Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1990
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
307
Keep
మనసు కారణాంబు మరియెందు వుండిన
వూరుగాని అడవిగాని మోక్షము ఇవ్వలేదు.
308
Keep
మతములన్నియు వేరు మార్గంబు ఒక్కటే
వస్త్రభేదము వేరు దారమొకటె
శృంగారములు వేరు బంగారమొక్కటే
పశుల వన్నెలు వేరు పాలు ఒకటె
జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే
కులములన్నియు వేరు పుట్టుకొకటె
దర్శనంబులు వేరు దైవంబు ఒక్కడే
పూల వన్నెలు వేరు పూజ ఒకటె
తలియలేకను మానవుల్ తెలివిదప్పి
బ్రతుకు కోసము బహుబంధ బద్దులైరి
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
309
Keep
నారాయణుని బోధ నమ్మియుండిన చాలు
సామవేదము మీరు చదివినట్లె
నారాయణుని వాక్కు నమ్మియుండిన చాలు
ఇల యజుర్వేదము తెలిసినట్లె
నారాయణుని వాక్కు నమ్మియుండిన చాలు
పుడమి ఋగ్వేదము నుడివినట్లె
నారాయణుని వాక్కు నమ్మియుండిన చాలు
సరి అథర్వణమును చదివినట్లె
తుచ్ఛభావాలు మదిలోన తొలగియున్న
నిశ్చలంబుగ బుద్ధి నిలుపుకొన్న
ఇంతకన్నను శివరాత్రి ఏమికలదు?
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
310
Keep
వినండయా బోధ వినండయా విని సత్యమార్గమున నడవండయా
నిదురలేచినదాది నిదురపోయెడుదాక ఆస్తికై కుస్తీలు వేస్తారయా
రూపాయి కోసమై లోపాయికారిగా అడ్డమైన గడ్డి తింటారయా
ధనం కోసం దైవధ్యానాలు బోనాలు పెక్కు పన్నాగాలు పన్నేరయా
భమి సూర్యుని చుట్టు జనులు ధనము చుట్టు గిరగిరా తిరుగుతుంటారయా
లింగలింగాయంచు లింగపూజలు చేసి దొంగసాధనలు మీరు చేస్తారయా
స్వార్థంబుకై కీర్తిమర్యాదలాశించి ధూర్తకార్యాలు మీరు చేస్తారయా
కలిమి కల్గిననాడు కప్పగంతులు వేసి కలిమి పోయిననాడు క్రుంగిపోయేరయా
గొప్పకు పోతారు గోవింద కొడతారు డాబులు దంబాలు మానండయా
సర్వభూతములందు సర్వేశ్వరుని మీరు సమముగానెప్పుడు చూడండయా.
311
Keep
సకల శాస్త్రములన్ని చదివినట్లె
వాదమేల యజుర్వేదమిదియె చూడ
వాదమేల అథర్వణవేదమిదియె
312
Keep
పొగకు మూలము నిప్పులపుంజముండ
రైలుబండిని నడిపించు డ్రైవరుండ
ఆటొమేటికు లైటుకు అధిపుడుండ
ఒకడు ప్రకృతిని సృష్టింపనుండవలదె.
313
Keep
అన్ని తెలిసినవాడు అవనియందున లేడు
ఏమి తెలియని వాడు ఎందు లేడు
సర్వమెరిగిన వాడు సాయీశు డొక్కడే.
314
Keep
చక్కెర కంటె తీపి దధిసారము కంటెను రుచ్యమౌను పెం
పెక్కిన తేనె కన్న అతి తృప్తినిడున్ మరి పల్కపల్కగా
మిక్కిలి కమ్మనౌ అమృతమే అనిపించును కాన నిత్యమున్
చక్కగ దాని మీరు మనసా స్మరియింపుడు రామనామమున్
315
Keep
గుణము కొంచెముండి గొప్ప చదువులున్న
ఫలమదేమి? వాని విలువదేమి?
పంటలేని భూమి పది ఎకరములేల?
కొంచెమైన చాలు మంచి భూమి.
316
Keep
దనుజ దుష్కృతులనెల్ల పొగడుచుండువాడు చవట
బ్రహ్మజ్ఞానము నేర్చి యిచ్చట ఆత్మజ్ఞానము తెలుసుకొనుట
ఇదియే మన జీవితమునకు రాజబాట
317
Keep
రక్తము మాంసశల్యముల రాశియు దేహము మీరు కాదు
సువ్యక్తము కాని కోరికలు వ్యర్థమనస్సును మీరు కాదుగా
ముక్తికి బంధకారమగు మోహపు భ్రాంతియు మీరు కాదు
మీ శక్తిని మీరెరుంగగల శాశ్వితుడౌ పరమాత్మ మీరెగా!
318
Keep
పెద్ద వజ్రమొకటి పెంటలో దొరికిన
విలువ మారబోదు వెలుగుపోదు.
మంచి గుమ్మపండు కంచెలో కాచిన
రుచియు మారబోదు చవియు పోదు
గొప్ప నెమలి గ్రుడ్డు కోడి తా పొదగిన
వన్నె మారదు దాని చిన్నెపోదు.
319
Keep
పిలచి అడుగ చెఱకు బెట్టునా బెల్లంబు
పిప్పిగొట్టి రసము పీల్చకున్న
జాతివజ్రమునైన సానబట్టగవలయు
గురువు తీర్చకున్న గుణము సున్న
320
Keep
విలువలేని యినుప పెట్టె ఈ దేహము
పెట్టెలోన నగలు పెట్టినట్లు
దేహమందు ఆత్మదేవుడుండెను సుమా
సత్యమైన బాట సాయి మాట.
321
Keep
చెవులకెవ్వండు విను శక్తి చేర్చెనోయి
కనులకెవ్వండు యిచ్చెను కాంతిరేఖ
అట్టి వానిని వెతికెడు నతడు నరుడు
ఉన్న మాట తెలుపుచున్న మాట.
322
Keep
దుర్బుద్ధులు తలనున్న దూరులు విను చెవులున్న
పొంచి చూచుకనులున్న పంచల విను మనసున్న
వంచన గుణ చిత్తమున్న వంచించే పలుకున్న
ఈ వికృతులు చూడగనే న్యాయమింక బ్రతుకదన్నా
ఏ గుణంబును హృదయంబున నిలువదన్నా.
323
Keep
పట్టినదేదియో పట్టనే పట్టితి
పట్టునెగ్గెడుదాక అట్టెయుండు
కోరినదేదియో కోరనే కోరితి
కోర్కె చెల్లెడుదాక కొలచియుండు
అడిగినదేదియో అడగనే అడిగితి
వడిగినదిడుదాక విడువకుండు
తలచినదేదియో తలచనే తలచితి
తలపు తీరెడుదాక తరలకుండు
పోరు పడలేక తానైన బ్రోవవలయు
ఒడలు తెలియక నీవైన ఉడుగవలయు
అంతియేగాని మధ్యలో ఆపివేసి
తిరిగి పోవుట భక్తుని దీక్షకాదు.
324
Keep
జనని గర్భమునుండి జన్మించినప్పుడు
కంఠమాలలవేమి కానరావు
మంచి ముత్యపు సరుల్మచ్చునకును లేవు
మేల్మి బంగరుదండ మెడకు లేదు
రత్నాల హారముల్ రంజిల్లగా లేవు
పచ్చలు కెంపులు పరగ లేవు
వజ్రాల హారముల్ వర్థిల్లగా లేవు
గోమేథికంబులు తోడులేవు
కలదు కలదొక్క మాల మీ కంఠమందు
ఎన్ని చేసిన అవియన్ని ఎంచి ఎంచి
మంచిదైనను చెడుగైన త్రుంచకుండ
బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల
కర్మలన్నియు చేర్చిన కంఠమాల!
325
Keep
మనసే హేతువు మనుగడకు, బంధమునకు
మాన్యతకు, మనసే ముక్తికి ముఖ్యము
మనసే నరకంబు తెచ్చు
మైమరపించు
326
Keep
తరచి చదువు చదవ తర్కవాదమెగాని
పూర్ణజ్ఞానమెపుడు పొందలేడు
చదువులన్ని చదివి చావంగనేటికి
చావులేని చదువు చదవ వలయు.
327
Keep
చెడ్డ చూడరాదు చెప్పరాదెప్పుడు
వినగరాదెపుడును విశ్వమందు
మూడు కోతులు గల మూర్తిని తలచుడు
ఉన్న మాట తెలుపుచున్న మాట.
328
Keep
మనసు నిర్మలంబు మంచికి మార్గంబు
మనసు నిర్మలంబు మహితశక్తి
మనసు నిర్మలంబు మనిషికి ముఖ్యము
మరువబోకుడిట్టి మంచి మాట.
329
Keep
ఏమి తా కొని వచ్చె ఏమి తా గొనిపోవు
పుట్టినప్పుడు మరి గిట్టునపుడు
ధనమెక్కడేగు తానేగు నెచటికి
చెప్పరయ్య మనస్సు ఒప్పునటుల.
330
Keep
జాతి గౌరవంబు నీతిపై నిలుచును
నీతిలేకయున్న జాతి చెడును
నీతి కల్గు జాతి నిజమైన జాతిరా
వినుము భారతీయ వీరసుతుడ!
331
Keep
అన్న దానము కన్ననధిక దానంబేది?
తల్లిదండ్రుల కన్న దైవమేది?
జపతపంబుల కన్న సత్యశీలంబేది?
దయ కంటెనెక్కువ ధర్మమేది?
సుజన సంగతి కన్న చూడలాభంబేది?
క్రోధంబు కన్న శత్రుత్వమేది?
ఋణము కంటెను నరునకు రోగమేది?
ధరణినపకీర్తి కంటెను మరణమేది?
సరిగ సత్కీర్తి కంటెను సంపదేది?
స్మరణమునకు మించునాభరణమేది?
332
Keep
ఆర్థమునకు పరుగు, ఆఫీసునకు పర్గు
పాఠములకు పరుగు బస్సు పరుగు
పరమశ్రేయమునకు పరుగిడ జాలరు
మరువబోకుడిట్టి మంచిమాట.
ఆస్తిక బుద్ధి పోయె మరియాదల ధర్మము రూపుమాసె బల్
నాస్తిక బుద్ధి హెచ్చె గురువన్నను శ్రద్ధయు పోయె భక్తికిన్
స్వస్తి సనాతనప్రభకు స్వస్తివహించెడి కాలమయ్యెడిన్
నిస్తులగౌరవాదరణ నేలకుగోలకు వచ్చె విద్యలో!
333
Keep
మాటలందు తీపి మనసున చేదుంచ
మంచికాదు మీకు మచ్చగాని
మత్సరంబు లేని మనుజుడే మనుజుండు
వినుము భారతీయ వీరసుతుడ!
334
Keep
ఇంటియందున నగ్ని వెలుగుచు నుండగా
పొరుగింటి కగ్నికై నరుగనేల ?
335
Keep
పెట్టినది తినవు గొల్లల
పట్టులకుంబోయి వెన్న పట్టెడులుగ లో
గుట్టున తినెదవు నీతో
పుట్టెను రట్టళ్ళు కృష్ణ! పొమ్ము కుమారా!
336
Keep
పుట్టెను రట్టెల్ల కృష్ణ పాపడ్ని కుమారా!
కట్టెద రోటికి నిన్ను మానుము నీ చేష్టలింక
మరువుము కృష్ణా!
నోరంతయు వెన్నవాసన
గోరంతయు లేవు బాల
'ఊరంతయు ఆగడంబు ఒకటేరద్దులు
337
Keep
పది దినంబులనుండి పస్తుండు వానికి
మంచి భోజనము లభించినట్లు
చెఱువు బావులనీళ్లు కరవయినప్పుడు
వరుసగా వర్షంబు కురిసినట్లు
సంతతి లేకను చింతిల్లు వానికి
పుణ్యసుపుత్రుండు పుట్టినట్లు
అన్నవస్త్రంబుల కల్లాడుచుండిన
నిరుపేదకర్థంబు బెరయునట్లు
ధర్మనాశనమగుచున్న ధరణియందు
ప్రభవమందెను శ్రీసాయి పర్తియందు
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
338
Keep
తమ జీవితంబులు త్యాగంబు గావించు
ధర్మాత్ములుందురీ ధరణియందు
పరుల సౌఖ్యముగోరి బలియైన వారలుంద్రు
కొందరీకాలమునందు కూడ
కలలోన కూడను ఇలలోని సౌఖ్యముల్
కలవరింపని వారు కలరు ధరణి
కాని దేహేంద్రియములరికట్టిి నిలిపి
మనసునంతర్ముఖము చేసి యనవరతము
నిశ్చల సమాధి చిత్తుడై నిలచి నేడు
సత్య సేవ గావింప నాసక్తు లెవరు?
339
Keep
స్వర్గమనగ వేరు సురలోకమున లేదు
నరుల లోకమందె అమరియుండు
సద్గుణంబులు కల్గి సరియైన నడతున్న
స్వర్గమేల ఇదియె స్వర్గమగును
340
Keep
అంధునకు చూచుకాన అద్దమేల?
చెవిటి వానికి సంగీత శ్రవణమేల?
341
Keep
ఇది చేతునది చేతునింకెన్నియో చేతు
ననుచునూహలు అల్లి అలసిపోకు
ఏ విత్తులను నాటి ఇచ్చటనుంటివో
ఆ ఫలములే నీకు అందుచుండు
విత్తనంబొకటైన వేరైన ఫలములు
సమకూరుటది ఎట్లు సాధ్యమగును?
342
Keep
తాను చేయకున్న తగవు పుట్టదుగాని
ఒరుల పెట్టుచూసి ఓర్వలేరు
దాత దరిని చేరి తనది పోయినట్లు
జిహ్వతోడ చాడిలు చెప్పుచంద్రు.
343
Keep
సద్గుణంబు లేక సచ్చింతనలు లేక
ధ్యానమందు మనసు పూనగలదె
ఇల్లు కట్టుటకును యిటుకలు సున్నంబు
కలుగకున్న ఇల్లు కట్టుటెట్లు?
344
Keep
ప్రాపంచిక సంబంధము పిన్నై తొలగెన్
దైవదర్శనము కూడ చెల్లెను హంపిన్
345
Keep
కాయంబుతోజేయు కార్యంబులెల్లను
మాటలాడుచునుండు మాటలెల్ల
తన మనస్సునగల తలపులన్నిటికిని
పది యింద్రియముల పనులనెల్ల
బుద్ధితో కలిగెడు పూనికలెల్లను
చిత్తంబునందలి చింతలెల్ల
అనుదినంబును సల్పు ఆచారములనెల్ల
నియమంబుతో జేయు నిష్ఠలెల్ల
వైదికంబులు లౌకిక వర్తనములు
ఏమి చేసిన నవియన్ని ఈశ్వరునకు
తాను చేసెడి సేవగా తలచియున్న
సార్ధకంబౌను శ్రీసాయి సంస్థలెల్ల.
346
Keep
ఇచ్చినట్టి పనిని మెచ్చినటుల చేయ
సార్ధకంబులగును సమితులన్ని
అటుల చేయకున్న ఆత్మద్రోహమె కదా!
మరువబోకుడిట్టి మంచి మాట.
347
Keep
కుల మత ద్వేషాలు కూల ద్రోయు డటంచు
చెయెత్తి బోధనల్ చేయ వలయు
దీనుల సేవయె దివ్యమార్గ మటంచు
పలు మారు గట్టిగా పలుకవలయు
నామ చింతన నరు నామి సన్నిధి చేర్చి
అమృతత్వ మందించు ననగవలయు
భక్తి విశ్వాసంబు బాగుగా కల్గిన
వారలు మనవారలని వచించు.
జ్ఞానబోధలు నరులకు చేయువారు
బేధ భావంబు విడనాడి ప్రీతి తోడ
కలసి యుండిన సాయికి కల్గు ప్రేమ
348
Keep
నేను సాయిని తెలియుము నిక్కముగను
మమత బాయుము యత్నముల్ మానుకొనుము
బాసె మీకు నాతోడి సంబంధమింక
కాదు నన్పట్ట మరి యెట్టి ఘనునికైన.
349
Keep
నేటి విద్యార్థి ఘనముగ నేర్వదగిన
కలవు నవరత్న రాసులీ కలియుగాన
త్యాగ భావంబు వినయంబు సంఘసేవ.
మైత్రి క్రమశిక్ష సత్యనిరతియు ప్రేమ
సత్యమహింస దివ్యమౌ సరణియందు
ఇట్టి నవరత్న మాచరణమును సేయు
బాలబాలికల్ భరత సౌభాగ్య ఘనులు.
350
Keep
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు
ఏక గర్భజులంచు ఎన్నరయ్య
అన్నలు ద్విజులు శూద్రులును మిన్నగ
తమ్ములందు ప్రేమ తలపరయ్య
గుణముల క్రియలచేగూడు వర్ణములెల్ల
గుణమును గ్రహియింపగూడునయ్య
ద్విజుడు దుర్గుణుడైన శూద్రుడె
సుగుణి శూద్రుండు భూసురుడు కాడె
వీడువాడను భేదంబు వీడి మీరు
ఐకమత్యంబు అన్నింట అధిక పరచి
కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్య
అపుడ దేశంబు అభివృద్ధినందునయ్య
351
Keep
భరతదేశము ఆరంజిపండు పోల్చ
కనగ జాతులును మతములు తొనలు కాదె
భిన్న తెగలు వృత్తులు ఎన్నియున్న
భరతదేశాన పుట్టుటె భాగ్యమగును
ఐకమత్యంబు జ్ఞానంబునందజేయు
దివ్యజ్యోతిని వెలిగించు దేశమిదియె.
352
Keep
భరత దేశమనెడి భాగ్యంబు మనకుండ
ఇతర శక్తి మనము కోరనేల
హిందు ధర్మ హేమ అద్రులు మనకుండ
క్షీర సాగర మును కోరనేల ?
353
Keep
ప్రజలకునింపైన పనులుసేయకయున్న
మాట యింపుగ పల్కి మసలరయ్య
సత్సంగమునుజేరి సంఘవృద్ధినిగాంచి
కర్మయందనురక్తి కలుగరయ్య
పశులక్షణము వీడి పశుపతి కావలె
జీవోద్ధరణమును చేయుడయ్య
దయగల హృదయమే దైవమందిరమౌను
దయలేని హృదయమే దయ్యమయ్య
అహము, పరనిందలను పాడుకుళ్ళు తీసి
ఈశ్వరుండును జీవులనెల్లయెడల
ననెడి భావంబు వదలక ననవరతము
మనుడు మరువబోకుడిట్టి మంచిమాట!
354
Keep
పాలు చిలికిన వెన్ననుబడయవచ్చు
నీరు చిలికిన తప్పక నిప్పు వచ్చు
పనికిమాలిన మాటల విలువ సున్న
మరువబోకుడిటువంటి మంచి మాట.
355
Keep
సకల యత్నములను సతతంబు చేయుట
అధిక విద్య నేర్చి అధికుడగుట
భూమి సాగుచేసి భూచక్రమేలుట
కొలువు కూడ పొట్టకూటి కొరకె.
సంఘ సభ్యుల రుచులను సమయమెరిగి
స్వార్థమైనను విడనాడి సంఘమునకు
మేలు చేకూర్చు విధమున మెలగవలయు
నొవ్వు సేయకు ఇతరుల నొచ్చుకొనకు.
Previous
←
1989
Next
1991
→