Service as duty 19 November 1990, a talk to the members of the service organisations gathered from many lands, after twenty-five years of the service organisations' work
harimayamu viśvamantayu
Also in his talks (7) కాయంబుతో చేయు కార్యంబు తెల్లను మాటలాడుచునుండు మాటలెల్ల తన మనస్సునగల తలపులన్నింటికి పది యింద్రియముల పనులనెల్ల బుద్ధిలో కలిగెడు పూనిక తెల్లను చిత్తంబు నందలి చింత తెల్ల అను దినంబు సలుపు ఆచారములనెల్ల నియమంబుతో చేయు నిష్ఠ తెల్ల వైదికంబుల లౌకిక వర్తనములో ఏమి చేసిన నవియన్ని ఈశ్వరునకు తాను చేసెడి సేవగా తలచియున్న సార్థకంబౌను శ్రీసాయి సంస్థ తెల్ల. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు హరి మయముగాని ద్రవ్యము పరమాణువు లేదు యిలను పరికించినచో. దివ్యాత్మ స్వరూపులారా! విశ్వమంతయు భగవంతుని మయమే. భగవంతుని మయమైన యీ విశ్వమంతయు కర్మమయమే. కర్మ అనగా జీవ శక్తియే. ఈ జీవశక్తి ఉపాధియే యీ మానవత్వము. మానవ శరీరమే కర్మమయము. కనుకనే శృతులు కర్మజ అని వర్ణించినవి. మానవుడు కర్మనుండియే ఆవిర్భవించినాడు. కనుకనే మానవుడు చేసే, కరచరణ అవయవాదులలో సలిపేటువంటి సర్వక్రియలు కూడను విష్ణుమయమే. కనుక మానవుడు సలిపే సమస్త కర్మలు కూడను దైవ కర్మలుగానే మనము విశ్వసించాలి. క్రేతా యితి కర్మః. మానవుడు సలిపే సమస్తక్రియలు కర్మస్వరూపములే. మానవుడు ఏ కర్మలు చేసినప్పటికి స్వార్థముతో ఫలాపేక్షతో అహంకారముతో సలుపుచున్నాడు.
ఫలాపేక్షతో సలిపిన యీ కర్మల యొక్క ఫలమును అనుభవించే నిమిత్తమై తిరిగి జన్మ ఎత్తుతున్నాడు. కనుకనే కర్మాను బంధిని మనుష్యలోకే. మానవుడు కర్మచే బంధింప బడినాడు. ఏ కర్మలు చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు అవి పవిత్రముగా కొనసాగుతాయి. సహజమైన యీ కర్మలన్నింటిని సాధకుడు కర్మయోగముగా మార్చుకోవాలి. కర్మకు, కర్మయోగమునకు వుండిన వ్యత్యాసము గుర్తించి వర్తించాలి. ఫలాపేక్షతో, అహంకారముతో, స్వార్థముతో ఆచరించునటువంటివి కర్మలు. నిస్వార్థముతో, నిరహంకారముతో, ఫలాపేక్షరహితముగా ఆచరించినవన్నియూ కర్మయోగములు. ఎవరికి వారు నేను కర్మయోగినా, లేక కర్మభ్రష్టుడనా లేక కర్మాధికారినా అని తనకు తానే నిర్ణయము చేసుకోవచ్చు. మానవుడు నిరంతరము కర్మజీవిగానే తనయొక్క కాలము గడుపుతున్నారు. ఐతే స్వార్థముతో కూడిన కర్మలైనప్పటికి పరార్థమును కొంతవరకు గుర్తించి సేవలో పాల్గొనాలి. స్వార్థరహితమైన కర్మలు ఆచరించటమే మానవుని యొక్క ప్రధాన లక్షణము. ఈ శరీరము ఆవిర్భవించినది 'పరోపకారార్థమిదం శరీరమ్' అనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఇట్టి పరోపకారార్థమై చేసే సేవలయందు పరార్థమైన సంబంధము ఆవిర్భవిస్తుంది. శ్రీమంతులు, మధ్యతరగతి వారు, బీదవారు కలసి నివసించే స్వరూపమునకే సమాజము అని పేరు. సమాజసేవ అనగా కేవలము మానవ సేవయే. ఈనాడు శ్రీమంతుడు తన తోటి మానవుని యొక్క సహాయము చేతనే తను ఆస్థితికి రాగలుగుతున్నాడు. తోటి మానవుని సహాయము లేక మానవుడు యేనాటికిని ఉన్నత స్థాయిని అందుకొన లేడు. కనుక తన తోటి మానవుని చేత తాను యిట్టి స్థితికి వచ్చినాను అని చెప్పి విశ్వాసాన్ని గుర్తించి తోటి మానవునకు తగిన సహాయము చేయటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము. మానవత్వములో మూడు విధములైన శక్తులున్నవి. ధనబలము, భుజబలము, విద్యాబలము. ఈ మూడు బలములు మానవుడు సద్వినియోగ పరచుకునే మార్గములో ప్రవేశపెట్టాలి. విత్తము అనగా కేవలము ధనమునకు సంబంధించిన పదము మాత్రమే కాదు. విద్యతే లభ్యతే ఇతి అని వ్యుత్పత్తి అర్థము. అనగా పొందబడినది అని అర్థము. భుజబలము పొందబడినటువంటిదే. విద్యాబలము పొందబడినటు వంటిదే. ధనము పొందబడినటువంటిదే. విత్తము అనగా ధనబలము, దేహబలము, విద్యాబలము మూడు బలములతో గూడినటువంటి దానినే విత్తము అని చెప్పవచ్చును. ఈ పొందబడిన యీ మూడు శక్తులు కూడను సమాజమునకు అర్పితము గావించి సద్వినియోగము చేసుకొనుట మానవుని ప్రధాన లక్షణము.
కష్టసుఖములు కావడి కుండలు. ఎప్పుడు ఎవరికి ఏస్థాయిలో ఏకాలమందు ఎట్టి స్థితి లభ్యమవుతుందో ఎవరును చెప్పలేరు. కోటీశ్వరుడు కూటి పేద కావచ్చును. కూటి పేద కోటీశ్వరుడు కావచ్చును. ఇవి ప్రాకృతమైన చర్యలు. ప్రకృతి యొక్క స్వభావములు. మానవుడు ఎన్ని యజ్ఞ యాగాది క్రతువులాచరించినప్పటికిని యివి ప్రకృతి బద్ధమైనటువంటివి. ఇవన్ని మోహముతో కూడినటువంటివి. ఈ మోహము ఏనాటికైనా కూడను తిరిగి కాలచక్రములో నెట్టక తప్పదు. కనుక యీ సత్యాన్ని గుర్తించి ప్రతిమానవుడు తన యొక్క కర్మలు తాను సక్రమమైనవిగను, సదుపయోగమైనవిగను, యితరులకు సహాయకరమైనవిగను రూపొందింప జేసుకోవాలి. ధనవంతులు దరిద్రనారాయణ సేవ చేస్తున్నామని భావిస్తారు. దరిద్రనారాయణులంటే ఎవరు? కేవలము మానవ దృష్టిలో బీదవారు, తినుటకు తిండి లేని వారు, ఉండుటకు కొంపలేని వారు, కట్టుకొనుటకు బట్ట లేని వారు అని మనము భావిస్తున్నాము. దరిద్ర నారాయణుడంటే దరిద్రుని హృదయవాసి యైనటువంటి నారాయణ సేవనే చేసినట్లుగా భావించాలి. రూపము లేని భగవంతునకు యీ రూపమే అనే మార్గములో మనము ప్రవేశపెట్టుకొని తద్వారా మన కర్మలను సార్థకము గావించుకోవాలి. హృదయములో కొంతవరకు బీదవారి యొక్క చింతలు ప్రవేశ పెట్టుకొని యేదో తగినటువంటి సేవ చెయ్యాలి అని సంకల్పించునో అట్టి వాని హృదయమునందే భగవంతుడు నివసిస్తూ వుంటాడు. మానవుని యొక్క స్థితిగతులు తనయొక్క హస్తమునందు లేవు. మంచిచెడ్డలన్నియు మానవుడు చేసే కర్మలతో కూడి వుంటున్నవి. మన సుఖదుఃఖములన్ని మనము చేసే కర్మల ఫలితములే. ఎవరో మనకు విరోధులున్నారని, ఎవరో మనకు యిష్టులున్నారని భావించుకోటం కేవలము ఒక అజ్ఞానమే. మనము చేసిన పాపకర్మములే మన శత్రువులు. మనము చేసిన పుణ్యకర్మములే మనకు మిత్రులు. శత్రువులు, మిత్రులు మనకు బయటివారు కాదు. మనయందే నివసిస్తున్నాయి. మానవుడు సత్యమైన, సహజమైన, సక్రమమైన కర్మలను ఆచరించి తద్వారా తాను ఆత్మతృప్తిని పొందటానికి కృషి చెయ్యాలి. అన్నింటికిని కాలము ప్రమాణము. కాలమే ప్రధానము. కనుక మనయొక్క స్థితిగతులకు మనయొక్క కర్మలే మూలకారణము. ఒకానొక సమయమందు పదకొండు సంవత్సరములు అరణ్యవాసము చేయు సందర్భములో తమ యొక్క కష్టములు విచారించుకుంటూ ద్రౌపది ధర్మజుని పాదములు పట్టుకొని చాలా బాధపడింది.
… అని విలపించినది. అప్పుడు ధర్మజుడు చిరునవ్వు నవ్వుతూ ద్రౌపదిని శాంత పరుస్తున్నాడు. కాలము బట్టి సర్వము కలుగుచు నుండును ద్రౌపదీసతీ కాలము బట్టి వచ్చెడిని కల్మికి లేమికి రాకపోకలున్. కాలమె అన్నిరీతులను కారణం మెంచుచు చూడగాను న కాలమె లొంగజేయని మనుష్యు డొకండును లేడుగా ధరన్. ప్రేమస్వరూపులారా! కాలము చాలా ప్రధానమైనటువంటిది. చాలా విలువైనటువంటిది. చెడ్డ కార్యములు చేయుటలో కాలము వ్యర్థము చేయరాదు. ఎప్పటికప్పుడే మంచికార్యములు చేయుటలో ముందంజ వేయాలి. ఎప్పుడో ఎప్పుడో చేస్తాననుకోటం కేవలము కాలము మన స్వాధీనములో లేదు. కాలమునకు ఎవ్వరు కూడను మిత్రులు కాదు. సర్వులు కాలమును అనుసరించవలసినదే గాని కాలము ఎవరిని అనుసరించదు. కనుక కాలమును వ్యర్థము చేయక, కాలమును నిరర్థకము గావించుకొనక, కర్మలను సార్థకము గావించుకోవాలి. అదియే మానవుని ప్రధాన కర్తవ్యము. ఈ కాయము కర్మాచరణ నిమిత్తమై యేర్పడినదనే సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడను గుర్తించాలి. ఏ కర్మలు చేసినప్పటికిని పరమాత్మ సేవగా మనము భావించాలి. ఏవో కర్మలు చేస్తున్నామని మనము సంతృప్తిలో వుండిపోవటము కేవలము అజ్ఞానమే. కర్మలు పశుపక్షి మృగాదులు కూడను చేయుచున్నవి. కర్మలు చేయుట ప్రధానము కాదు. అహంకార రహితమైన కర్మలు చేయటం మానవుని ప్రధాన కర్తవ్యము. ఇదియే సేవలయందున్న ప్రధానమైన దివ్యమైన మార్గము. సేవ అనగా కేవలము నేను యజమానుడు కాదు అనే సత్యాన్ని గుర్తించాలి. నీవు master కి చేసే కింకరుడుగా విశ్వసించాలి. ప్రతి మానవుని యందు వుండిన దివ్యత్వము దైవ స్వరూపమే. ఈ కర్మలు అహంకార నిర్మూలనము గావించి దివ్యత్వమైన విశాలమైన దైవత్వమును చేర్చునటు వంటివి. ఇలాంటి సేవలయందు మానవుడు పాల్గొని తనయొక్క జీవితాన్ని సార్థకము గావించుకోవాలి.
నవవిధ మార్గములందు ప్రధానమైనది సేవయే. శ్రవణం కీర్తనం విష్ణోస్స్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహ మాత్మనివేదనం. ఆత్మ నివేదన మనగా దైవార్పితమైన భావముతో సేవలు చేయుటమే ఆత్మనివేదనము. ధన బలమును మనము యేవిధముగా సద్వినియోగము గావించాలి. కేవలము బీదలైన వారు, అన్నమునకై అల్లాడే వ్యక్తులందు మనము ప్రవేశించి వారికి ఏవో ఆత్మబోధలు చేస్తామంటే ఆ వ్యక్తులకు ఆత్మబోధ యేమాత్రము హృదయానికి చేరదు. ఆకలితో నున్న వారికి అన్నమందించాలిగాని ఆత్మబోధ చేస్తే వారికి చెవులలో చేరదు. మొట్టమొదట ఆకలితో నున్నవానికి అన్నము నందించు. అన్న వస్త్రములున్న వారికి తగిన సహాయము చేయి. ఈ విధమైన దీంల్లో జనులను సరియైన మార్గములో ధైర్యసాహసములతో తన జీవితములో పాల్గొనే వుత్సాహప్రోత్సాహము లందించాలి. విద్యావంతులు అవిద్యావంతులకు తగిన సమయము పురస్కరించుకొని వారికి విద్యను కొంతవరకు అభ్యసింప జేయటానికి కృషి సల్పాలి. కేవలము విద్య పొట్టకూటి నిమిత్తమై యేర్పడినటువంటిది కాదు. తనస్వార్థమునకై నిర్ణయించినది కాదు. ఉద్యోగ అధికారముల నిమిత్తమై యేర్పడినటువంటిది కాదు. మానసిక వికాసము గావించుకొనుటకై ఏర్పడినది విద్య. కాని యీనాటి విద్య సంకుచితమైన మార్గములో ప్రవేశిస్తున్నది. ఈ విద్యలో విశాలమైన భావము శూన్యము. కృషి కూటికోసం. విద్య విజ్ఞానము కోసము. కాని దురదృష్టవశాత్తు యీనాడు విద్య కూటికోసమై ఏర్పడినట్లుగా భావిస్తున్నారు. కనుక విజ్ఞానమును బోధించి విశాలమైన హృదయాన్ని కల్పింప జేయటమే విద్యావంతుల యొక్క కర్తవ్యము. బలహీనులైన వారికి సంభవించిన దుఃఖములకు, కష్టములకు తగిన తోడ్పాటు సల్పి వారిని ఆదరించి, వారిని సంరక్షించే నిమిత్తమై తగిన శక్తిని వినియోగించాలి. విద్యావంతులు డాక్టరు కావచ్చు, లాయరు కావచ్చు. ఒక వ్యాపారస్థుడు కావచ్చు. డాక్టరైన విద్యావంతుడు బలహీనుడైన రోగులను ఆదరించి ఆప్యాయముతో వారిని చేర్చి రోగమునకు తగిన చికిత్సను కేవలము ధనరహితమైన మార్గములో ప్రవేశ పెట్టాలి. ఉచితమైన సేవలు చెయ్యాలి. తాను తెలుసుకున్న యీ వైద్యమును సరైన మార్గములో ప్రవేశ పెట్టాలి.
ఉచితమైన సేవలు చెయ్యాలి. తాను తెలుసుకున్న యీ వైద్యమును సరియైన మార్గములో స్వార్థరహితమైన మార్గములో యీ బీదలకు వినియోగ పెట్టాలి. ఇంక లాయరుగా వుండినవారు శక్తిహీనులైనటువంటివారు ఏదైనా చిక్కులలో ప్రవేశించినప్పుడు తనస్వార్థమును విసర్జించి ఉచితంగా తనకు సంబంధించిన యీ చిక్కులను నివారణ గావించే మార్గములో ప్రవేశించాలి. ఒక వ్యాపారస్తుడు. తనకు వున్నదానిలో కొంత వరకు తనకు income వచ్చే మార్గము చూచుకొని మిగిలినదంతయు దానధర్మాదులకు పయోగించాలి. ఈ విధమైన మార్గములో విద్యను సేవాసంస్థలయందు ప్రవేశ పెట్టాలి. కానీ దురదృష్టవశాత్తూ యీనాడు యీ మూడు విధములైన మార్గములు ఎక్కడ కనుపించటం లేదు. డాక్టర్లుగాని, లాయర్లుగాని, వ్యాపారస్తులగాని తనయొక్క ధనార్జనే ప్రధాన లక్ష్యమునందు చూచుకుంటున్నాడుగాని ప్రజలయొక్క యోగక్షేమమును ఏమాత్రము చూడటం లేదు. వారిని పీడించి సంపాయించిన యీ ధనముచేత యే వ్యక్తి కూడను సుఖాన్ని సంతోషాన్ని అనుభవించలేడు. కనుక సద్వినియోగముతో ఆర్జించిన ధనము వల్లనే సుఖ సంతోషములు లభ్యమవుతాయి. ఇతరులను బాధించి ఆర్జించిన ధనము పీడిస్తూనే వుంటుంది. ఈ సత్యాన్ని వ్యక్తులు గుర్తించి సమాజసేవలో పాల్గొనాలి. తన భవిష్యత్తులో శాంతి భద్రతలను అనుభవించాలనుకున్నప్పుడు సద్వినియోగముగా మన శక్తులను వినియోగించాలి. కనుక సేవ ప్రధానమైన సాధన. ఏ జపములు, ఏ సాధనలు, ఏ యోగములు చేయనప్పటికిని సేవవల్ల నిజంగా పరమాత్మని యొక్క దివ్యత్వాన్ని ప్రేమ తత్వాన్ని గుర్తించటానికి అవకాశము వుంటుంది. ఈ సేవ అనేకత్వములోని ఏకత్వమును నిరూపిస్తుంది. కనుకనే సర్వుల యందు వున్న దివ్యత్వమును గుర్తించాలనుకున్నప్పుడు ప్రజాసేవయే సరియైన సాధన విద్యా వైద్య సౌకర్యాలను కల్పించి దీనులకు దిక్కులేని వారికి తగిన సహాయమును మనము చేకూర్చాలి. తనకు తాను జీవించటం గొప్పతనము కాదు. పరులకొరకు జీవించే జీవితమే నిజమైన జీవితము. మానవుడు యీ కాలమునందుగానీ, యీలోకమునందుగానీ తానొక్కడే జీవించే భావము ఎక్కడ కూడను లభ్యము కాదు. సమాజము యొక్క ప్రోత్సాహము లేక, సమాజము యొక్క పరిస్థితులు తాను గుర్తించుకొన లేక, మానవుడు జీవించటము దుర్లభము. మానవుడు సమాజమునందే పుట్టి సమాజమునందే జీవించి సమాజమునందే అంత్యమవుతున్నాడు. కనుక అట్టి సమాజమునకు తగిన కృతజ్ఞతను అందించటమే కర్తవ్యము.
కానీ యీనాటి మానవుడు కృతజ్ఞుడు కాక కృతఘ్నుడుగా రూపొందుతున్నాడు. కృతజ్ఞత అనేది మానవునియందు ప్రధానమైన జీవము. భగవంతుని యొక్క అష్టోత్తర శత నామమునందు ప్రత్యేకమైన పేర్లు వున్నవి. ఓం హిమఘ్నాయనమః, కృతఘ్నఘ్నాయనమః, ఓం తమఘ్నాయనమః. అని పిలుస్తారు. తమఘ్న అనగా అంధకారము దూరము చేసేటువంటివాడు. అంధకారమును దూరము చేసేది ఏమిటి? ప్రకాశమే. కనుక యీ ప్రకాశము ఎక్కడ వున్నదో అక్కడ అంధకారము వుండుటకు వీలు లేదు. భగవంతుడు సర్వత్రా వుండటం చేతనే యీ అజ్ఞానము నిర్మూలనము గావిస్తున్నాడు. హిమ ఘ్నాయనమః. ఎంతో దట్టముగా వున్న హిమమును, మంచుగడ్డనం, సూర్యుడు ప్రకాశించేటప్పటికి క్రమక్రమేణా కరిగిపోతూ వుంటుంది. కనుక సూర్యోదయము వల్ల గడ్డగా వున్న హిమము కూడను ప్రవహించే నీరుగా మారిపోతూ వుంటుంది. వెలుగే లేకపోతే చీకటి పోదు. చీకటి పోవాలంటే వెలుగు కావాలి. సూర్యకిరణములే లేకున్న మంచు కరుగదు. మంచు కరగాలంటే సూర్యోదయం కావాలి. అదే విధముగనే కృతజ్ఞత లేకపోతే మనయొక్క దివ్యదృష్టియే మనకు వుండదు. దివ్యదృష్టి సూర్యోదయము వంటిది. సూర్యకిరణములు ప్రతియొక్క నేత్రమునందును అంతర్లీనమై వుంటున్నవి. పురుష సూక్తమందు చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత. మన కన్నులు సూర్యకిరణములలో వుండిన ప్రకాశ శక్తియే. కృతజ్ఞత లేని వాని దృష్టిని సూర్యుడు నిర్మూలనము చేస్తాడని దీని అర్థము. అనగా గుడ్డివానిగా చేస్తాడట. తనయొక్క కిరణములు తాను వెనుకను తీసుకున్నప్పుడు గుడ్డివాడు కాక యింకేమవుతాడు. లోకములో ఏ పాపమునకైనా పరిహారమున్నదిగాని కృతజ్ఞత లేనివానికి యేమాత్రము పరిహారము లేదు. కనుక మొంటుమొదట మానవునికి కృతజ్ఞత చేసిన మేలు మరువకుండా వుండటం ప్రధానలక్ష్యం. భవిష్యత్తులో మనము సరియైన స్థితిని పొందాలనుకున్నప్పుడు మన వర్తమానమును గుర్తించాలి. ఈనాటి మేలును ఏనాడు మరువకుండా చూచుకోవాలి. ముందు చేసేది మన వర్తమానములో వుంటున్నది. కనుక కృతజ్ఞతను మనము సరియైన లక్షణముగా చూచుకోవాలి. మానవునకు ప్రధానమైన గుణమే కృతజ్ఞత. ఈ విధమైన గుణములను మనము పెంచుకొని సమాజమునకు తగిన కృతజ్ఞత నందించే విశాలహృదయాన్ని మనము పెంచుకోవాలి. పురోభివృద్ధిని కోరువారు పూర్వ వృత్తాంతము మరువరాదని ఒక అర్థం. ఈనాటి మనయొక్క చిక్కులకు మన యొక్క బాధలకు ఎవరు సహాయము చేశారో వారిని మాత్రమే మనము మరచినప్పుడు భవిష్యత్తులో యేమాత్రము సుఖశాంతులు వుండవు.
కనుక యీనాడు మనము సర్వసుఖములు సర్వ ఆనందములు కూడను వారివలనే మనము అనుభవిస్తున్నాము. ప్రకృతి అనగా సమాజము యొక్క శక్తియే. కనుక యీ సమాజమునకు తగిన కృతజ్ఞత నందించాలి. అందు నిమిత్తమై సత్యసాయి సంస్థలలోపల సేవామార్గము ప్రధానమైనది. దీనినే దృష్టిలో పెట్టుకొని సేవాసంస్థలు ప్రారంభించారు. ఈ సేవలు దివ్యమైన సేవలుగా మార్చు చెయ్యాలి. ఇది యేదో కృత్రిమమైన మార్గముగా భావించరాదు. నిర్బంధమైనదిగా భావించరాదు. మీరు ప్రీతి పూర్వకముగా, హృదయ పూర్వకముగా సేవలలో పాల్గొని ఎవరికి చేసినప్పటికిని నాదైవమునకు చేస్తున్నానని విశ్వసించి చెయ్యాలి. సేవలయందు నిజముగా నిరహంకార మనేది మన సత్యసాయి సంస్థల యందు మాత్రమే ప్రత్యక్షముగా గోచరిస్తున్నది. ఈ అహంకారము చావాలంటే నిజమైన ప్రేమ పెరగాలి. ఈనాడు యిన్ని వేలమంది యిక్కడ ప్రవేశించి, గృహములో ఎన్నియో సదుపాయములు, ఎన్నియో అనుకూలములు ఎన్నియో సుఖములు వుండినప్పటికిని అవన్నియు త్యజించి యిక్కడ యిన్ని కష్టములకు, యిన్ని బాధలకు, యిన్ని అననుకూలములకు సహించి భరించుకొని జీవించటమే గొప్ప తపస్సు. ఏకాత్మ భావమనగా ఏ సంస్థలయందు కనుపించదు. ఒక్క సత్యసాయి సంస్థలయందే గోచరిస్తున్నది. ఎన్ని దేశములవారు, ఎన్ని మతములవారు, ఎన్ని భాషలవారు అందరు కూడను యీ ప్రదేశములో చేరి అన్నదమ్ముల వలె అక్కచెల్లెండ్ర వలె ఒకరినొకరు అనుసరించి ఆప్యాయంగా ఒక్కచోట చేరి ఆనందమును అనుభవించటమనేది ఒక్క సత్యసాయి సంస్థలకు మాత్రమే తగినటువంటిది. ప్రేమస్వరూపులారా! యీ విధమైన ప్రేమ తత్వాన్ని యింకను అధికముగా మనము అభివృద్ధి పరచుకొని యీ ప్రపంచమునకు మార్గదర్శకులుగా రూపొందింపబడాలని గాఢమైన ప్రతిజ్ఞ మీరు చెయ్యాలి. అప్పుడే ఉపనిషత్తు వాక్యాన్ని చక్కగా మనము నిరూపించిన వారము వుతాము. కేవలము సేవాసంస్థల వారమని సేవలకు దూరంగా వుండి, ఐకమత్యమనే దానిని చంపుకొని, ఆనందమే ప్రధాన లక్ష్యము నందుంచుకొటము సరియైనది కాదు. ఎక్కడవుండినప్పటికిని తన హృదయ తృప్తిగా సేవలు చెయ్యాలి. ఎవరికోసమో ఎందుకోసమో చేస్తున్నామని మీరు భావించరాదు. నీ నిమిత్తమై నీవు చేస్తున్నట్లుగా నీవు విశ్వసించాలి. అదియే ఆత్మతృప్తి అని వేదాంతము చెప్పుతూ వచ్చింది.
నీవు చేసే సేవలు నీకు సంతృప్తి కరముగా వున్నవా? లేక యితరుల తృప్తి నిమిత్తమై ఆడంబరముగా చేస్తున్నావా? ఈ ఆడంబరము వుండినంత వరకు ఆనందము మనకు లభ్యము కాదు. ఈ ఆడంబరము వుండినంతవరకు అహంకారము చావదు. అహంకారము చావక ఆత్మతత్వము అర్థము కాదు. కనుక మొట్టమొదట యీ ఆడంబరమును చంపాలి. తద్వారా యీ అహంకారము కూడను చస్తుంది. మన సహజానందము మనకు ఆవిర్భవిస్తుంది. మన సహజానందము మనము పొందాలి. ఇక్కడ భగవద్గీత యందు స్వధర్మము, పరధర్మము అని రెండు పదములు వుపయోగ పెట్టారు. స్వధర్మ మనగా కుల మత వర్ణ ధర్మములని మనము భావిస్తున్నాము. కాదు కాదు. స్వ-ఆత్మ. ఆత్మధర్మమే స్వధర్మము. పరధర్మ మనగా దేహధర్మములే. అనగా కులమత వర్ణములకు సంబంధించినటువంటిది. యజ్ఞ యాగాది క్రతువులన్నీ పరధర్మమునకు సంబంధించినవే. ఇవన్నియును పరార్థమైనవి. భగవద్గీత చెప్పిన పరధర్మ మనగా శరీరసంబంధమైన ధర్మముగానే విశ్వసించాలి. భగవద్గీతయందు మొట్టమొదటి శ్లోకము 'ధర్మక్షేత్రే కురుక్షేత్రే'. ఏది ధర్మక్షేత్రము? ఏది కర్మక్షేత్రము? హృదయమే ధర్మక్షేత్రము. దేహమే కర్మక్షేత్రము. కనుక కర్మక్షేత్ర మనే దేహమునకు ధర్మక్షేత్రమనేది అంతర్భూతమై వుంటున్నది. కనుక కాయముతో చేసే సర్వకర్మలు కూడను కర్మక్షేత్రమే. ప్రతి మానవుడు ధర్మక్షేత్ర యాత్రికుడే. కర్మలు ఆచరించక తప్పదు. సహజంగా యీ కర్మలు ఆచరించబడుతూనే వున్నాయి. మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కర్మలే. మనయొక్క రక్తము సరఫరా కూడా కర్మే. మన మాటలు కర్మనే. మన ఆటలు కర్మయే. అన్నికూడను కర్మమయమైనటువంటివి. కనుక దేహము కర్మమయమే. హృదయము ఒక్కటే ధర్మక్షేత్రము. అక్కడనుంచి రావాలి భావాలు. అక్కడనుండి రావాలి పదములు. ఇంక మిగిలినవన్నీ కూడను కొంత artificial. కృత్రిమమైనవి. కనుక మన బయటనుండినవన్నియూ కృత్రిమమైనవే. మనలోపల నున్నటువంటిదే నిజమైనటు వంటిది. art is outside heart is inside. మనము హృదయాన్ని అనుసరించాలి. ఇదియే భగవద్గీత ప్రధానమైన బోధ. కురుక్షేత్ర మనగా ఏదో ఢిల్లీకి సమీపములో నున్న క్షేత్రము కాదు. బాహ్యమైన కర్మలయొక్క ఆచరణలు. కనుక మనదేహమే కురుక్షేత్రము. మన హృదయమే 'ధర్మక్షేత్రము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః' రెండూ కూడిన నేను అని. మామక అనగా మమకారముతో కూడినటువంటిది.
పాండవాశ్చైవ అనగా పరిశుద్ధమైనది అనగా మంచి చెడ్డలు రెండూ చేరి ఏమిచేస్తున్నాయి? మంచి మంచి చేస్తున్నది. చెడ్డ చెడ్డ చేస్తున్నది. ఈ మంచి చెడ్డలు చేరి ఏమిచేస్తున్నాయని అడిగాడు అతడే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. మంచి చెడ్డలు రెండూ చేరి ఏమి చేస్తున్నాయని అడగటం ఎంత అజ్ఞానం చెప్పండి. ఏదో మనము ఆటలాడుకోవాలని play groundకి పోయి ఏమి చేస్తున్నావని అంటే ఆటలాడుకుంటున్నాం అంటారు. యుద్ధభూమిలోకి పోయి ఏమి చేస్తున్నారని అనటం ఎంత అర్థరహితమైంది. యుద్ధం చేస్తున్నారు. ఈ కురుక్షేత్రమనే యీ దేహములో మంచి చెడ్డలనే పాండవ కౌరవులు యుద్ధము చేస్తున్నారు. కనుక యీ చెడ్డను మనము దూరము గావించి, చెడ్డపై విజయాన్ని సాధించటానికి యీ మంచికి తగిన సహాయమును శక్తిని మనము అందించాలి. మంచివారే పాండవులు. దుష్టులే కౌరవులు. ఈ పాండవులు మంచివారు ఎట్లా అయ్యారు? వారు కృష్ణుని ఆశ్రయించారు భగవంతుని ఆశ్రయించటం చేత వారు పాండవులుగా మారిపోయారు. వారు భగవంతుని ముందు వుంచుకున్నారు. కానీ కౌరవులు వేరు 1st అదే అహంకారము, next ప్రపంచము కృష్ణుని దగ్గరకు పోయి సైన్యాన్ని కోరారు. భగవంతుని Last గా పెట్టుకోటం వలన Lost అయిపోయారు. కనుక ప్రతి మానవుడు భగవంతుని ముందుంచుకోవాలి. భగవంతుని ముందుంచుకున్నప్పుడు తన జీవితమంతా విజయముగా మారిపోతుంది. కనుకనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాపాండవశ్చైవ కిమకుర్వత సంజయ అన్న ప్రశ్నకు సంజయుడు యేమి జవాబు యిస్తున్నాడు యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీః విజయో భూతిః ధ్రువా నీతిర్మతి ర్మమ ఎక్కడ భగవంతుడు, ఎక్కడ ధైర్యసాహసములతో కూడిన జీవశక్తి వుంటున్నదియో అక్కడే విజయము చేకూరుతుంది' అన్నాడు. భగవంతునిపై ధృఢమైన విశ్వాసము కలగాలి. ఆ యొక్క విశ్వాసము అటు యిటు యేమాత్రము చలించరాదు. ఒక స్థిరత్వంగా వుండాలి. అట్టివానికే యిట్టి విజయము సాధ్యమవుతుంది. కనుక మనము యే కార్యములు చేసినా, సంకల్పించుకున్నప్పటికి భగవంతుని విశ్వాసముతో మనము యీ కార్యములో ప్రవేశించాలి.
దివ్యాత్మస్వరూపులారా! నేడు యీ ప్రపంచము యొక్క పరిస్థితి చాలా భయభ్రాంతులతో కూడినటువంటిది. ఎక్కడ చూచినా భయము, భయము. ఇంటిలో వున్నా భయమే. వీధిలోకి వచ్చినా భయమే. బస్సెక్కినా భయమే. రైలు ఎక్కినా భయమే. నడచి పోయినా భయమే. ఎక్కడవుండినా భయమే. ఈ భయమును దూరము గావించుకోవాలంటే అభయమైన దైవత్వమును విశ్వసించుకోవాలి. ఈ భయమును దూరము గావించి అభయత్వమును అందిస్తుంది దైవత్వము. ప్రేమస్వరూపులారా! మీ భయాన్ని దూరము గావించుకొని భవిష్యత్తును యేమాత్రము విచారము చేయక వర్తమానములో ధైర్యసాహసములతో ప్రేమ విశ్వాసములతో సేవలో మనం పాల్గొనాలి. ఆ విశ్వాసములో మనము ప్రవేశిస్తే దేశాన్ని కూడను మనం సంరక్షించుకోగలము. నీ దేశమును సంరక్షించుకొనే నిమిత్తము నీవు యేమి చేయనక్కర లేదు. నీ సత్యధర్మాన్ని నీవు కాపాడుకో. ఆ సత్యధర్మమే దేశాన్ని కాపాడుతుంది. నీ సత్యాన్ని నీవు పోషించుకో. నీ ధర్మాన్ని నీవు ఆచరించు. అదే నీ హృదయము యొక్క ప్రబోధ. ఈనాడు యిట్టి సేవాసంస్థలు విరివిగా పెరిగాయి. దేశమంతా సేవసంస్థగా మారాలి. అప్పుడే దేశము దుర్భిక్షము లేకుండా సుభిక్షముగా కళకళలాడుతుంది. మానవునకు చెందిన దుర్గుణములు కోపము, తాపము, అసూయ యిలాంటి దుర్గుణములు దూరము గావించుకోవాలి. అందరు కూడను ఒక దైవము బిడ్డలుగా భావించాలి. నీవు పరాయి వాడవు కాదు. నీవేదో ప్రకృతినుండి ఉద్భవించినవాడవుకాదు. ఈ పంచభూత స్వరూపుడవు కాదు. 'మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః' అన్నారు. అందరూ దైవము యొక్క అంశములే. దైవాంశములైన మీయందు దైవభావములే ఆవిర్భవించాలిగాని దుష్టభావములు ఆవిర్భవించరాదు. సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు కారణమే. ఈశ్వరేచ్ఛనుండి వచ్చిన యీ ప్రకృతి నుండి ఈశ్వరభావములే పుట్టాలి. ఈ సత్యాన్ని మీరు ప్రతిక్షణము జ్ఞప్తికి తెచ్చుకుంటే తప్పక మీయందు దుర్భావములుగానీ, దురుద్దేశ్యములుగాని రావటానికి అవకాశమే లేదు. నేను దైవాంశము, నేను దైవాంశము అనే సత్యాన్ని మీరు మరువక స్మరించాలి. ఇట్టి విశ్వాసము చేత మీరు సమాజములో ప్రవేశించి ప్రేమతో అభివృద్ధి గావించాలి. ఇది యే ప్రభుత్వముగాని యింకమరి యేసంస్థలుగాని యీ విధముగా ఆచరించటానికి యేమాత్రము అవకాశము లేదు. విజయాన్ని సాధించాలంటే ఒక్క సత్యసాయి సంస్థలు మాత్రమే సాధించాలి. తప్పక సాధించగలరు. దేశము యొక్క శాంతిని మీరు పొందగలరు. స్వల్ప కాలమునందే విశ్వము యొక్క శాంతిని మీరు ఆనందముగా అనుభవిస్తారు.
ఐతే హృదయాన్ని ఒకవిధమైన స్థిరత్వంగా మీరు మార్చుకోవాలి. అప్పుడే మీరు లక్ష్యాన్ని తప్పక సాధించగలరు. ప్రేమస్వరూపులారా! ఈ యిరవై ఐదు సంవత్సరములనుండి సేవాసంస్థలు సలుపుచున్న సేవలలో విజయాన్ని సాధించి ఏదో మధ్యమధ్య కష్టములు, దుఃఖములు విచారములు సంభవించవచ్చు. అనేక గుణములు ఏర్పడవచ్చు. ఇది ప్రకృతి స్వభావము. వీటినంతా మనము లెక్క చేయనక్కర లేదు. గడచిపోయినది గడచిపోయినది. ఏ విధమైన శ్రమ పడినా అది మనకు రాదు. భవిష్యత్తు మన చేతిలో లేదు. దాని నిమిత్తమై నీవు విచారించనక్కర లేదు. వర్తమానాన్ని దృష్టిలో వుంచుకోండి. దానిని సరియైన రీతిగా తృప్తికరంగా మీరు ఆచరించండి. అప్పుడు future, past రెండు వర్తమానములో లీనమవుతాయి. కనుక మీరు గడచిన దోషములుగాని, గడచిన కష్టములుగాని విచారించక ప్రస్తుతము మీరు చేయవలసిన సేవల లోపల హృదయ తృప్తిగా పవిత్రమైన భావములతో పాల్గొనాలి. జీవుని యొక్క ఆనందమే దేవుని యొక్క ఆనందము. జీవుడు లేకపోతే దేవుడే లేడు. దేవుడు లేకపోతే జీవుడే లేడు. జీవుడు దేవుడు అవినాభావ సంబంధముతో కూడినవి. అన్యోన్యాశ్రయము. కనుక దేవుడు మీకెంత ప్రధానమని ఆశిస్తున్నారో దేవుడుకీ కూడను మీరు అంత ప్రధానమే. కనుక యీ రెండింటి యొక్క సమత్వాన్ని గుర్తించి వర్తించాలి. ఏ కర్మలు ఆచరించినా భగవన్నామస్మరణ చేస్తూ ఆచరించండి. అనవసరమైన విషయములలో మీరు ప్రవేశించకండి. ఇతరుల యొక్క మంచి చెడ్డలు ఏమాత్రము స్మరించకండి. మీలో వున్న దుర్గుణమును చెడ్డను దూరం చేసుకోండి. మంచిని పెంచుకోండి. పెంచుకొన్న మంచిని పదిమందికి పంచండి.