Build temple in your hearts 6 April 1983, Inauguration of the Sathya Sai Mandir built by the Sri Sathya Sai Seva Organisations of Guntur, which he named ‘Sathya Sai Santhi Sudha’, Guntur
satyadharmaprēmaśāntulu lēkunna
His poems 122
Also in his talks (14) vānalu vaccenañcu bhuvi paṇḍunē vittulu …
His poems 382
Also in his talks (1) సత్యధర్మప్రేమశాంతులు లేకున్న విద్యలన్నియు నేర్చి విలువ సున్న సత్యధర్మప్రేమశాంతులు లేకున్న దానధర్మాల సార్థకత సున్న సత్యధర్మప్రేమశాంతులు లేకున్న పదవులేలిన ఫలము సున్న సత్యధర్మప్రేమశాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబు సున్న ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములియ్యవి నాలుగు గోడలప్ప ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార! వానలు వచ్చెనంచు భువి పండునే విత్తులు నాటకున్న ఆ వానలు రానిచో ఫలము వచ్చునె బీజము నాటియున్ననెం దైనను రెండు కూడిన మహత్తర సిద్ధి లభించు సుమ్మి దై వాను గతిన్ లభించు పురుషార్థ విధానము మేలునిచ్చటన్. ప్రేమస్వరూపులారా! భౌతికంగా వైజ్ఞానికంగా మానవజాతి ఎన్నదగిన ప్రగతిని సాధించినదిగాని నైతికమార్గములో క్షుద్రవిమర్శలనూ సంకుచిత భావములనూ స్వార్థ, అసూయ, ఆడంబర, అహంకార, అల్పబుద్ధులనూ అతిక్రమించలేకపోవుచున్నది. ఈ పరస్పర విరుద్ధములైనటువంటి రెండింటి అతీతములకు ఏది కారణమో ఎవరికి వారు విచారణసల్పిన మానవుల మనస్సు లోపలి పొరలయందు అనేకవిధములుగా దాగియుండిన స్వార్థమే యని స్పష్టపడుచున్నది. మానవుడు ఏ కార్యము సాధించదలచుకొని యున్నప్పటికిని, ఏమి చింతించదలచినప్పటికినీ అన్నింటికినీ వెనుక స్వార్థము కదలుచునే యున్నది. స్వప్రయోజనము నిమిత్తమే మానవుడు ఈ జగత్తులోనున్న సమస్త పదార్థములను ప్రేమించుటలేదు. మానవుడు స్వప్రయోజన నిమిత్తమే తన బంధుమిత్రులను కూడా ప్రేమించుచున్నాడు. కాని, బంధుమిత్రుల ప్రయోజనము నిమిత్తమై ప్రేమించుట లేదు. స్వార్థము, స్వార్థము, స్వార్థము. మానవత్వములో వున్న దివ్యత్వమునకు స్వార్థమనేటువంటి దురదృష్టమనే సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు. సువిశాల జ్ఞాన తత్వాన్ని స్వీకరించలేని, జీవిత అంతరాంతరాల్లో ప్రవేశించలేని మానవుడు విశ్వశాంతిని ఏరీతిగా చేరగలడు? వ్యక్తి..సమాజము..విశ్వము. ఈ మూడుకూడను పరస్పర సంబంధ బాంధవ్యములతో కూడివుంటున్నవి. ఈ మూడింటియొక్క సంబంధము అవినాభావ సంబంధము త్రిమూర్త్యాత్మక స్వరూపము. వ్యక్తియొక్క క్షేమమే సమాజము యొక్క క్షేమము. సమాజము యొక్క క్షేమమే దేశము యొక్క క్షేమము. కనుక, మానవత్వములో దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని వికసింపజేసి ప్రకటింపజేసి సమాజ సేవలో పాల్గొనటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
నిజముగా, ఈ పరిస్థితులయందు భారతదేశమందు ఏవిధమైన ఆవశ్యకత వున్నదనుకున్నామో అది మీరు గుర్తించక తప్పదు. ప్రతి విషయమునందు మానవుడు చింతింపదగినటువంటిది సమాజసేవ. మనసా, వాచా, కర్మణా సమాజసేవను ఆచరించినప్పుడే నీ మానవత్వము సార్ధకమవుతుంది. శాంతి కావాలని చెప్పుతూ, అశాంతి కర్మలు ఆచరించే ఆత్మవంచకులు అధికమవటం చేత మానవ సమాజము కాలుష్యము చెందుతుంది. కన్నులుండికూడా గ్రుడ్డివారుగా వుంటున్నారు. చెవులుండికూడను చెవిటివారుగానే ప్రవర్తిస్తున్నారు. మతి వుండికూడను ఉన్మత్తుల వలె ప్రవర్తించే నేటి మానవులకు సువిశాలమైన దివ్యత్వాన్ని బోధించేదేముందో అదే ఆధ్యాత్మికము. నిర్విరామ కృషిచే, నిరంతర తాపత్రయములచే, అంతులేని ఆశలచే, అర్థంలేని ఆవేదనలచే ప్రాకులాడే మానవులకు డిసిప్లిన్‌తో చక్కని శిక్షణ యిచ్చేది ఆధ్యాత్మికత అనే సత్యాన్ని మరువరాదు. ప్రేమస్వరూపులారా! మానవత్వంలో వుండినటువంటి దివ్యత్వాన్ని కేవలం ఒక అధికారమునకాని, ధనమూలమునకాని, బలమూలమునగాని మనం సంతృప్తి పరచలేము. ప్రేమమూలమున మాత్రమే దీనిని సంతృప్తి పరచటానికి అవకాశముంటుంది. ప్రేమ, ప్రేమ, ప్రేమ. ప్రేమ దైవము యొక్క ఆనంద స్వభావము. అది ప్రతి మానవునిలోకూడా నిండియున్నది. దీనిని ప్రకటించేప్రయత్నమూ, ఉద్భవింప చేసుకొనే ప్రయత్నమూ మానవుడు పెంచాలి. ప్రేమ వలనే ప్రపంచమంతా కూడా జీవిస్తూ వస్తూ వుంటున్నాది. ప్రేమయే లేక ప్రపంచమే లేదు. ఈ ప్రేమ తత్త్వం దైవత్వం యొక్క ప్రతిబింబమనే సత్యాన్ని గుర్తించాలి. ప్రేమస్వరూపులారా! ముఖ్యముగా మానవత్వంలో వున్నటువంటి ఈ దివ్యత్వాన్ని మనం ఈ రీతిగా దిట్టపరచుకోవాలి అనే సత్యాన్నికూడా చూడాలి. ఈనాడు మానవుడు అనేక విధములైన నిర్బంధములకు లోనవుతున్నాడు. ధనేషణ, దారేషణ, పుత్రేషణ ఈ ఈషణత్రయములు మానవుని బంధించి అనేక విధములుగా పశుత్వముతో వానిని పెడమార్గము పట్టిస్తున్నవి. పశుత్వమునకును మానవత్వమునకును వున్న సన్నిహిత సంబంధ బాంధవ్యమనేది యిది కాదు. ప్రేమ. పశువులు, పక్షులు, మనుష్యులు, రాక్షసులు అందరినీ ఏకత్వం చేసేటువంటిది. ఈ ఏకత్వమైనటువంటి ఆత్మ తత్త్వాన్ని మనం విస్మరించి కేవలం దేహతత్త్వాన్ని మాత్రమే విజృంభింపజేసుకోటం వల్లనే మనం మానవులై కూడను కేవలము పశువులవలె ప్రవర్తింప పూనుకుంటున్నాము. ఇది సరికాదు. భక్తి, భక్తి, భక్తి అని కేవలం భజనలు చేసినంత మాత్రమున భక్తి కాదు. గానం సల్పినంత మాత్రమున భక్తి కాదు. ప్రేమతో సర్వుల యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పొందినప్పుడే ఈ భక్తి ప్రపత్తికీ సరియైన అర్థమవుతుంది. ‘ఈశ్వరః సర్వభూతానాం’ అనేటువంటి సత్యాన్ని మనం ఆచరణరూపంలో ప్రచార ప్రబోధం జరపాలి. కేవలం ప్రచారం చేసినంత మాత్రమున ప్రయోజనం లేదు. ప్రబోధం చేసినంత మాత్రమున ప్రయోజనం లేదు. ఆచరించి, విమర్శించి అవలంబించటానికి ప్రయత్నం చేయాలి. మనయొక్క ఆనందము బయట ప్రపంచములో లేదు. మనయందే వుంటున్నది. దైవమే సర్వస్వము. మనం చేసే సర్వ కార్యములలో కూడను తాను ఆధారభూతుడై వుంటున్నాడు. కన్నులు చూస్తున్నాయని అనుకుంటున్నాము. చెవులు వింటున్నాయని అనుకొంటున్నాము. నోరు మాట్లాడుతుంది అనుకుంటున్నాము. కాని, మాట్లాడేది నోరు కాదు.
చూచేది నేత్రం కాదు. వినేది చెవులు కాదు. దీనికి ఒక నిజమైన ప్రాణంతో కూడుకొన్న మనస్తత్వంకూడా వుంటున్నాది. కనుకనే ‘మనోమయమిదం జగత్త’ని మనస్సనేదే లేకుండిన మానవత్వాన్నే మనం గుర్తించటానికి, ప్రకటించటానికి వీలుకాదు. ఈ మనస్సనేదే నేత్రమునందు చేరి చూడగలుగుతున్నాది. ఈ మనస్సనేదే చెవులయందు చేరి వినిపించటానికి ప్రయత్నం చేస్తున్నాది. కనుకనే, ప్రతి విషయమునందు కూడా మనస్సనేటువంటిదే అన్నింటికీ ఆధారమై వుంటున్నాది. ‘మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’. వేమన కూడా చిన్న మాటలతో చెప్పాడు,‘ ఒక్క మనస్సునందే వున్నది సర్వంబు,తిక్కపట్టి మనిషి తిరుగనేల?’ నిజంగా మానవునియొక్క దివ్యత్వమనేది మనస్సనేదానియందే మిగిలి వుంటున్నాది. ఈ ప్రకృతియొక్క చైతన్యము కేవలము భౌతికమైనదాని యందు ప్రతిబింబించినప్పుడు ఈ మనస్తత్వము వికృతమవుతున్నాది. ఇది అహంకారమును కూడుకొన్నప్పుడు ఇది కూడను వికృతమవుతున్నాది. ఆత్మతత్వమును నిరూపించినప్పుడు ఇదే సుకృతమవుతున్నాది. సుకృతమునకు, వికృతమునకు మనసే మనస్సే మూలకారణమనేది మనకు స్పష్టమవుతున్నాది. మన ఉద్రేక సమయంలో కూడను అనేకవిధములైన దిగజార్పులను మనం అనుభవిస్తున్నాము, ఆచరిస్తున్నాము. శాంతితో ప్రేమతో సహనముతో మన జీవితాన్ని గడిపే సమయం లోపల మానవత్వాన్ని ప్రకటిస్తున్నాము. కనుక, మానవత్వమూ, పశుత్వమూ, దానవత్వమూ ఒక్క మానవునియందే వుంటున్నాయి. కనుక, దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని అభివృద్ధిగావించుకున్నప్పుడే మానవత్వం శాశ్వతమౌతుంది. ఈ మానవత్వం ప్రాప్తం కావటానికి కొన్నివిధములైన సాధనలు కూడా మనం చేయాలి. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’. ఇది నవీన నాగరికతా యుగమని భావిస్తున్నాము. దీనియొక్క ప్రయోజనమేమిటి? దీనియొక్క అంతరార్థమేమిటి? కోరికలను పెంచుకోటమా నాగరికతయొక్క లక్షణం? కాదు, కాదు. మానవత్వంతో తన కాంక్షలను, కోరికలను, ఆశయాలను అదుపులో పెట్టుకోటం ఆధునికతకు సరియైన అర్ధం. కాని, ఈ మానవుడు మితిమీరిన కోరికలచేత మతియుండీ ఉన్మత్తుడౌతున్నాడు. మతిహాని కలిగించుకొంటున్నాడు. ఈ కోరికలు యినుమిక్కిలైనచో స్వార్థము, స్వార్థము, స్వార్థము. అందరూ భగవంతుని బిడ్డలే. మానవ సోదరత్వాన్ని భగవంతుని పితృత్వాన్ని ఏనాడు మనం అనుభవిస్తామో, ఆచరిస్తామో, ఇతరులకుకూడా అందిస్తామో అది నిజమైన శీలము. కాని, ఈనాడు మందిరమును కట్టాము. ఏనిమిత్తమై కట్టాము? ఇది ఎందుకోసం కట్టాము? ఈ ఆరాధన ఏమిటి? నిరాకార ఆరాధన చాలా ఉత్తమమైనది కదా! ఇంత ధనం వ్యయం చేసి ఈ ఆలయాలు కట్టడం ఎందుకు? దేహభ్రాంతి వుండినంతవరకు కూడా మూర్తి ఆరాధనము తప్పునది కాదు. ఏనాడు దేహభ్రాంతి దూరం చేసుకొందువో, ‘అహం దేహోస్మి’ అనేటువంటి సత్యమును నీవు ఏనాడు త్యజింతువో ఆనాడే ఆరాధన అనేది, మూర్తిపూజ అనేది సరియైన మార్గం కాకుండా వుంటుంది. అంతవరకు మాత్రం మీరు చేయక తప్పదు. అయితే, దీనికి ఏవిధమైన ప్రయాస పడనక్కర లేదు. ‘దేహో దేవాలయప్రోక్తో జీవీ దేవస్సనాతనః’. అయితే ఈనాడు ఆధునిక యుగమందు ఆధ్యాత్మిక మార్గమంటే కేవలం హాస్యాస్పదంగా చూస్తున్నారు. అలక్ష్యం చేస్తున్నారు. ఇది సరైన మార్గం కాదని అనేకవిధములుగా కూడను దుష్ప్రచారములు జరుగుతున్నాయి. ఇది చాలా పొరపాటు. నమ్మకము, నమ్మకము. ‘నమ్మకమను రెండు నయనంబులే లేని అంధులగుచున్నారు అవనియందు’.
ప్రతియొక్క విషయమునందు అంధత్వము. నమ్మకమనేది ప్రధానము. ఎవరి నమ్మకము వారిది. ఎవరి విశ్వాసము వారిది. విశ్వాసమనేది మన కాలమునకు అతీతమైనది. దీనిని ఎవరును కాదనలేరు. నీ విశ్వాసము నీకెట్టిదో నా విశ్వాసము నాకట్టిది. నీ విశ్వాసమునకు అడ్డుతగిలినప్పుడు నీవు ఎన్నివిధములైన బాధలు పడుదువో నా విశ్వాసమునకు నీవు అడ్డుతగిలినప్పుడు నాకునూ అట్టి బాధలు కలుగుచుండును. ఈ సత్యమును గుర్తించిన వ్యక్తికి పరులయొక్క విశ్వాసమునకు అడ్డుతగలటానికి ఏమాత్రం అధికారం లేదని చెప్పవచ్చును. కనుక, ఎవరు విశ్వాసులు? గాంధీకూడా చెప్పాడు. ఈ విశ్వాసమనేది అజేయమన్నాడు. అతీతమైనటువంటిది మరియొక కారణమున్నది. అలాంటి విశ్వాసముతోనే మన జీవితములోని ప్రతి క్షణమూ మనము జీవిస్తూ వున్నాము. విశ్వాసమే మన శ్వాస. విశ్వాసమే లేకుండిన ఒక మార్కెట్టుకు కూడను వెళ్ళి మనం ఇంటికి రాలేము. ఒక ఆఫీసుకు వెళ్ళి ఇంటికి రాలేము. ‘ఇంటికి రాగలను ’అన్న విశ్వాసమున్నప్పుడే తాను బజారుకు పోగలుగుతున్నాడు. ఇటువంటి ఆచరణలు, చర్యలు, అసంతృప్తికరమైన కార్యములకే మనం విశ్వాసాన్ని యింత పెంచుకున్నప్పుడు అన్ని ఆదాయములకంటె పెద్ద ఆదాయమైనటువంటి ఆత్మవిశ్వాసానికి ఎందుకు వెనుకంజ వేయాలి? ఆత్మవిశ్వాసము కోల్పోవటం చేతనే మనయొక్క భారతదేశము ఈవిధమైన అవస్థకు దిగజారిపోతున్నాది. సమస్త కష్టములకు కారణం మనం ఆత్మవిశ్వాసం కోల్పోవటమే. సజ్జనులను గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి, వారి ప్రేమను మనం జుఱ్ఱుకోవాలి. ఈవిధమైన పరిస్థితులయందు మానవుడు ప్రవర్తించాలి. ‘సాధుసజ్జనుల చూచి చౌక చేతురు| కొదవ వారికేమి హృదయమందు| కుంజరమునుజూచి కుక్కలెన్నో మొరుగు| దాని ఘనతకేమి తక్కువగును|’ మరియొక పరిస్థితికి మనము కేవలమూ దిగజారిపోతున్నాము. ఎవరిని చూచినా హేళన చేయటము. హేళన చేసే అధికారం ఏ వ్యక్తికి వుంటున్నాది? నీలో ద్వేషము లేదా? నువ్వు మనిషివి కాదా? నీలో ఏవిధమైన పొరపాట్లు లేకుండా వుంటున్నావా? లేదు, లేదు. మానవత్వంలో అనేక పొరపాట్లు వుంటుంటాయి. అనేక తప్పులు వుంటుంటాయి. కాని, వానిని సవరించుకొని, సమర్థించుకొని సరైన మార్గంలో నడచుకొనే పరిస్థితికి మనం చేరుకోవాలి. ఇదే నిజమైన మానవత్వానికి సరియైన కర్తవ్యము. మానవుడు, మానవుడు, మానవుడు. మానవత్వంలో ఎన్ని గొప్పలు వహిస్తున్నాము. మేము విద్యావంతులము, మేము పండితులము, మేము కేవలమూ మేధావులము అని అనుకొంటున్నాము. కాని, మేధావులమై వుండి ప్రయోజనమేమిటి? ఏది మనం ఆచరిస్తున్నాము? ఏది మనం అనుష్ఠానపరుస్తున్నాము. ఏమాత్రమూ కనిపించటము లేదు. ఇలాంటి పాండిత్యముకాని, ఇలాంటి విద్యలుకాని, ఇలాంటి మేధాశక్తికాని వుండికూడను ప్రయోజనం లేదు. కనుకనే, ‘గుణము కొంచెముండి గొప్ప చదువుండిన, గుణము కొంచెముండి గొప్ప పదవుండిన, గుణము కొంచెముండి గొప్ప కులముండిన, పలుకనీరు వాని నిలువనీరు’. ‘పంట పండని భూమి పది ఎకరములేల? కొంచెమైన చాలు కొల్చు భూమి’. మనకు ఆచరణలోనున్న ఏ కొంచెమైనా చాలు. ఆచరణలో లేనటువంటిదీ పుస్తకంలోది మస్తకంగా, మస్తకంలోది పుస్తకంగా మార్చుకుంటూ కాలం వృధా చేయటం మంచిది కాదు. కాలం చాలా ప్రధానమైనటువంటిది. అమూల్యమైనది. ఈ కాలాన్ని మనం అరక్షణమైనా వృధా చేయరాదు.
మృత్యుదేవత యొక్క కఠినమైన కరవాలము సర్వులయొక్క శిరస్సునందును కదలుతూనే వుంటుంది. ఏ క్షణమో! ఏ నిముషమో! అలాంటి పరిస్థితిని మనం లక్ష్యమునందుంచుకొని ఎప్పటికప్పుడు పవిత్రమైన కార్యములు, పరులను నొప్పించక, తాను బాధ పడక, దైవత్వాన్ని కొంత వరకు విశ్వసించి దివ్యమైన మార్గంలో మనము కాలమును ప్రవేశపెట్టి సమాజ సేవ చేయాలి. దీనులను, దిక్కులేని వారిని, కేవలమూ అనాధలుగా వుండేవారిని ఆదరించి వారియొక్క ప్రేమను మీరు పుచ్చుకొనుట, మీయొక్క ప్రేమను వారికిచ్చుకొనుట. ఇందులోనే సంబంధబాంధవ్యముందని మనం గుర్తించాలి. మనం ఇచ్చుకోటం పుచ్చుకోటం పదార్థములు కావు. పదార్థములు క్షణభంగురములు. ఒక్క నిముషముండవచ్చును. తరువాత పోవచ్చు. కనుక, ఈ దృశ్య కల్పితమైన జగత్తునందు ఒక్క రూపమూ నామమే కనిపిస్తున్నాది. ఎక్కడైనా చూడు. నామరూపముల యొక్క సమ్మిళితమే ఈ ప్రపంచము. ఒక్కొక్క వస్తువునకొక్కొక్క పేరు. అయితే, ఈ రూపనామములందున్న విశిష్టత ఏమంటే నామము మార్పుచెందేటువంటిది కాదు. రూపము క్షణక్షణమూ కూడను మార్పు చెందుతుంది. ‘యదృశ్యం తన్నశ్యం’ అని నిరంతరము కూడను దృశ్యమయ్యే వస్తువులన్నీకూడా మార్పు చెందుతుంటాయి. కనుక, మార్పు చెందే వస్తువు మనం స్థిరంగా చూచుకొనక, మార్పు చెందని నామమును మనము ఆధారం చేసుకొన్నప్పుడు ఆ నామము స్వరూపములను కూడను సందర్శింపచేస్తుంది. కనుక, నామస్మరణ చాలా ప్రధానమన్నారు. మనము ఏ పని చేసినప్పటికినీ నామస్మరణ చేస్తూ పనులు ప్రారంభిస్తే నిజమైనటువంటి సార్థకత వుంటుంది. నేను అప్పుడప్పుడు చెబుతూ వుంటాను. ఒక కొట్టుకు వెళ్లి డబ్బిచ్చి కొన్ని పదార్థములు మనము పుచ్చుకొన్నప్పుడు ఆ కొట్టువానికీ మనకూ ఎట్టి సంబంధమూ వుంటుండదు. అట్లుకాకుండా, ఆ కొట్టులో అప్పుగా వ్రాసి మనము పదార్థములు తెచ్చుకొంటే, ఆ అప్పు తిరిగి వడ్డీగా మారిపోతున్నాది. ఈ వడ్డీని చెల్లించటానికే మన కాలమంతా వ్యర్థము చేస్తే అప్పు అప్పుగానే నిలిచిపోతుంది. కనుకనే ఎప్పటికప్పుడు మనము చేసిన కర్మలను భగవత్ప్రీత్యర్థమన్న రీతిగా, మనము ఈ డబ్బును చెల్లించినట్లుగా చెల్లించినప్పుడు మనకు అప్పు ఏమాత్రమూ వుండదు. వడ్డీ బాధ మనకు ఏమాత్రమూ వుండదు. కనుకనే, ‘సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం’ అన్న మార్గములో ఏ కర్మ చేసినప్పటికీ నీవుకాదు చేస్తున్నది. నిజముగా నీ కన్నులు చూస్తున్నాయనుకున్నావు. చచ్చిన తర్వాత కూడను కన్నులుంటున్నాయి. నీకు సమాధి స్థితిలో కన్నులుంటున్నాయి. మైకంలో కన్నులుంటున్నాయి. కాని, నువ్వప్పుడు చూడగలుగుతున్నావా? చూడటం లేదే! ఆనాటి కన్నులు ఈనాడు కూడనూ వున్నాయికదా! కన్నులే చూస్తున్నట్లయితే నేడు ఎందుకు చూడకూడదు? ఇంక నోరు! బ్రతికినప్పుడు ఏ నోరు వుంటున్నాదో చచ్చిన తర్వాత కూడను అదే నోరు వుంటున్నాది. నోరే మాట్లాడటం సత్యమైన, చచ్చిన తరువాత ఆ నోరు ఎందుకు మాట్లాడ కూడదు? కాదు కాదు. వీటన్నింటికీ ఆధారమైనది ప్రాణతత్త్వం. ఈ ప్రాణతత్త్వమే దివ్యమైన ఆత్మతత్త్వం ఈ ఆత్మతత్త్వమే నిజమైనటువంటి ధర్మస్వరూపం. కనుకనే, ఈ సర్వస్వమునకూ ఆధారమైన సత్యాన్ని మనము గుర్తించినప్పుడే నిజమైనటువంటి మానవత్వము కూడను మనకు అర్థమవుతుంది. ప్రేమస్వరూపులారా! మానవులము, మానవులము, అందరిదీ ఒకే జాతి. అందరిదీ ఒకే జన్మ. ఈ జన్మమునకూ జాతికీ ఎట్టి సంబంధమూ, ఎట్టి భేదమూ లేదు. అయినప్పటికినీ రంగులు వేరువేరుగా వుండవచ్చును.
భాషలు వేరువేరుగా వుండవచ్చును. సిద్ధాంతములు వేరుగా వుండవచ్చును. ఆచరణములు వేరుగా వుండవచ్చును. దివ్యత్వమైన మానవత్వం ఒకటిగానే వుంటున్నాది. ఈ మనస్సునకును కొన్ని ఆహారవిహారాదులచేత సాత్వికమూ, రాజసికమూ, తామసికము ఏర్పడవచ్చును. మనం సంపాదిస్తున్నాము. ఎవరికి సంపాదిస్తున్నాము? మన సంపాదనలో కించిత్తైనా కూడా మనతో రాదు. మనతో రానిదీ, మనది కానిదీ ఎవరి సొత్తు? ఎవరి సొత్తో! ఇలాంటి దాని నిమిత్తమై మనమెందుకింత శ్రమపడిపోవటము? జానెడు పొట్ట నింపుకొన చిక్కుల నొందుట, కోటివిద్యలన్ పూనియు మీననేత్రి! పరిపూర్ణ సుఖంబులు పొందలేక యీ మానవజాతి భిన్నమయి మన్నగ నేటికి? శ్రీపరాత్పరున్ ధ్యానముచేయు భక్తున్ విడనాడి దరిద్రత పోదె మానవా! ఎందుకోసమై మనము చేస్తున్నాము? ఈ పనులు ఎవరి నిమిత్తమై మనము చేస్తున్నాము? ధనము, ధనము ‘ధనమూలమిదం జగత్’ ధనము లేకపోతే క్షణమైనా మనముండలేము. ధనము కావలసిందే. ఎంతవరకో అంతే. ధనము ఏమిటి సాధిస్తున్నాది మనకు? సౌకర్యాన్నిస్తుంది కాని శాంతినందించటం లేదు. పరిచారకుల సందిస్తున్నదేగాని స్నేహితుల్ని అందించటం లేదు. ఈ ధనము కేవలమూ అన్నాన్ని అందిస్తున్నదే కాని ఆదరణ నందించటం లేదు. ఈ ధనము కేవలమూ మందులను అందిస్తున్నదే కాని రోగాలను నివారణ చెయ్యటము లేదు. కనుకనే, దివ్యత్వంలో వున్నటువంటి నిజమైన ధనము జ్ఞానధనము. మానవుడు వదలవలసినటువంటి దానిని వదలినప్పుడే సంతోషము. చేరవలసినటువంటి సాధనమును చేరినప్పుడే సంతోషము. కనుక, వదలవలసినది ఏమిటి? తెలుసుకోవలసినది ఏమిటి? చేరవలసినది ఏమిటి? ఈ జగత్తనేటువంటిది భావం వదలాలి. సర్వమూ దైవమే అని తెలుసుకోవాలి. మనము చేరవలసినటువంటి ఆత్మతత్త్వాన్ని చేరాలి. అంతేగానీ మనం ఏదో వున్న స్థానంలోనే వుండి తెలుసుకోవలసిన దానిని తెలుసుకోకుండా, కేవలమూ ‘నేను మనిషిని, ఇది నా చెయ్యి, ఇది నా కాలు, నా బుద్ధి, నా చిత్తం, నా రూపము, నా ఇంద్రియములు’ అని అనుకుంటూ వున్నాము. ‘నువ్వెవరు?’ అనేది అర్థం చేసుకోకుండా పోతున్నాము. ‘నా దేహము’ అని అన్నప్పుడు ఈ దేహమునందు నాకు కొంత ప్రత్యేకమైన విరుద్ధముంది కదా! కనుక, ఈ దేహముతో నాకేవిధమైన సంబంధము లేదు. ‘నాదేహ’ మంటున్నామేగాని ‘దేహమే నేను’ అని చెప్పటం లేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడను అర్థం చేసుకొంటే, మానవుని యందు నిజముగా అన్నింటికంటె గొప్పది ఒక ప్రేమ మాత్రమే! ఈ ప్రేమ ద్వారా మనము ఎంతైనా సాధించ వచ్చును. ఎన్ని విధములైన ఆనందములనైనా మనము అనుభవించవచ్చును. ఈ ప్రేమకు ఐకమత్యము అనేటువంటి దానిని మనము కలిగించుకోవాలి. ఐకమత్యమే జీవిత కుడ్యము. ఈ సామాజిక కృషియే అన్నింటికీ ఆధారము. మన ఆధారమైన సమాజసేవ ఈ విశిష్టమైనటువంటి ఐకమత్యము, రెండింటినీ మనము విస్మరిస్తున్నాము. కర్మకును కర్మయోగమునకును వున్న సంబంధమెంతో మనము గుర్తించాలి. అహంకారముతో ఆసక్తితో చేసినవన్నీ కూడను కర్మలుగా వుంటుంటాయి. అహంకారాసక్తి రహితమైన కర్మలన్నీ కూడను యోగముగా మారిపోతుంటాయి. కనుకనే, మన జీవితమనేది యోగముగా మారాలిగానీ రోగముగా మారకూడదు. ఈనాడు మనము మన జీవితమంతా కూడను రోగములతోనే అంతరింపచేస్తున్నాము.
ఈవిధమైన రోగములకు సంబంధించిన దేహము మాత్రమేగాని మానవత్వము కాదు. ఇలాంటి మానవత్వాన్ని గుర్తించి వర్తించుకొనేటువంటి పవిత్రమైన ఆధ్యాత్మిక మార్గాన్ని మనం చేబట్టాలి. ఆధ్యాత్మికమంటే ఒంటరితనమనిగాని ఏకాంత జీవితమనిగాని మనము భావించ రాదు. రాగద్వేషములతో నిమిత్తము లేని ఆత్మతత్త్వాన్ని, అదే మనము సరియైన రీతిగా చూచుకోవాలి. మానవకోటి యావత్తూ ఒక్కటిగానూ, ఏకంగానూ, పరిపూర్ణంగా కూడను సిద్దింపజేసే మార్గమే ఆధ్యాత్మిక మార్గము. కేవలము స్తుతులచేతను, భజనల చేతను మాత్రమే కాదు. ఇవి సత్కర్మలని చెప్పవచ్చును. మానవకోటిని యావత్తూ ఏకంగానూ పరిపూర్ణంగానూ తీర్చి దిద్దేటువంటి తత్త్వమే ఆధ్యాత్మిక తత్త్వము. దీనిలో మనమందరమూ ఒక తల్లిబిడ్డలుగా భావించాలి. బిడ్డ ఏవిధముగా తల్లి దగ్గరకు చేరటానికి తాను కుతూహల పడుతుందో ఆవిధముగనే మానవులందరూ కూడను భగవంతుడనే మాతృమూర్తి దగ్గరికి చేరటానికి తగిన కృషి చేయాలి. ముకుళించి వున్న పుష్పము వికసించినప్పుడు తనయొక్క పరిమళమును, మాధుర్యమును విరజిమ్ముతుంది. అది మొదలు మొగ్గగానే వుంటుంది. అదేవిధముగా కేవలమూ అజ్ఞాన స్థితిలో వుండేటువంటి మన మానవత్వమనే మొగ్గ ఈవిధమైన వికాసమునకు ఏమాత్రమైనా అవకాశము లేకుండా వుంటుండాది. ఈ మొగ్గను పరిపక్వ స్థితికి తెప్పించే ప్రయత్నము చేయాలి. ఈత నేర్చినవాడు నీటియొక్క లోతును లక్ష్యం చేయడు, లెక్కచేయడు. తాను చిలుక చిలుకున ఆవలి గట్టు చేరుకుంటాడు. అదే విధంగా మనము దైవత్వమనే దివ్యత్వాన్ని అర్థం చేసుకొంటే ఈ సంసారం సాగరం యొక్క చిక్కులుగాని, చింతలుగాని మనం లెక్కచేయం. పక్షి చెట్టుకొమ్మ మీద వాలినప్పుడు గాలికి ఆ కొమ్మ ఊగినప్పుడు ఆ పక్షి ఏమాత్రమూ అదరదు, బెదరదు. కారణమేమిటి? తాను తన రెక్కలపైన ఆధారపడివుందిగానీ కొమ్మపైని కాదు. కానీ, మానవుడు ఈనాడు ఆ చిన్న పక్షికున్న విశ్వాసంకూడా లేకుండా సంసారమున ఏ చిన్న చిక్కులు వచ్చిననూ అదిరిపోవటం, బెదిరిపోవటం. తనయొక్క ఆత్మవిశ్వాసంపైన తాను ఆధారపడి వుండటం లేదు. కనుకనే, ప్రతి మానవుడూ ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఒకరంటే ఒకరికి ద్వేషం. ఈ అసూయ అనేటువంటిది మహా చెడ్డది. ఈ అసూయ వుండటం చేతనే పరునియొక్క మంచిని చూచి, పరునియొక్క గొప్పని చూచి, పరునియొక్క ఆనందమును చూచి ఒకరికొకరు బాధపడుతున్నారు. ఇది దుర్గుణములలో ప్రధానమైన దుర్గుణము. ఈ అసూయ మానవునికి మంచిది కాదు. అందువలనే భగవద్గీతలో అనసూయుడవు కమ్మన్నాడు. ఇంక అనేకవిధములుగా కూడను ఆస్తికనాస్తికత్వము. ఈ నాస్తికత్వమంటే ఏమిటి? దేవుడు లేడన్నంత మాత్రముననే నాస్తికత్వమనా? కాదు. కాదు. తన పేరునందే వుంటున్నది. నా అస్తి నాస్తి అయిపోయింది. దీనిని మనము ఇంగ్లీషులో చెప్పివుంటే There is no God అంటుంటాము. There is మొదట వచ్చింది. no God తరువాత వచ్చింది. ఇది కల్పనా? నిజమా? దైవమే లేదనుకుంటే ఇంక వున్నది ఎవరు? నీవా? నీవెవరు? నీ తత్త్వాన్ని అర్థం చేసుకుంటే నిజముగా ధన్యుడవౌతావు. కనుక, మానవత్వము లోపల క్రోధమునకూ, ద్వేషమునకూ, అసూయకూ ఏవిధమైనటువంటి మార్గములూ అందించకుండా, ప్రేమతో సహనముతో శాంతముతో సత్యమార్గమును అందించుటకు ఏ మానవుడు పూనుకొనునో ఆ మానవుని జీవితము ధన్యమౌతుంది.
ప్రేమస్వరూపులారా! ముఖ్యముగా ఈనాడు మందిరము కట్టారు. కాని, నాకు తెలుసు ఈ మందిరాలు తృప్తి కాదు. హృదయ మందిరమే శాశ్వతమైనది. ఈ ధనము ఏ సంఘసేవకో, ఏ దీనసేవకో, పట్టణ ఉద్ధార కృషికో ఉపయోగ పెట్టిన సార్థకమయ్యేవి. అయితే మనమంత పూర్ణస్థితిలో లేము. కనుక, దానికి కొంత ఆధారము మనకు కావాలి. ఇలాంటి మందిరములు ఎందుకోసము కావాలంటే, వకీలును చూచినప్పుడు కేసులు జ్ఞాపకమొస్తాయి. డాక్టరును చూచినప్పుడు రోగాలు జ్ఞాపకం వస్తాయి. మందిరమును చూచినప్పుడు దేవుడు జ్ఞాపకమొస్తాడు. కనుక, మందిరాన్ని యిక్కడ కడుతున్నారు. ఆవిధముగా హెచ్చరించే నిమిత్తమై మందిరాలు అవసరమే. కాని, నిజమైన మందిరము మీ హృదయ మందిరము మీ హృదయమందిరమే. ఈ హృదయ మందిరాన్ని పవిత్రం చేసుకొని దీన్ని ఒక ప్రేమ తత్త్వంలో నింపుకోవాలి. కేవలం విద్య, విద్య అని పాండిత్యముతో తల నింపుకొనే బదులు ప్రేమతో హృదయాన్ని నింపుకోటానికి ప్రయత్నించాలి. ఇదీ నిజమైనటువంటి సాయి సంస్థల ఆదర్శము. సాయి సంస్థలు ఏమి చేస్తున్నాయంటే అనేకమంది తెలియనివారు ‘ఏవో భజనలు చేస్తున్నారు’ అని అనుకుంటారు. ఇంత మాత్రమే కాదు. సాయి సంస్థలు చేస్తున్నటువంటి అమూల్యమైన కార్యము ఏ సంస్థలూ కూడా చేయలేదని చెప్పవచ్చు. నిజమైన ప్రేమతో, నిండు హృదయముతో, విశాలమైన భావముతో, స్వార్థ రహితముగా చేసేటువంటి సేవలు. ఈ ఆడవారుగాని, పిల్లలుకాని, వృద్ధులుగాని, ఎంతో ఆప్యాయంగా చేస్తున్నారు. నిజముగా స్వామి యొక్క శక్తి ఏమిటంటే ఏదో విభూతి యిస్తారు, ఇంకేవో పదార్థాలిస్తారు, ఇవికాదు నా పెద్దశక్తులు. నా ప్రేమయే అన్నింటికంటె పెద్దశక్తి. నా ప్రేమ వల్లనే మీయొక్క ప్రేమ యింతవరకు ఆకర్షించబడినదిగాని ఆ ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు. కనుకనే, స్వామియొక్క శక్తి ఏమిటి? గొప్ప ప్రేమ. ఈ ప్రేమకు మించినటువంటి శక్తి మరొకటి లేదు. కనుకనే, ప్రేమనియ్యడమూ, ప్రేమను పుచ్చుకోవడము ఇదే నాయొక్క వ్యాపారము. ఈ వ్యాపారము లోపల ఎంత ఆదాయమనేది ఏ ఇన్కమ్టాక్సాఫిసరుకు కూడా తెలియదు. నా ఆనందమునకు హద్దులే లేవు. నేనెప్పుడూ ఆనందముగానే వుంటాను. కారణమేమిటంటే, నేను ప్రేమతోనే సంబంధబాంధవ్యాన్ని పెట్టుకున్నానుగాని పదార్థాలతో సంబంధము పెట్టుకోలేదు. అందువల్లనే ఆనందము. మీరుకూడా ఈ మార్గాన్ని అనుసరించండి. తప్పక మీరుకూడను ఆనందముగా వుంటారు. అన్నివిధాలా శాంతిని పొందుతారు. ఈ సుఖమూ, దుఃఖమూ, ఆనందమూ, కష్టమూ, లాభమూ, నష్టమూ, జయమూ, అపజయమూ ఇవన్నీ దేనియొక్క కార్యములు? ప్రకృతియొక్క పరిణామములే. ఇందులో ఏది మనల్ని బాధిస్తున్నది? సుఖము మనల్ని అన్నివిధాలా విశ్రమింపజేస్తుందని భావిస్తున్నాము. ఇది చాలా పొరపాటు. ప్రకృతియొక్క పరిణామం లోపల శీతోష్ణములు రెండూ వుంటున్నాయి. అయితే ఇందులో ఏది మంచిది, ఏది చెడ్డది అని నిర్ణయం చేసుకుంటే ఎండల కాలములో శీతలము మంచిది. చలికాలములో ఉష్ణము మంచిది. ఏతావాతా రెండూ మనకు ఉపకారము చేసేటువంటివే కాని అపకారులు కావుకదా! అదేవిధముగానే మనయొక్క లాభమూ నష్టమే.
నష్టముకూడను మనకు ఒకవిధమైన లాభము చూపిస్తున్నది. కాబట్టి, నష్టముకూడను మంచిదే. ‘న సుఖాత్ లభ్యతే సుఖం’ అన్నారు. రెండు కష్టముల మధ్యనే సుఖము వుంటున్నాది. నిజముగా కష్టమే లేకపోతే సుఖముయొక్క దివ్యత్వము మనకు అర్థము కాదు. చావే లేకపోతే తల్లి అయినా బిడ్డను ప్రేమించదు. అదేవిధముగానే చీకటే లేకపోతే ఈ దీపానికి మూల్యమే మనము ఇవ్వము. అదేవిధముగా కష్టము వుండటము వల్లనే, దుఃఖము వుండటం వల్లనే, సంతాపము వుండటం వల్లనే సుఖాన్ని, ఆనందాన్ని, శాంతిని మనము కోరుతూ వున్నాము. ఈ శాంతిని కోరేటువంటి మార్గమును చూపినటువంటిది ఈ అశాంతియే. కనుక, ‘అశాంతి పోవాలి, శాంతి రావాలి’ అని మనము అనుకుంటే ఏమి చెయ్యాలి? ఒక షాపుకు వెళ్ళి పదిరూపాయలు మనము ఇచ్చినప్పుడే ఒక వస్తువు మనకు చిక్కుతుంది. ఒక దానిని మనము త్యాగము చేసినప్పుడే మరొక దానిని మనము పొందగలుగుతున్నాము. అదేవిధముగనే మనము శాంతి కావాలనుకుంటే అశాంతిని త్యాగము చెయ్యాలి. సమత్వం కావాలంటే అసమత్వాన్ని త్యాగం చేయాలి. సుఖం కావాలంటే దుఃఖాన్ని త్యాగం చేయాలి. అందువల్లనే ‘న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసుః’. ఈ త్యాగము వల్లనే మనకు నిజమైన ఆనందము వస్తున్నాది. త్యాగమే మనయొక్క యోగము. త్యాగమే మనయొక్క సర్వస్వము. కాని, ఇలాంటి మానవుడు త్యాగానికి ఏమాత్రమూ పూనుకోవటం లేదు. త్యాగం చేసినటువంటి మానవునియొక్క తత్త్వము యోగసిద్ధి పొందుతుంది. ఇలాంటి యోగసిద్ధిలో కూడా ఆత్మానందాన్ని పొందుతాము. కనుక, ఏ శక్తి వుండినప్పటికీ కూడను మనమీ ప్రాణమును వదిలే లోపలనే మంచి కార్యములు దానమూ, ధర్మమూ ఇలాంటివన్నీ చేసి పొరుగు వారికి ఏవిధమైనటువంటి కష్టమును కలిగించకుండా మీ శక్త్యానుసారంగా వారికి ఉపకారము చెయ్యటానికే పూనుకోవాలి. అందువల్లనే వ్యాసుడుకూడా చెప్పాడు. పద్దెనిమిది పురాణముల సారమూ రెండు మాటలలో చెబుతానన్నాడు. ‘అష్టాదశ పురాణేషు యత్తద్వక్ష్యేపదద్వయే పరోపకారఃపుణ్యా పాపాయ పరపీడనమ్’. పరులకు ఉపకారము చెయ్యటము ఒకటి. అపకారము చెయ్యకుండా వుండటము ఒకటి. అయితే అపకారము చెయ్యకుండా వుండటమే గొప్ప ఉపకారమని భావించాలి మనము. ఉపకారము చెయ్యటానికి మీకు శక్తి లేకుండా వుండోచ్చు. కనుక, భగవంతునియొక్క దివ్య విశాల భావాన్ని తెలుసుకొని, దైవత్వాన్ని సర్వులయందు వుండేటట్టుగా మనం చరించినప్పుడే ‘ఏకోహం బహుస్యామ్’. భగవద్గీతలో చెప్పినట్లుగా ‘బీజం మాం సర్వభూతానాం’. ఒక విత్తనము మనము నాటినప్పుడు అది ఒక మొక్కగా మొలచి, అది వృక్షముగా రూపొంది అందులో అనేక పుష్పములు, కాయలు, ఫలములు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు అనే విశ్వస్వరూపంగా కనిపిస్తుంది. ఇన్నింటికీ కారణమేమిటి? విత్తనము ఒక్కటే. ఈ విశ్వమనేటువంటి వృక్షములోపల కొమ్మలు అనేటువంటి సంబంధబాంధవ్యములు వుంటుంటాయి. మన సంబంధములంతా కూడను కొమ్మలే. మన జీవరాసులంతా కూడనూ కేవలము ఫలములు. ఈ ఒక్కొక్క ఫలములో తిరిగి విత్తనము వుంటుంది. కనుక, సర్వులయందు కూడను దైవమొక్కడే. ఎన్ని మతములైనా వుండవచ్చును. మతములన్ని చేరి మంచినే బోధించె తెలిసి మెలగవలయు తెలివితోడ మతులు మంచివైన మతమేది చెడ్డది?
మతము చెడ్డదని మనము అనుకుంటున్నాము. ఏ మతాన్ని కూడా మనము దూషించకూడదు. ఏ మతము నందుకూడను ‘మీది చిన్నది మాది పెద్దది’ అనే తారతమ్యము పాటించకూడదు. అన్ని మతములు మంచివే. కనుక, దేనినిష్టపడినా, దేనియందు అభిలాషపడినా మీరు దానిని అనుసరించుటలో అధికారముంటున్నాది. ఇలాంటి దైవత్వంలో మాత్రం దేనిని ఖండించే అధికారము ఎవ్వరికీ లేదని నేను గట్టిగా చెబుతాను. కారణమేమనగా దైవత్వాన్ని ఖండించే అధికారము దైవత్వానికే వుంటుందిగాని మరొకరికి లేదు. అలాంటి పరిస్థితులలో కేవలము అల్పబుద్ధులు కావటము చేత అన్నీ తెలిసినవారమని మనము ఆకాశానికి ఎగబ్రాకుతున్నాము. కాని, ప్రయోజనము లేదు. ఆకాశానికి చేరినప్పటికినీ ఆనందానికి నోచుకోలేకపోతున్నాము. చుక్కలను లెక్కిస్తున్నాము. చంద్రునిపై దిగుతున్నాము. కాని, శాంతిభద్రతలు లేకపోతున్నాయి. ‘హస్తమందు అణుబాంబు ఉంచుక, అరచుచుంద్రు శాంతి యనుచు’ ఎట్లా వస్తుంది శాంతి? శాంతి అనేటువంటిది బయటి ప్రపంచములో వుండేది కాదు. శాంతి మన హృదయములో వుంటున్నాది. మన హృదయము లోపల అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడే శాంతి మనకు లభిస్తుంది. ధనముతో మనకు శాంతి లేదు. విద్యతో మనకు శాంతి లేదు. గుణముతో మనకు శాంతి లేదు. బలముతో మనకు శాంతి లేదు. త్యాగముతోనే శాంతి వుంటున్నాది. ప్రేమతోనే శాంతి వుంటున్నాది. ఈ ప్రేమనూ, త్యాగమునూ మనము పెంచుకొన్నప్పుడే, ఈ ప్రేమ, త్యాగము రెండూ రెండు చక్రముల రథము వంటివి, చక్కగా మనము ప్రయాణము చేయవచ్చును. ఈ రెండు చక్రములలో ఏ చక్రము లేకపోయినప్పటికీ మనము ప్రయాణము చేయలేము. ఈ ప్రేమ, త్యాగము అనేటువంటివి రెండు రెక్కల పక్షి వంటిది. ఎంత దూరమైనా ఎగరటానికి ప్రయత్నము చేయవచ్చును. ఈ రెండు రెక్కలలో ఏ రెక్క లేకపోయినప్పటికీ ఎగరలేదు. ప్రేమస్వరూపులారా! మొట్టమొదట త్యాగము. దీనిని నేర్చుకోండి. స్వార్థాన్ని త్యాగం చేయండి. పరార్థాన్ని అభివృద్ధి చేయండి. ఇది నిజమైన జీవితానికి గమ్యము. ఇదే మనము చేయవలసిన పని. అంతేగాని, పుట్టినావు ఏమి సంపాదించావు? నాలుగిండ్లు కట్టించాను, ఇరవై ఎకరాలు సంపాదించాను. ఎవరికోసం? నీకు కట్టకడపటికి కావలసినది ఆరడుగులు మాత్రమే. ఈ ఇరవై ఎకరాలు నీకు పనికిరావు. నాలుగిండ్లు నీకు పనికిరావు. ఎవరికోసం? నీ వెంట రానిదీ, నీది కానిదానికోసం ప్రయత్నం చేయకు. నీ వెంట వచ్చేదీ, నీదయ్యేదీ పుణ్యము, ధర్మము అనేవి రెండే. పుణ్యకార్యములు చేస్తే మనవెంటనే వస్తుంటాయి. ధర్మమునాచరిస్తే ప్రతిబింబముగా మనలను అనుసరిస్తుంది. కనుక, ఈ దానధర్మములు చేస్తూ , ఈ ధర్మ కార్యములందు కూడను , గుంటూరు సంస్థలవారు ఏమీ తలచుకోకూడదు, నాకు ఎక్కువ ధనమును వ్యయము చేయటము ఇష్టము లేదు. ‘misuse of money is evil' అంటారు. ఈ ప్రదేశమునకు వచ్చిన తరువాత ఇందరి హృదయాలలో ఇంత పవిత్రమైన ప్రేమతో ఇంత మండుటెండలో కూడను నాయొక్క ప్రేమ నిమిత్తము మీరు కాచుకొని వుండటము ఇది చెప్పరానటువంటి విషయము, చెప్పటానికి కూడను సాధ్యము కానటువంటి విషయము. నా ప్రేమ మీ కోసము, మీ ప్రేమ నా కోసము. ఈ ప్రేమ తత్త్వాన్ని మనము తెలుసుకోవాలి. అంతేగాని, ఇంత ధనము వ్యయము చేసి ఈ పువ్వులు ఈవిధమైనటువంటిదంతా కూడను వ్యర్థం చేయటం మంచిది కాదు.
నేటినుండి మన సంస్థల వారెంతమాత్రం కూడను పూలకై ఏమాత్రమూ ఖర్చు పెట్టకూడదు. భగవంతుడు కోరేది ఒకే పుష్పము. ‘అహింసా ప్రథమం పుష్పం’ పుష్పములింకా వున్నాయి. శాంతిపుష్పం, దయాపుష్పం, తపఃపుష్పం, ధ్యానపుష్పం, ధర్మపుష్పం, సత్యపుష్పం, ఇలాంటి పుష్పాలు మనం తీసుకోవాలి. పుష్పం నేడు విచ్చుకుంటే రేపు వాడిపోతుంది. రాలిపోతుంది. కాని, హృదయపుష్పము వాడేది కాదు, రాలేది కాదు, కుళ్లేది కాదు. అలాంటి పుష్పాన్ని భగవంతునికి అర్పితం చేయండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం సమర్పయామి అని అన్నారు. కాని ఎలాంటి పత్రము? పత్రమనగా కేవలమూ జిల్లేడుపత్రి, మారేడుపత్రి, తులసిపత్రి ఇలాంటిది కాదు. పత్రమనగా ఏ ఋతువు వచ్చినప్పటికీ వాడిపోకుండా వుండాలి. రాలిపోకుండా వుండాలి. అదే నీ దేహమే పత్రము. ఇది ఎప్పుడు రాలిపోతుందో, ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు కాలిపోతుందో చెప్పటానికి వీలుకాదు. కనుక, ఈ దేహమనే పత్రమును భగవత్కార్యములో అంకితము చేయటమే నిజమైన ‘పత్రం సమర్పయామి’. దీనినే ‘పరోపకారార్థమిదం శరీరమ్’. ఈ శరీరము వచ్చింది పరోపకారము చేయటానికే. లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్ దీన్ని నింపుకోటానికి కాదు. శరీర రక్షణ కోసమని కొంత ఆహారముండాలి. కాని, దేనికోసము ఈ ఆహారము? దేనికోసము ఈ దేహము? సేవ చెయ్యాలి, సేవ చెయ్యాలి. సేవలోపలనే ఈ జీవితాన్ని అంకితము గావించాలి. సోమరితనానికి ఏమాత్రమూ అవకాశమునందించరాదు. ‘సోహం’ తత్త్వాన్ని మనం పంచుకోవాలి. సోమరితనం చేతనే మనం అనేకవిధములైన కష్టములకు గురైపోతున్నాము. నిజముగా మానవులు తినటానికి తిండిలేక అవస్థపడుతున్నారని అనుకుంటున్నాము. ఇది నాకు చాలా విచారంగా తోస్తుంది. కారణమేమనగా ఇచ్చింది రెండు చేతులు, ఉన్నది ఒక పొట్ట. రెండు చేతులూ పని చేస్తే ఒక పొట్ట నిండదా! మనము పని చేయటము లేదు. అందువల్ల పొట్ట నిండటము లేదు. మనము పని చేయాలి. పని చేయాలి. పని చేయాలి. మనము కార్మికులము. కష్టించి జీవించాలి. కనుకనే, శ్రమించి జీవించినటువంటి వ్యక్తి నిజమైనటువంటి జీవితాన్ని సార్థకము గావించుకున్నటువంటివాడు. కనుక, ఈ దేహమనే దానిని పత్రముగా భావించి భగవత్కార్యములో ప్రవేశపెట్టాలి. ఇంక పుష్పము. ఏ పుష్పము? ఇలాంటి పుష్పాలా? వాడిపోతుంటాయి. ఎవరో దీనిని పెంచి, ఎవరో దీనిని పోషించి, ఎవరో దీనిని హారము కట్టి, ఎవరో దీనిని అమ్మినప్పుడు ఆ పెంచినటువంటి వారికి పోతుంది కాని ఆ ఫలితము మనకు రాదు. ఎవరి సొత్తునో దొంగిలించివచ్చి ఎవరికో మనము అమ్మినట్లుగా వుంటుంటాది. కాదు, కాదు. ఈ హృదయపుష్పమనేది ఏరీతిగా వుండాలి? పుష్పము ఎలావుంటే అలా భగవంతునికి అర్పితము చేయము. దానిని చక్కగా కడిగి, అందులో వుండేటువంటి పురుగులో, మాలిన్యమో తీసివేసి భగవంతునికి అర్పితము చేస్తాము. అప్పుడే భగవత్ప్రీత్యర్థముగా మనము భావిస్తున్నాము. మన హృదయ పుష్పములో కామక్రోధలోభమదమత్సరములనే ఈ పురుగులనన్నింటినీ వేరు చెయ్యాలి. నిర్మలమూ, నిశ్చలమూ, నిస్వార్థమూ అయిన ఈ హృదయ పుష్పాన్ని అర్పించాలి. ఇదే నిజమైన పుష్పము. ఫలము. ఫలమంటే ఏదో బజారులో వుండే ఫలముకాదు మన ఫలము. ఈ మనస్సు పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు మధురంగా వుంటుంది. ఈ మధురమైనటువంటి పరమాత్మకు అంకితము చెయ్యాలి. ఇంక తోయము. ఈ తోయమనేది ఏ ట్యాప్వటరో, ఏ కృష్ణానీటినో, ఏ బావినీటినో, ఏ కొలను నీటినో తెచ్చి కాదు ఇయ్యవలసింది. ఈ అర్పితం చెయ్యటం వలన నీలో ఉప్పొంగే ఆనందము కన్నుల ద్వారా కారుతుంది.
అదీ ప్రవాహము. ఈ ఆనందభాష్పాన్ని భగవంతునికి అర్పితం చేయటమే తోయమంటున్నాము. అంతేగాని, ఏదో జపమూ, ధ్యానమూ అని కాలము వ్యర్థం చేస్తున్నాము. ఏం చేస్తున్నాము మనము జపము? మంచి వంటయింటి పక్కనే జపము పెట్టుకుంటున్నాము. వంట యింటి పక్కనే ధ్యానము చేస్తున్నాము. ధ్యానము చేస్తుంటే ఆ వేపుడు వాసనంతా వస్తుంటుంది. ‘ఏమిటి! వేపుడు మాడిపోతుంది, చూడు’ అంటాము. జపము చేస్తుంటాము. ఇదా మన ధ్యానము. ఎందుకు చేస్తున్నాము ధ్యానము? ఈ ధ్యానము కోసము మనము అవకాశము ఇవ్వకుండా సేవ కోసము మనము ఈ కాలాన్ని సద్వినియోగము చేయాలి. కనుక, ప్రతి పల్లెకూ వెళ్లి ఆ పల్లెలలో వుండే సమస్యలేమిటో, వాళ్లకు అవసరమైన కార్యములేమిటో తెలుసుకొని మనము సంపాదించుకొనే దానిలో కొంత భాగమైనా వారికి అర్పించి ఆ పల్లెలలో ఆ దీనులను తృప్తిపరచేటువంటి మార్గములో మన సత్యసాయీ సంస్థలు ప్రవేశించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. సంఘసేవ, సంఘసేవ, సంఘసేవ అదే విష్ణుసేవ, అదే విశ్వశ్రేయస్సు సేవ. ‘సహస్ర శీర్షా పురుష సహస్రాక్షః సహస్రపాత్’ ఇదంతా విశ్వవిరాట్ స్వరూపము కదా! విశ్వవిరాట్స్వరూపమంటే ఏదో భగవంతుడు చూపించాడని అనుకోటం కాదు. ఈనాడంతా గుంటూరులో విశ్వవిరాట్స్వరూపము కాదా? ఇదీ నిజమైనటువంటిది. ప్రతియొక్క శిరస్సు కూడను దైవస్వరూపమే. ప్రతియొక్క హస్తమూ దైవహస్తమే. కనుకనే, మానవసేవ మాధవసేవగా మారాలి. మాధవత్వమనే భావమే లేకపోతే మానవసేవ కేవలమూ వ్యర్థమైపోతుంది. కనుక, మాధవత్వాన్ని మానవునియందు కూడను యిమిడ్చి తద్వారా సేవ చేయటము కూడను ఒకవిధమైన మాధవసేవగా అనుకుంటారు. కాబట్టి ఎవరికి చేసినా కూడను ‘నా దైవత్వానికి నేను చేస్తున్నాను’ అనే భావన పెట్టుకోండి. ‘అహం దేహోస్మి’ కాదు, ‘అహం జీవోస్మి’ కాదు, ‘అహం బ్రహ్మాస్మి’. కనుక, నేను దేహమును, నేను జీవమును అనే రెండు భావనలను కూడా క్రమక్రమముగా తగ్గించుకొని ‘నేను ఆత్మను’ అనే భావంతో సేవ చేసినప్పుడు సర్వమూ సార్థకమౌతుంది. మీరు పెద్దగా వెయ్యి మందికి వండి పెట్టనక్కరలేదు. లేదా సమారాధన చేయనక్కర లేదు. ఆకలితో వున్నటువంటి వానికి, ఒక్కనికి నీవు కడుపు నిండుగా అన్నము పెడితే ఎంత ఆనందముగా వుంటుంది. చాలు. కనుక, భగవంతుడెప్పుడూ క్వాంటిటీని చూడడు. క్వాలిటీని చూస్తాడు. కనుక, దైవత్వాన్ని సంతృప్తి పరచి, జీవితాన్ని శాంతపర్చుకోవాలంటే ప్రేమతో, త్యాగముతో, సమాజసేవలోపల ఎవ్వరి మనస్సునూ నొప్పించకుండా వుండేటువంటి మార్గములో మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఇంతటితో ఈనాడు ఈ మందిరమును కేవలము మన హృదయ మందిరానికి ఒక చిహ్నముగా భావించి ఈ దృశ్యకల్పితమైన మందిరాన్ని మనయొక్క హృదయంలో నిర్మించుకొని అదే దైవత్వమునకు సరియైన ప్రతీకగా భావించుకొని మీరు ఆనందిస్తారని నేను ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ నా ప్రసంగమును విరమిస్తున్నాను.