Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1991
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
356
Keep
కాలముబట్టి సర్వమును కల్గుచుండును మంచిచెడ్డలున్
కాలముబట్టి వచ్చెడివి కల్మికి లేమికి రాకపోకలున్
కాలమె అన్నిరీతులను కారణమెంచుచు చూడగాను నీ
కాలమె లొంగదీయని మనుష్యుడొకండును లేడుగా ధరన్.
357
Keep
ఎద్దునెక్కినా గ్రద్దనెక్కినా ఇద్దరు ఒకటే ఓ నరుడా
లింగ లింగ శివలింగ లింగయని రంగని తిట్టకు ఓ మనసా!
ధనధాన్యములు ఎన్ని ఉన్ననూ కడకు రావురా ఓ నరుడా!
పరమ పావన పరమ శివుని శరణు కోరుము ఓ నరుడా!
అప్పు చేసుకొని యాత్రలు చేయుట తప్పుతప్పురా ఓ నరుడా!
ఆడంబరములు ఆవలనెట్టి ఆత్మ దర్శనము చేయుమురా!
జాగుచేయక జీవితమంతయు వేగుచుక్కవలె గడుపుమురా!
చదువుసంధ్యలు ఎన్నినేర్చినా స్వామి సేవతో చాలవురా!
మధురమైన ఆ నామము తలచిన మార్గము నీకే చూపునురా!
చెప్పే మాటలు పెడచెవి పెట్టి తప్పులు చేయకు ఓ నరుడా!
అగ్నివంటి ఆ సత్యము కనుగొని గొప్ప మార్గమున నడువుమురా!
358
Keep
కానిపించెడి జగతిలో కానరాక
అందు వెలుగొందు చైతన్యమాత్మరూపు
మణులయందున సూత్రంబు మాదిరిగను
విశ్వమంతయు వ్యాపించె విశ్వవిభుడు.
359
Keep
చూచితే దైవాన్ని చూడవలెనే గాని
వేరుచూపులు చూడ వెఱ్ఱితనము
నడిచితే విభునితో నడవ వలెనే గాని
వేరు మార్గము పోవ వెఱ్ఱితనము
పలికితే సత్యాన్ని పలుకవలెనే గాని
వేరు పలుకులెల్ల వెఱ్ఱితనము
పాడితే తత్వాలు పాడవలెనే గాని
వేరు పాటలు పాడ వెఱ్ఱితనము
వినిన హరి భజనంబులు వినగ వలయు
చూడగోరిన దైవాన్ని చూడవలయు
చేరవలసిన దైవాన్ని చేరవలయు
ఇంతకంటెను పరతత్వమేమి కలదు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
360
Keep
తారకాఖ్యాసురు దర్పమణచువేళ
గౌరి తనయుకిడ్డ వీర రక్ష
శంభరాసురవీరు జంపగా జనులేళ
భారవిసుతుకిడ్డ భవ్య రక్ష
మతృ దాసిత్వంబు మాన్పనరగువేళ
వినత పుత్రునకిడ్డ విమల రక్ష
జనకుయానతి పాలింప వనికేగెడిన్ వేళ
తల్లి రాఘవుకిడ్డ ధన్య రక్ష
అట్టి శ్రీరక్ష ధీరక్ష అంగరక్ష
రక్షలందున దివ్యమౌ రామరక్ష
తోడునీడయై నిన్ను కాపాడు గాక
తనయా! తోడునీడై నిన్ను కాపాడు గాక!
361
Keep
సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు
శూరుడై రణమున పోరవచ్చు
రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు
హేమభూదానముల్ యీయవచ్చు
గగనంపు చుక్కలు గణింయింపగావచ్చు
జీవరాసుల పేర్లు చెప్పవచ్చు
అష్టాంగవిద్యలనన్ని నేర్వగవచ్చు
చంద్రమండలయాత్ర సలుపవచ్చు
కాని దేహేంద్రియాదుల కట్టిపెట్టి
మనసు నిల్పియు నంతర్ముఖము చేసి
అనవరత నిశ్చలంబైన ఆత్ములగుచు
నిలువగాలేరు మానవుల్ నియతితోడ.
362
Keep
సత్యంబునందుండి సర్వంబు సృష్టించె
సత్యమందణగెను సర్వ సృష్టి
సత్యమహిమ లేని స్థలమేది కనుగొన్న
శుద్ధసత్త్వమిదియె చూడరండి.
363
Keep
కదలదు నీదు సంకల్పము లేనిది గడ్డిపోచయును
అదియునిదియు ననగనేల పిపీలకాది బ్రహ్మ పర్యంతము నీవె
అది ఎరుంగరు మది గలంగరు భువిని కొందరు
వివేకమున వర్తించెదమని కడు విఱ్ఱవీగెదరుగాని
చివరికేవేళ ఏమి సంభవించునో తెలియజాలరు ఎంతవారైనా.
364
Keep
జనన మరణాలు రెండును జంటనుండు
రెండు చక్రాలు బండికి నుండునటుల
ఒకటి పోయిన సృష్టియే ఓడిపోవు
ఇదియె సృష్టి రహస్యమీ థరణియందు.
365
Keep
తత్త్వమెరిగిన వానికి తపమదేల?
సత్యమున్నట్టి వానికి సాధనేల?
కల్లకపటాలు లేకున్న క్రతువులేల?
సత్యమును తెల్పు మాట ఈ సాయి మాట.
366
Keep
నీతినియమాలు గ్రంధాన నిలచిపోయె
హృదయమంతయు దుర్గంధ సదనమయ్యె
చేతలంతయు స్వార్థంపు చేతలయ్యె
ఇదియె ప్రోగ్గ్రెస్సు ఈనాటి విద్యలందు
367
Keep
విద్య నేర్పిన వానినే వెక్కిరించు
కూడు పెట్టిన వానినే కూలద్రోయు
మేలు చేసిన వానికే కీడుచేయు
ఇదియె ప్రోగ్గెస్సు ఈనాటి విద్యయందు
368
Keep
శాంతి అంతరించె సత్యంబు కరువయ్యె
ఆయుధంపు ప్రీతి అధికమయ్యె
ఈ దురంతములకు హేతువు స్వార్థమె
ఉన్నమాట తెలుపుచున్న మాట.
369
Keep
సంఘ మర్యాదలన్నియు గంగ కలసె
మనుజ జాతికి తృప్తియే మాయమయ్యె
శీలనీతులు జగతిలో క్షీణమయ్యె
ఇదియె ప్రోగ్గెస్సు యీనాటి విద్యయందు.
370
Keep
ఓంకారమనియేటి ఒక తొట్టిలోను
తత్త్వమసియనియేటి పరుపు తా పరచి
ఎరుకనే బాలుని ఏమరక ఉంచి
ఏడు జగముల వారు ఏకమై ఊప జోజో..
371
Keep
చెర్లోన మీ మామ శనగలెయ్యంగ
భాగమిమ్మని పొమ్ము బాలశంకరుడా
ఏసిననాడు లేవు కోసిననాడు లేవు
ఏందిస్తురా భాగంబు నీకు (అంటే)
మా అమ్మ నీతోడబుట్టినది కాదా
తగవుకే పోదాము ధర్మచావడికి (అన్నాడుట)
ధర్మచావడిలోని పెద్దాలందరు
భాగమిమ్మని బిడ్డనిమ్మనిరి.
372
Keep
బ్రహ్మవిద్య గూర్చి బహుళ ప్రచారము
సలుపువారు కలరు చాలమంది
కాని ఆచరించు ఘనుడు ఒక్కడు లేడు
సత్యమైన బాట సాయి మాట.
373
Keep
పొట్టకోసము క్రిమి పక్షి మృగాదులు బ్రతుకలేదె
కాన వాంఛించకయె తృప్తి కలుగునంచు
గట్టిగా తెలిసి గమ్యంబు చేరకున్న
ఇతర జీవులకన్న అరయ నరుడు
అథముడేగాని పరికింప అథికుడగునా!
374
Keep
పరమ పావనమైన భారతావనియందు
సహనమన్నదె మనకు చక్కదనము
వ్రతములన్నింటను వన్నెగాంచినయట్టి
ఘనసత్యశీలమే కఠిన తపము
మథుర భావంబేది మన దేశమందన్న
మాతృభావము కంటె మాన్యమెద్ది
ప్రాణంబు కంటెను మానంబె ఘనమను
మన దేశ నీతిని మంటగలిపి
నేటికిచ్చిరి పరదేశ నీతులరసి
వెస విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తి
ఔర! ఏమందు భరత పాలనంబు
ఏనుగెట్టుల తన బలమెరుగలేదొ
అట్టులైనారు భారతీయులు నేడు.
375
Keep
ప్రేమ దైవంబు జగమెల్ల ప్రేమమయము
ప్రేమరూపముగొని వచ్చి పేర్మిబ్రోవ
ప్రేమసుధలను బంధించి ప్రేమగూర్పు
ప్రేమ అవతారి శ్రీమాత సాయిమాత!
376
Keep
అద్దమందున ప్రతిబింబమంటనటుల
తామరాకులు నీటిచే తడవనటుల
పాపమంటదు మానవ భక్తి వలన
సత్యమునుజూపు మాట ఈ సాయి మాట.
377
Keep
విద్య డిగ్రీల కొరకని వెఱ్ఱివీడి
సేవకా వృత్తికై మీరు చేరబోక
స్వీయదేశీయ సౌభాగ్యమరసి
జగతి శ్రామిక విద్యలన్ చదువ వలయు.
378
Keep
అనిశంబు అత్యంత అనురాగ భోగాను
రక్తులై సుజ్ఞాన సక్తులగుచు
స్వపర భేదము లేక సర్వ జీవుల యందు
సమభావమునుజూపు సరసులగుచు
కష్టజీవులయందు కరుణను చూపించి
తగిన సాయముజేయు దాతలగుచు
దాంపత్య ధర్మంబు ధరణిని వెలయంగ
పరులకు నాదర్శ సరణి యగుచు
జగతి సత్కీర్తిగాంచి శ్రీసాయి కృపను
సాటి మానవులందెప్డు మేటియగుచు
నిత్యమును ధర్మజిజ్ఞాస నిరతులగుచు
ఉత్తమోత్తమ వ్యక్తులైయుంద్రుగాక!
379
Keep
మనసందు అత్యంత అనురాగ భోగాది
భాగ్యంబు కాపాడు భవ్యజనులు
స్వపర భేదము లేక సర్వజీవులయందు
సమభావమును చూపు సరస జనులు
అనిశంబు అత్యంత అనురాగ భోగాది
భాగ్యముల్ కల్గెడి భవ్యజనులు
కష్టజీవులయందు కరుణ చూపించుచూ
దాతృత్వమును జూపు ధన్యజనులు
సంసారధర్మ సత్యత్వ సుజ్ఞానులై
పరులకాదర్శంబు చూపు జనులు
భువిని సత్కీర్తిగాంచి సన్మార్గమరసి
తోటివారలలో సదా మేటియగుచు
నిత్యమును ధర్మజిజ్ఞాస నిరతులగుచు
ఉత్తమోత్తమ వ్యక్తులై ఉంద్రు గాక.
380
Keep
మతము క్రమశిక్ష నేర్పును హితముగూర్చు
ఆత్మశక్తియు తేజమునధిక పరచు
దాని మర్మంబునెరుగక కొట్టుకొన్న
జాతి సంస్కృతి క్షీణించి జబ్బు పడును.
Previous
←
1990
Next
1992
→