Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1987
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
176
Keep
వ్యక్తి మోక్షము కోరుట స్వార్థమగును
తాను గమ్యము చేరుట ధర్మమగున!
పరుల గమ్యము చేర్చుటే పాడియగును
ఇట్టి మనుజుడే నిజమైన మానవుండు.
177
Keep
కలసిమెలసి తిరుగుదాం కలసిమెలసి పెరుగుదాం
కలసిమెలసి కలిమిచెలిమి బలముగుణము పెంచుదాం
కలసిమెలసి తెలుసుకొన్న తెలివిని పోషించుదాం
కలసిమెలసి కలిమితోడ చెలిమిగ జీవించుదాం
శాంతిశాంతి శాంతియని శాంతిపూజ చేయుదాం
ఓంఓంఓం అనుచు ఓంకారము పాడుదాం.
178
Keep
కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన
కరతలా మలకంబు కాదు భక్తి
నోటితో మంత్రంబు నుచ్చరించినయంత
చేసిన పాపంబు చెదిరి పోదు
గీతను చేబట్టి కేకలు వేసిన
పుణ్యము మనయింట ప్రోవు పడదు
చెప్పు మాటలకును చేయు పనులకును
సామ్యముండెడి వాడె సాధువగును
అహము పరనిందయను పాడు కుళ్ళు తీసి
సర్వ జీవులందు సర్వేశ్వరుండు ఒక్కడే అన్న
భావమ్ము మదియందు నిల్పుకున్న
ఆనాడె సాధుసంఘంబు అభివృద్ధిగాంచునయ్య.
179
Keep
తానె తరియించగోరుట ధర్మమగునా?
పరుల తరియింపగోరుటె భాగ్యమగును
తరచిచూడ అతనె నిజమైన మానవుండు
180
Keep
పుస్తకముల్ పఠించితిని పూర్తిగజూచితి సర్వ శాస్త్రముల్
నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల? నీ
హస్తయుగంబు మోడ్చి పరమాత్మను భక్తితొ కొల్వలేని యీ
ప్రస్తుత విద్యలన్నియును పాడగు విద్యలె చూడ మానవా!
181
Keep
వదలవలయునునీ జగద్భావములను
తెలియవలయును నీ జీవదివ్యతత్త్వ
మరుగవలయు బ్రహ్మపదము
కలుగు ఆనందమిదియని తెలుపతరమ!
182
Keep
వదలవలసిన దానిని వదలినంత
తెలియవలసిన దానిని తెలిసినంత
చేరవలసిన దానిని చేరినంత
కలుగు ఆనందమిదియని తెలుప వశమె!
183
Keep
శాస్త్రంబునెప్పుడు సత్యంబుగానెంచు
వేదసమ్మతమగు విప్రులార
దేశంబు కొరకునై దేహమర్పణ చేయు
రహిమించు రాజాధిరాజులార!
ధనధాన్యములు కల్గి ధర్మగుణాలతో
అలరుచుండెడి ఆర్యవైశ్యులార!
వ్యవసాయవృత్తిలో వర్థిల్లుచుండియు
సుఖజీవనము చేయు శూద్రులార!
కాలమంతయునూరక గడపనేల?
సర్వజన సమ్మతంబగు సత్యమైన
భక్తిమార్గముగొనుడిహపరములిచ్చి
సత్యముగ మిమ్ము సాకును సాయిబాబ.
184
Keep
హృదయమనే క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు
దాని చుట్టు వనస్పతుల కలపకంప పెరిగియుండు
కలుపు తీసి చూడరయ్య కల్పతరువు కానబడును
అదియె శుభేచ్ఛనొసగు శుభకామధేనువు
186
Keep
ఒకనాడు యోగంబు ఒకనాడు రోగంబు
అనుభవించెడువారి నరయుచుంటి
ఒకనాడు త్యాగంబు ఒకనాడు భోగంబు
అనుభవించెడివారి నరయుచుంటి
ఒకనాడు సంపత్తు ఒకయేడు దారిద్ర్యము
అనుభవించెడివారి నరయుచుంటి
ఒకనాడు దుఃఖము వేరొకనాడు సుఖంబు
అనుభవించెడివారి నరయుచుంటి
ఇందు సుస్థిరమైనది యెద్ది లేదు
స్థిరము కానట్టిదానికి మురిసిపోక
సత్యనిత్యము జ్ఞానంబు అనంతమైన
187
Keep
పాటలు పాడిన ఫలమేమి?
మంచి మాటలు నేర్చిన మహిమేమి?
సూటిగ సాయి బాటలో నడచిన
సుఖమను మూటలు దొరకునుగా
ఇహపరసఖమను మూటలు దొరకునుగా
188
Keep
భుక్తి విద్యలన్ని భక్తితో చదివేరు
ముక్తి చదువుకెవరు ముందు రారు
ఇట్టివారు నన్ను ఎరుగంగనేర్తురా
ఎట్టి విద్యలుండి ఏమి ఫలము!
189
Keep
సత్యధర్మమహింసయు శాంతిప్రేమ
మానవుని పంచ ప్రాణాలు మహిని వెలయు
పంచప్రాణాలలో ప్రేమ ఎంతొ హెచ్చు
కాన హృదయాన ప్రేమను గట్టి పరచు.
190
Keep
అర్థ అధికార బలములు అరయనెల్ల
భక్తిముక్తుల సాధింప పనికి రావు
అటులె విద్యాధనముకూడ ఎట్టిదైన
దైవబలమొక్కటె నరుని దరిని జేర్చు.
191
Keep
జపమహా నిత్యాగ్ని తపములు చేసిన
సరిరావు హరినామ స్మరణకన్న
తీర్థయాత్రలు కొన్ని తిరిగి సేవించిన
సరిరావు హరినామ స్మరణకన్న
ఉపవాస వ్రతములు విడువక చేసిన
సరిరావు హరినామ స్మరణకన్న
అశ్వమేధంబులు అమితంబుగా జేయ
సరిరావు హరినామ స్మరణకన్న
అడవిలోపల ఆకులలములు తినుచు
సంచరించిన ఫలమేమి సాధువర్య
ఎంచి చూడగ యివియన్ని ఏమి ఫలము?
స్మరణ లేక హరి కరుణ కలుగబోదు.
192
Keep
కాలగతి సర్వ సంపదలు కోలుపోయె
మిగులు సిరి నేను మీకును మీరు నాకు
కాన ఏ కలవారికైన అమ్ముకొని
ఈ ఋషి ఋుణము తీర్చుకొమ్ము.
193
Keep
మాటలందు తీపి మనసున చేదుంచ
మంచికాదు మీకు మచ్చగాని
మచ్చలేని బ్రతుకె మహిలోన చెల్లురా
ఉన్నమాట తెలుపుచున్న మాట.
194
Keep
కంటిగ్రుడ్డుకు కాటుక అంటనట్లు
జిడ్డునేమాత్రమంటక జిహ్వయుండు
బురద అంటని తామరపూవునట్లు
దేనినంటకయుండును దివ్యమాత్మ.
195
Keep
పరుల దూరుచున్న పాప ఫలంబబ్బు
విడవదెన్నటికిని విశ్వమందు
పరులు పరులు కాదు పరమాత్ముడేయగు
ఉన్నమాట తెలుపుచున్న మాట.
196
Keep
విశ్వమందు విభుడు వెల్గుచునుండును
విభునియందు వెలుగు విశ్వమెపుడు
విభుడు వెలగకున్న విశ్వంబు వెలుగదు
విశ్వవిభుల మైత్రి శాశ్వతంబు.
197
Keep
కోటీశ్వరులకైన కూడుగుడ్డయెగాని
బంగారమును తిని బ్రతుక లేరు
కాలమేగాకున్న కఱ్ఱయే పామగు
కలసి వచ్చిన మట్టి కనకమగును
పండితుడొకచోట పశువుగా మారును
మూర్ఖుండొక తరిని మునిగ మారు
ధనవంతునొక పరి దారిద్య్ర దేవత
ప్రేమించి వానితో వరుసలాడు
ప్రాకులాటయెగాని ప్రాప్తియే లేకున్న
దమ్మిడయిన నీకు దరికి రాదు
వద్దు బాబు వద్దు హద్దు మీరిన ఆశ
బుద్ధి కలిగి మెలగు పెద్ద మనిషి
బుద్ధితో మెలగుము సాయి వద్ద.
198
Keep
వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు
బాబకెందుకొ నవ్వుగొలుపు
నీలోన నాలోన నిదురచెందే వలపు
మేలుకొంటే లేదు పిలుపు
విశ్వమంతా ప్రాణవిభుని మందిరమైన
వీధివాకిలి ఏదటో!
విశ్వవిభుడే నా వెనువెంటనేయుండ
పిలుపేది తలుపేది వీధివాకిలి ఏది?
వీణతంత్రులు మీటి ప్రాణతంత్రులు నాటి
ఆనందభాష్పములు
ఆత్మార్పణము చేసి కైలాసమే చూడరా
ఓ జీవ! వీధివాకిలి కానరా!
199
Keep
కట్టెలందున నిప్పులు కలుగునట్లు
తిలలయందున తైలంబు వెలయు పగిది
ఎందుజూచిన దైవంబె యిమిడియుండు
విశ్వసించుడు మదిని విద్యార్థులార!
200
Keep
గ్రంథంబులన్నియు గాలించి చూచిన
సత్యసాయి పలుకు సత్యవాక్కు
వేదములన్నియు వెదకి చూచినగాని
సత్యసాయి పలుకు సత్యవాక్కు
శాస్త్రములన్నియు చదివి చూచినగాని
సత్యసాయి పలుకు సత్యవాక్కు
గాయత్రి మంత్రంబు ఘనముగా చెప్పిన
సత్యసాయి పలుకు సత్యవాక్కు
ధర్మ శాస్త్రములను తరచి తరచి చూడ
సత్యసాయి పలుకు సత్యవాక్కు
స్తోత్ర పాఠములను శోధించి చూడగ
సత్యసాయి పలుకు సత్యవాక్కు.
201
Keep
సత్యసారము తెలుసుకోరన్నా ఈ తత్త్వమెరిగి జన్మమొందన్నా
ఈ ధర్మమెరిగి మన్ననొందన్నా పామరత్వము పాడుచేసి
నియమనిష్ఠలు ఎత్తి నిల్పి సత్యసాయిని తెలుసుకోరన్నా
దేహభావము వీడరోరన్నా అందమెందు యిందు లేదన్నా
అందమైన ఆత్మ విడిచి నింద్యమైన తనువు నేనని
తలపు వీడి శాశ్వాతముగ తత్త్వభావము ఎరుగరోరన్నా
202
Keep
మనసు నిగ్రహంబె మంచికి మార్గంబు
మనసు నిగ్రహంబె మహిని శక్తి
నిగ్రహంపు శక్తి నీరధి ముత్యంబు
203
Keep
భక్తులందరుజేరి భగవంతుడాయంచు
చెవులకింపుగ నుతిచేయు దినము
బీదల వెతలన్ని ప్రీతితో తొలగించి
అన్నదమ్ముల మాడ్కినున్న దినము
దైవచింతనజేయు దాసబృందములకు
ప్రీతి మృష్ఠాన్నము పెట్టు దినము
మహనీయులెవరైన మనకడకేతెంచి
చెలిమి బాబా కథల్ చెప్పు దినము
భావమున భక్తిగూర్చు సౌభాగ్య దినము
దినముగాని తక్కినవన్ని దినములగునె
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
204
Keep
మానవత్వమనగ మనసు మాట క్రియయు
అన్ని ఒక్కటిగనె అతికియుండు
మనసునందు ఒకటి మాటయు క్రియయును
వేరువేరులైన విలువదేమి?
205
Keep
నేటి విద్యలెల్ల నిధి సేకరణకౌను
పూర్వ విద్యలన్ని పూజ్యమయ్యె
పక్షి పల్కులిడదె బహువిధ బోధలన్
సత్యమైన బాట సాయి మాట.
206
Keep
వేదవిద్యలన్ని వెలయంగ చదివియు
నేర్పు మాటలందు నిపుణులయ్యు
సద్గుణుండు కాక సంస్కారి కాకున్న
పదునులేని భూమి పండనట్లె.
207
Keep
బ్రహ్మ దర్శన భాగ్యంబు బడయగోరి
వెదుకబోదువువెచటికే వెఱ్ఱి మనస
అదియు నీలోననున్నది అరుగుమచట
సత్యమునుదెల్పు మాట ఈ సాయి మాట.
208
Keep
జగతి యందు పుణ్యపురుషులు లేకున్న
జగతి యెట్లు వెలుగు పగలుగాను
209
Keep
పలు మతముల వారిచ్చట
నలుమూలలనుండి వచ్చి నయభయములతో
కలిమియు లేమిని తలపక
పలు బాధలకోర్చియుంద్రు బాబా కొరకై.
210
Keep
ఒక్క గూటి పిట్టలం
ఒక్క తీగ పువ్వులం
ఒక్క తల్లి పిల్లలం
ఒక్క జాతి బిడ్డలం
మనలో మనకు కలతలెందుకు.
211
Keep
దూషణంబు హింస దూరంబుగానెట్టి
దైవచింత తాను దండిపరచి
ప్రిమతోడ తాను ప్రజలను చూచిన
దైవప్రేమ తనకె దండి ఉండు.
212
Keep
పక్షి బలమున ఎగిరెడు పక్షులట్లు
అది విహగ మార్గంబుననుసరించి
చేరవలయును గమ్యంబు శీఘ్రగతిని
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.
213
Keep
పొట్టకోసం విద్యకాదని ప్రజ్ఞకోసం చదువుకొమ్మని
చదువు మర్మం తెలిసినట్టి సత్యరూపుడె నిత్యగురువు
ప్రేమ తత్వం ప్రబోధించి మమత సమతను పొందు పరచి
మానవత్వం తెలిపినట్టి ప్రేమరూపుడె సత్యగురువు.
214
Keep
మనసె కారణంబు మరియందునుండిన
ఇల్లు అడవి ముక్తినీయలేవు
మనసు లేనివాడు మందిరముననున్న
కాననముననున్న కార్యమేమి?
215
Keep
సద్గుణంబులు త్యాగంబు సత్యనిష్ట
లేని జీవుడు ప్రాణంబు లేనివాడె
సేవ చేయని జీవుండు చీకటింట
అంధ జీవుడంచుననగ వచ్చు.
216
Keep
కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించు
జోగి భోగిగజేయు భోగి జోగినజేయు
పిచ్చిని పట్టించు పిచ్చిని పోగొట్టు
పుట్టించు రక్షించు హతమొనర్చు.
217
Keep
భవ్యభావాలు కల్గిన భారతీయ
దివ్య సంస్కృతి తత్త్వంబు తెలిసికొనగ
భారతీయులె యత్నింపనేరరైరి
ఇంతకన్నను దౌర్భాగ్యమేమి కలదు?
218
Keep
నేను వెలుగులోనున్నాను నేనెవెలుగు
వెలుగు నాలోన ఉన్నది వెలుగు నేనె
అనుచు తలచుచు చిత్తాన హత్తుకొన్న
అట్టి జ్ఞానియె బ్రహ్మలో ఐక్యమగును.
219
Keep
కూటికిలేక కష్టముల్ కోటికివచ్చినన్
ఆలుబిడ్డలు కాటికి నేగినన్, సంపదలుకూలినన్
తీరని రోగములు ప్రాప్తియైనను
220
Keep
చదువుల్ నేర్చితినంచు గర్వము వహించన్రాదు నీకున్న యా
చదువేపాటిది, విద్యకున్ వినయమే సద్రూపమౌ, నేర్వద
గ్గది యెంతో కలదంచు గర్వదురహంకారమ్ములన్ బాయుడీ
హృది దానన్ తలపోయుచుండు సుగతీ! ఓయీ అవిద్యాపతీ!
221
Keep
నాస్తికభావము నల్గడ నిస్తులమైయుండి
విషయములందున్ ఆస్తికభావము నెలకొల్పి
నిస్తులమైయుండె సాయి నిశ్చలప్రేమన.
Previous
←
1986
Next
1988
→