Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1989
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
264
Keep
ఆత్మశుద్ధి లేని అవని చదువులందు
క్రోధమత్సరములు కూడియుండు
చీకటింటిలోన చేరును గబ్బిలం
బున్నమాట తెలుపుచున్న మాట.
265
Keep
ఉత్తమ పురుషుల కోసము చేసిన
చిత్తము నిలుచును నిజమండి
మత్తుడై మరి మోహము చెందిన
మొత్తును యముడిట నిజమండీ.
266
Keep
కనులలోన కలుగు కాంతియే దేవుండు
పిలుపులోన కలుగు ప్రియమునతడె
మేథ ఉన్నదంచు మీరకు దైవాజ్ఞ
కూలద్రోయజూచు కుటిలునెపుడు.
267
Keep
నమ్మక చెడిన వారలున్నారుకాని
నమ్మి చెడిన వారేనాడు లేరటంచు
బుధుల వాక్కును మీరాలకించుడోయి
సంశమును వీడి సాయిని చెరరోయి.
నమ్మి కొల్వ రాయి నారాయణుండౌను
నమ్మకున్న వట్టి దిమ్మె సుమ్మి
నమ్మి చెడినవారు నరులయందున లేరు
ఉన్న మాట తెలుపుచున్న మాట.
268
Keep
ప్రేమయనెడి పంట పండింప నలవికాదు
ప్రేమ అమ్ముట అదియంత వీలుకాదు
అహము వదలివేయనావిర్భవించు ప్రేమ
మరువబోకుడిట్టి మంచి మాట.
269
Keep
బ్రహ్మజ్ఞానంబునెరుగక బ్రాహ్మణుండ?
సమతభావంబు లేకున్న సజ్జనుండ?
మంచితనమును లేకున్న మానవుండ?
చెప్పరయ్య మీరలె ఒప్పుకొందు.
270
Keep
హస్తమున అణుబాంబు ఉంచుక
అరచుచుందురు శాంతిశాంతని
చంద్రు చేరగల్గికూడను
చెందజాలరు శాంతిసుఖములు.
271
Keep
తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చు
భజన లేకుండ పరభక్తి పరగ రాదు
తత్త్వమెరుగక భవవార్థి దాటలేరు.
272
Keep
పచ్చని రాజవంశవని పాడొనరింప జనించినాడు
కార్చిచ్చయి రేడు సూతసుతు స్నేహము దానికి తోడు గాడుపై కచ్చలు రేపెనాశకునిగాడు రగుల్కొనె మంట మింట వివ్వచ్చునివింటనింక శరవర్షము తప్పదు విశ్వశాంతికై.
273
Keep
జీర్ణకోశాలు దేహాన చేర్చెనెవరు?
జనన మరణాలు నెవరిచే జరుగుచుండె?
అతని గుర్తింప నేరరైరి యీ మూఢ మానవులు.
274
Keep
భయమను దయ్యమును పారద్రోలినిర్భయముగ నుండరయ్య
పాపంబన భయముండవలెనయ్యా లోకముతోటి భయము నీకేలనయ్యా?
అందరికి భయపడి దేవదేవుని భజన చేయగలేక
భ్రమచెంది మరణించు సమయమందున
బలిమి మీరగ యముడు రమ్మిక రమ్మనుచు లాగంగ అప్పుడు
అయ్యయ్యో అని ఏడ్వంగ నెవరడ్డగింప వత్తురయ్యా?
275
Keep
నేటి విద్యలు పొట్టకూటికోసమెగాని,
ధర్మధార్మిక విద్య తెలుపలేవు
ఇట్టి విద్యలు నేర్చి ఏమి ఫలము?
276
Keep
ప్రాణికోటికి నెవ్వాడు ప్రియతముండు?
సత్యమణకువ మధుర భాషాభియుతుడు
అంధుడగువాడెవ్వడీ అవనియందు?
చదువుకల్గియు చెడును సలుపువాడు.
277
Keep
ప్రేమరూపంబు బ్రహ్మంబు ప్రేమమయము
ప్రేమ ప్రేమతొ సంధింప నీమమగును
కాన ప్రేమను గట్టిగా కల్గియున్న
అద్వితీయమునొందగ అర్హుడగును.
278
Keep
గాలిలోన జ్యోతి కదలాడుచుండును
గాలిలేని చోట కదలకుండు
ఆశయనెడు గాలి అణగదొక్కినయంత
మంచిదౌను మనసు మరుగు విడచి.
279
Keep
విమలభావంబు కలుగుటే విద్యయగును
సరసగుణములు కలుగుటే చదువులగును
సహజభావము కలుగుటే సరసమగును
మంచి నడతలు కలవాడె మానవుండు.
280
Keep
మనసు నిల్పినవాడెపో మానవుండు
బుద్ధినెరిగిన మనుజుండె బుధవరుండు
చెప్పుచేతలు ఒకటైన శ్రేష్ఠుడగును
ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు
281
Keep
అని దేహమును వీడి చనెడివారు
నాది నేనను భ్రాంతి అనర్హమంచు
ఏడ్చు ప్రకృతి జనని బాష్పవృష్టి తెల్పు
ప్రాణి జీవించ ప్రకృతియె పాఠశాల
సద్గురుడు సాయి శ్రీహరి కాదె జూడ.
282
Keep
క్షణములోపల పుట్టుచు క్షణములోనె
పెరుగునట్టిది ఎప్పుడు ప్రేమకాదు
చావుపుట్టుక లేనట్టి జీవి హృదిని
నిత్యనిర్మల జ్యోతియై నెగడు ప్రేమ
283
Keep
జాతి భేదము లేక జనులకాశ్రయమిచ్చి
సర్వ సమత్వంబు చాటు తరులు
తనువుకై మనకింత తమకంబు వలదంచు
చలియెండ వానల సైచు గిరులు
రేపుమాపు కొరకు వాపోవ వలదంచు
విహగముల్ సంతుష్టి విద్య గరపు
జగము నిత్యము కాదు సంసారమది భ్రాంతి
యని ప్రాణముల్ వీడి చనెడువారు
నేను, నాదను భావమనిత్యమనుచు
ప్రకృతి జనని తెల్పుచుండు భాష్పవృష్టి
ప్రాణి సుజ్ఞాన మార్జింప ప్రకృతి ఒకటె
పాఠశాల, సద్గురుడు శ్రీసాయి కాదె!
284
Keep
మంచి తత్త్వంబు మరచిరి మనుషులంత
ధర్మమడుగంటె సంఫూన ఖర్మకాలి
నిలువ నీడయె లేకుండె నీతికెచట
ఇంతకన్నను దౌర్భాగ్యమేమి కలదు?
285
Keep
సాయి నామమె హాయి స్మరియించు చుండంచు
వృక్షముల్ తలలూపి బల్కుచుండు
సాయి నామమె హాయి స్మరియించు చుండంచు
పక్షి సంతానముల్ పల్కుచుండ
సాయి నామమె హాయి స్మరియించు చుండంచు
కుసుమాలు వాసనల్ కురియుచుండ
సాయి నామమె హాయి స్మరియించు చుండంచు
తుమ్మెదల్ ఝుమ్మని క్రమ్ముచుండ
ఆకసమునుండి యివియె శబ్దములు వచ్చు
భూమినుండియు యిదియె శబ్దములు వచ్చు
సాయిబాబా యనుచు సర్వదిక్కులందు
పిక్కటిల్లుచుండును పర్తియందు
286
Keep
నేను నేనున్నదానిలో లేనునేను
జీవునీవున్న దానిలో లేనునేను
నీవునేనును ఏకమై నిలచియున్న
అట్టి సర్వంబు ఉండునక్కడ
287
Keep
పుట్టుటయే చింత భూమినుండుట చింత
సంసారమొక చింత చావు చింత
బాల్యమంతయు చింత వార్థక్యమొక చింత
జీవించుటొక చింత చెడుపు చింత
కర్మలన్నియు చింత కష్టంబులొక చింత
సంతసమొక చింత వింత చింత
ప్రాపంచకము చింత ప్రకృతంతయు చింత
సంతసమొక చింత వింత చింత
సర్వ చింతలు బాపెడు సాయి భక్తి
గొనుడు యికనైన జనులార కోర్కె మీర
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
288
Keep
ప్రేమ లేనట్టి మనసది ప్రేతభూమి
అనగనొప్పారు నిజముగ అవనియందు
శ్వాసనిశ్వాసలను రెండు సలుపుచుండు
కొలిమి తిత్తిని ప్రాణిగా తలపగలమె!
289
Keep
విద్య నేర్చితినంచు విఱ్ఱవీగకబోకు
భాగ్యవంతడనటంచు పలుకబోకు
ధనవంతుడనుచు తరచు నిక్కగబోకు
పుత్రవంతుడటంచు పొగడబోకు
నేను దాతననుచు నెగడుచుండగబోకు
భృత్యుడను నేనంచు పొగడబోకు
శౌర్యవంతుడటంచు సంతసిల్లబోకు
కార్యశూరుడటంచు కరగబోకు
నలుగురికి మెప్పుగా నీవు నడచుకొన్న
నళినదళనేత్రుడు నిన్ను ఆకర్షించునయ్య
నళినదళనేత్రుడు నిన్ను ఆశార్వదించునయ్య
290
Keep
వేదశాస్త్రమ్ములు వివరించి బుధులచే
చదివించ వచ్చు తా చదువ వచ్చు
యజ్ఞయాగ తపములధికార జనులచే
చేయించ వచ్చు తా చేయవచ్చు
ఇలలోనగల తీర్థములనేగనన్యుల
బోధించ వచ్చు తా పోవ వచ్చు
అష్టాంగయోగంబునర్థులకును బోధ
సలుపంగ వచ్చు తా సలుప వచ్చు
కాని తన మనోబుద్ధ్యహంకారములను
నిల్పి అంతర్ముఖము చేసి నియతితోడ
నిశ్చలసమాధి నిష్ఠులై నిలువ లేరు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
291
Keep
వేదవేదాంగముల వల్లెవేయవచ్చు
పద్యగద్యంబుగూర్పజేయవచ్చు
చిత్తశుద్ధియె శ్రుతులకు జీవనాడి
సామవేదపు ఊట శ్రీసాయిమాట
292
Keep
పొట్ట మలమూత్రంబుల తొట్టి సుమ్మి
దేహమంతయు దుర్గంధ దిబ్బ సుమ్మి
ఆత్మ దేహమున కిదియె వింత కొంప
మరువబోకుడిట్టి మంచి మాట.
293
Keep
పూలయందున పరిమళమెట్లు కలదొ
అటులె దేవుండు నీలోన అలరుజూడ
మేథ చెడిపోయి కస్తూరి మృగమువోలె
ఏల వెతికెదు దేవుని వెఱ్ఱివాడ!
294
Keep
జపము యజ్ఞమందు జన్మలన్నియు పోయె
మనసు కుదరదాయె మానవునకు
జపము యజ్ఞములకు జన్మమీడేరునా?
మనసు నిలపకున్న మందమతికి.
295
Keep
రిత్త కోరికలను మోపునెత్తుకొనుచు
తిరుగుచున్నారు నిజరూపు తెలియలేక
తిలలయందున తైలంబు వెలయునటుల
దేవుడున్నాడు మీలోన తెలియరయ్య.
296
Keep
ప్రళయనిర్ఘాతమరచేత పట్టవచ్చు
హేమశైలంబు కొనవ్రేలనెత్త వచ్చు
దివిని భువిని రెండిటిని సంధింప వచ్చు
ధర హరిశ్చంద్రు బొకింప తరము కాదు.
297
Keep
లోకమందు పెక్కు భీకర కృత్యముల్
జరుగు కారణంబు అరయవలయు
స్వార్థరహిత సేవ సన్నగిల్లుటచేత
అర్థరహిత వాంఛలధికమయ్యె.
298
Keep
పుట్టినపుడు ఏడ్చినారు చచ్చినపుడు ఏడ్చినారు
మధ్యమధ్య విషయాలకు ఎందుకెందుకొ ఏడుస్తారు
ధర్మగ్లాని సంభవింప ఉద్ధరింప ఏడ్చినార?
సత్యస్వరూపునికై ఏడ్చినార ఎపుడైన?
ఎందుకోసమేడ్చినారు? ఏడ్పుకోసమేడ్చినారు.
299
Keep
సాటి మానవులను సాధింప నీకేల
ధర్మమెపుడు నీవు తప్పకున్న
భారతమ్ములోని పరమార్థమిదియెగా
ఉన్నమాట తెలుపుచున్న మాట.
300
Keep
ఉద్యోగములు చేయనువిదిలందరు పోవ
గృహ కృత్యములుదీర్చు గృహిణులెవరు?
ఆల్మగలిరువురు ఆఫీసులకుబోవ
ఇంటి పనులుజేయు ఇంతులెవరు?
పర బాలురకు నేర్ప పాఠశాలలకేగ
తమ బాలురకు నేర్పు తల్లులెవరు?
పుస్తకాల్ చేబట్టి పురుషుల వలెబోవ
వంటయింటిని దిద్దు వనితలెవరు?
డబ్బు వలన కలుగు యిబ్బంది తీరిన
ఇంటిలోని కొరతలెంతయుండు
సుఖము చూడబోవ సున్నయేయుద్యోగ
పదవియందునున్న పడతికెపుడు.
301
Keep
గ్రాటిట్యూడన్నది గాలికెగిరె
కలిని విద్యల క్వాలిఫికేషనిదియె
ఔరా ఔరరా! ఏమందు జీవితంబు
మానవత్వంబు యేమందు మంటగలసె.
302
Keep
పుడమికి సరిమధ్య పుట్టపర్తియనగను
ఆత్మ విద్యలునందె అవతరించె
విశ్వమానవకోటి విజ్ఞానమందంగ
విశ్వవిద్యాలయంబిచట వెలసె
శాంతిపౌఖ్యములను సర్వదేశములందు
వెదజల్లు విజ్ఞులు వెలసిరిచట
నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు
వేల లక్షలు కోట్లు వెలసిరిచట
సత్యధర్మశాంతిప్రేమలు జగతికి
చాటి చెప్పబూని సాయివిభుడు
సత్యసాయిజూడ సంపూర్ణప్రేమయే
యగుచు పుట్టెనిచట మోదమలర!
303
Keep
సత్యామృతంబును చవిచూడకున్నచో
చెల్లునే నరుడన్న చెక్కబొమ్మ?
ధర్మంబునెరుగక దనుజుండెయగుగాని
మానవుండగునెట్లు మహినిబుట్టి?
శాంతిచెందని జీవి శార్దూలమేగాని
మానవుడెట్లగు మనసులేక?
ప్రేమలేకను జీవి బీటలు వారిన
మరుభూమియేగాని మనుజుడగునె?
సత్యధర్మప్రేమ జగతి చక్క వెలయ
కాన నాలుగు గుణములు క్రమముతోడ
పట్టుదలతోడ సాధించి పరమ భక్తి
పూర్ణమానవత్వంబును పొందరయ్య
ఇదియె ఇహమున పరముననిచ్చు సుఖము.
304
Keep
చదువు చదివి చదివి సద్గుణములులేక
ప్రజల బాధపెట్టి బ్రతుకువాడు
ఇట్టి చదువుకన్న నయమగు గాడిద
305
Keep
చదువులన్ని చదివి సద్గుణంబులు లేక
పరుల మోసగించి బ్రతుకువాడు
వానికంటె మేలు వసుధలో గాడిద
బరువు మోసి తాను బ్రతుకుచుండు.
306
Keep
విష్ణువే గొప్పని వైష్ణవులనుచుండ
శంభుండు గొప్పని శైవులనగ
గణపతి గొప్పని గాణపతులు పల్క
శారద గొప్పని చదువరులన
అల్లాఘనుడటంచునల్ల తురకలు చెప్ప
శాక్తేయులందరు శక్తియనగ
నేను గొప్పయటంచు నాదు భక్తులు చెప్ప
అందరొక్కటేయని కొందరనగ
సర్వమత సమ్మతముగను సత్యమైన
బ్రహ్మమొక్కటేయని మీరు పలుకవలయు
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
Previous
←
1988
Next
1990
→