కాని, జన్మనిచ్చి, గుణములనిచ్చి, బుద్ధినిచ్చి రక్షించే దైవమునకు మనము ఏమి కృతజ్ఞతలు చూపుతున్నాము? అలెగ్జాండరు, ‘దేహమునిచ్చిన తల్లికి, పోషించిన తండ్రికి జీవితమంతా నేను ఋణపడి వుంటాను. అయితే, ఈ దేహమును తల్లి ద్వారా పంపించిన దైవానికి ఏమి కృతజ్ఞత చెప్పాలి? బుద్ధి, చిత్తము, అంతఃకరణ తత్త్వములను నాకు తల్లిదండ్రులు అందించలేదు. ఇవన్నీ దైవముయొక్క కల్పనలే, బహుమతులే. కనుక, నా రక్తము వుండినంతవరకు నేను దైవానికి గౌరవాన్ని అందిస్తాను’ అన్నాడు. ఈనాటి పరిస్థితి దీనికి విరుద్ధంగా మారిపోతున్నది. తల్లిదండ్రులనుగాని, బంధుమిత్రులనుగాని ఏమాత్రమూ లెక్కచేయక తమ స్వార్థమునే అనుభవించటానికి ప్రయత్నిస్తున్నాడు. నిజముగా ఈ వయస్సు చాలా ప్రమాదకరమైనది, ప్రధానమైనది. ఏమైనా దారి తప్పిననూ ప్రమాదమే. సక్రమమైన మార్గమును అవలంబించితిమా గమ్యమును చేరతాము. ఉన్నత గతికి పోవటానికిగాని, అధోగతికి దిగజారటానికిగాని మన తలంపులే కారణము. ఈనాటి విద్యార్థి తన విద్యను పూర్తిగా గరపిన తర్వాత ఏదో తన పోషణ నిమిత్తమై అనేకవిధములుగా ప్రయత్నము చేస్తుంటాడు. ధనమును అభివృద్ధి పరచుకొని పెద్ద శ్రీమంతుడు కావాలని ఆశిస్తుంటాడు. శ్రీమంతునియొక్క సుఖము ఎట్టిదో మీరు గుర్తించుకోలేకపోతున్నారు. శ్రీమంతునకు ధనము ఒకవిధమైన ఆహారాన్ని అందిస్తుంది గాని ఆకలిని అందించదు. ఈ శ్రీమంతునికి శక్తివంతమైన ఔషధములు చిక్కవచ్చునుగాని రోగము స్వాధీనములో ఉండదు. సేవకులు చిక్కవచ్చునుగాని స్నేహితులు చిక్కరు. సుఖము ఉండవచ్చుగాని శాంతి శూన్యము. గుణములో శ్రీమంతుడు కావాలి. గుణములో సర్వ శక్తులూ తనలో ప్రవేశిస్తుంటాయి. మనకు ధనలక్ష్మిగాని, రాజ్యలక్ష్మిగాని, ఏ లక్ష్మి అయినా దగ్గర ఉండాలనుకుంటే శీలము. శౌర్యము, యశస్సు దగ్గర ఉండాలి. శీలము లేనటువంటి సమయములో శౌర్యము ఎక్కడనుండి వస్తుంది? యశస్సు ఎక్కడనుండి వస్తుంది? రాజ్యలక్ష్మి మనకు ఎక్కడ నిలుస్తుంది? కనుక, మొట్టమొదట మనము మనయొక్క గుణమును, శీలమును అభివృద్ధి పరచుకొనవలెను. దివ్యమైన సత్యమార్గము నీతినిజాయతీల మార్గమే సరియైన శీలము. కృతజ్ఞతలను మనం హీనముచేసుకొని, మనకు చేసిన ఉపకారము విస్మరించి, ఇంక ఎన్నివిధములైన అభివృద్ధులకు పాటుపడినప్పటికీ, అది నిజమైన శీలము కాదు. సత్యము, త్యాగము, ప్రేమ, నిస్వార్థసేవ ఈ నాల్గింటి ఏకత్వమే శీలము. మన కాన్షియన్సు తృప్తిగాలేనట్టి సమయములో మన నడతను క్యారెక్టరని చెప్పటానికి ఎట్లా వీలవుతుంది? కేవలము చదువు, చదువు. ‘చదువులన్నియు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవవలయు’. నీవు వైజ్ఞానికుడైపోయి నీ చేతినుంచి మంచి కార్యములేమైనా చేస్తున్నావా? ఇంకా అనేక రకములైన విద్యలు నేర్చి సమాజముయొక్క సేవలో పాల్గొంటున్నావా? పరులను నొప్పించకూడదనే పవిత్ర భావము నీలో ఏమైనా ఆవిర్భవించిందా? నీ జీవితమంతా పరులను నొప్పించటం. ఉపకారము చేసినవారికి అపకారాన్నే తలంచటం! ఇది నిజమైన లక్షణమా? బహుళ గ్రంథ పరిచయము చేసుకొన్నంత మాత్రమున నీవు విద్యావంతుడవౌతావా? కాదు, కాదు. విద్యావంతుడనగా పరులను బాధించక, పరులను ప్రేమించి, వినయవిధేయతలచేత తల్లిదండ్రులను తృప్తిపరచటమే.
మనలో దురాశలు, అనుమానములు మరింత పెరిగిపోతున్నాయి. నిజంగా మానవునికి అనుమానమనేది పెద్ద పెనుభూతము. అది అగాధ సముద్రము. అది కంటికి నిద్రగాని, కడుపుకు తిండిగాని చేరనీయక పిశాచివలె పీడిస్తుంది. దీనికి కారణము ఆధ్యాత్మికము హృదయమునందు నాటుకొనిపోకుండా ఉండటమే. మనము ఇంత విజ్ఞానప్రజ్ఞానములను సాధించి, కట్టకడపట దైవముతో చేరక దయ్యములుగా ప్రవర్తిస్తున్నాము. ఈనాడు యువకులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ తమయొక్క ఆత్మతృప్తిని అనుభవిస్తూపోతుంటే దైవముయొక్క అనుగ్రహము నిరంతరము ఉంటుంది. ఈనాటి యువకులు అవినీతిలో మునిగినారు. మరొకరి నీతిని చేయిచూపటానికి ప్రయత్నిస్తున్నారు. అవినీతి మార్గములో ప్రవేశించే వ్యక్తికి ఇతరుల నీతినిజాయతీలను చూపే అధికారము ఎక్కడుంది? ఇలాంటి విద్యలు ఈనాడు అభివృద్ధిగాంచటంచేత యువకులయందు మానవత్వమే క్షణక్షణము క్షీణించిపోతుంది. ఈ పరిస్థితిని సాయి గమనించి, సత్యమార్గమును ఆదర్శంగా నిరూపించాలనే ఉద్దేశ్యముచేత ఈ కళాశాలను స్థాపిస్తూవచ్చారు. విద్యార్థులలో ప్రధానమైనవి శీలము, త్యాగము. త్యాగము మోక్షద్వారమును తెరిచే బంగారు బీగముచెవి వంటిది. ఇదియే విద్యకు సరియైన లక్షణము. పాతవారుగాని, కొత్తవారుగాని విద్యార్థులందరూ ఈ రెండునూ నేత్రములుగా విశ్వసించి, అభివృద్ధిపరచుకోవాలి. ఈ నేత్రములను కోల్పోతే అంధులమైపోతాము. మీ మంచికోసమని, మీ ఉన్నతస్థాయికోసమని, అభివృద్ధికోసమని మార్గదర్శకముకోసమని సాయి సర్వమూ చేస్తున్నాడు. కాని మీ యోగ్యతలు చాలా తక్కువగా ఉండటంచేత దీనికి అనేక చెడు అర్థాలుకూడను మీరు భావించవచ్చు. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి భవనాలను కట్టించటము, హాస్టళ్లను నిర్మించటము ఈ కళాశాలను నిర్మించటము ఇవన్నీకూడను సాయికోసం కాదు. లోకంలో ఎన్నో కళాశాలలు ఉండినప్పటికీ మన కళాశాలలు ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే విద్యార్థులు తయారవుతారనే ఉద్దేశ్యముతోనే స్థాపిస్తూవచ్చాము. నిజముగా మనము సరియైన కర్మను ఆచరిస్తూ సమాజములో దుమికి సేవచేస్తుంటే మన మానవత్వము సార్థకము గావించుకుంటాము. నిజముగా మానవత్వమనేది మనలో ఉన్నదా అని ఎవరికివారు పరీక్షచేసుకుంటే ఎక్కడా కనిపించటంలేదు. అధ్యాపకుడనగా ఇచ్చేవాడు; విద్యార్థి అనగా పుచ్చుకొనేవాడు. ఇచ్చేదానికి టీచరు దగ్గర ఏమైనా సరుకుండాలికదా! పుచ్చుకోవటానికి వీడుకూడను సంసిద్ధుడై ఉండాలికదా! పుచ్చుకోటానికి విద్యార్థి సిద్ధముగా లేడు. టీచర్ దగ్గర సరుకు లేదు. అధ్యాపకుడనేవాడు నీటిట్యాంకువంటివాడుగా ఉండాలి. విద్యార్థి ట్యాపుగా ఉండాలి. ట్యాంకు నిండుకు నీరుంటేనే ట్యాపులో నీరు వస్తుంది. అయితే, మరొక్కటికూడా యోచించాలి. ట్యాంకులో కంపుకొట్టే నీరుంటే అదే నీరు ట్యాపులో వస్తుంది. కనుక, ఎట్టి అధ్యాపకుడో అట్టి విద్యార్థి తయారయిపోతుంటాడు. ముఖ్యముగా ఈనాడు విద్యార్థులలో సోమరితనము అధికమైపోతూ వస్తున్నది. నయాపైసా పనిచేయరు. నాలుగువందలు జీతము కావాలంటారు. వేసుకున్న దుస్తులు ఏమాత్రమూ చెదరకూడదు. చల్లని గాలినిచ్చే ఫ్యాను క్రిందనో, ఏర్కండిషన్ రూములోనో కూర్చోవాలి. సుఖంగా కూర్చొని వేలకొద్దీ రూపాయలు సంపాదించాలి. ఇంతకంటే దుర్మార్గమైన మార్గము ఒకటి ఉన్నదా! ఇది కేవలము దేశాన్ని కొల్లగొట్టేటువంటి మార్గము. రెక్కలాడితే డొక్కలాడుతాయి అన్నట్లు మనము చేతినిండుగా పనిచేయకుండా ధనము రావాలని కోరుతున్నాము. ఇది దురాశ కదా! ఈ ధనము ఎవరిస్తున్నారు? ప్రభుత్వము, ప్రభుత్వము అంటున్నారు. ప్రభుత్వానికి ఎవరందిస్తున్నారు? ప్రజలు కదా. కనుక, కట్టకడపటికి మన విద్యలంతయూ ప్రజలను కొల్లగొట్టే మార్గములో ప్రవేశింపజేస్తున్నాయి. విద్యార్థులారా! మీరు ఇట్టి దుర్మార్గములైన భావములను హృదయములో పెంచుకొనక, కష్టపడి, శ్రమించి, చెమటోడ్చి సాధించే ధనముతో జీవించినారంటే మీ కుటుంబము, మీరుకూడను చిరస్థాయిగా క్షేమసంతోషాన్ని అనుభవిస్తుంటారు.
ఇన్ని విధములుగా మీకు బోధించి, చంటిబిడ్డలవలె పోషించి అనేక సదుపాయములు కల్పించి, విద్యనభ్యసింపజేసిన స్వామి తత్త్వాన్ని మీరు మరచితిరా, ఇక మీ జీవితాన్నే మరచిపోవలసివస్తుంది. స్వామికి కృతజ్ఞత అందించవలెననిగాని, తీసుకోవాలనిగాని ఏ దురాశా లేదు. ఇది మీనిమిత్తమై చెప్పే సుబోధ. గౌరవమర్యాదలచేత ఆదర్శవంతమైన జీవితాన్ని మీరు గడిపినప్పుడే మన కళాశాలలో చదివినందుకుగాని, యావత్ ప్రపంచానికి మీరు అందించే సందేశములోగాని స్థిరత్వము ఏర్పడుతుంది. కనుక, మొట్టమొదట త్యాగము, శీలము రెండునూ నేత్రములుగా తీసుకోండి. ఈ మార్గాన్ని యువకులు అవలంబించినప్పుడు భారతదేశంలో ఎట్టి కొరతా ఉండదు. మొట్టమొదట నమ్మకాన్ని అభివృద్ధిపరచుకోవాలి. విద్యార్థులారా! మీరు ఈ విషయములన్నియు హృదయములో చేర్చుకొని, పవిత్ర భావాల్ని స్మరించి, చింతించి వానిని ఆచరణయందు ఉంచి, మీరు సార్థకతనొందుతారని నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.