The day that wrought the great change 20 October 1990, the twentieth of October, the day that brought the complete change at Uravakonda fifty years before, kept by devotees from Andhra, Prasanthi Nilayam
కాలము బట్టి సర్వమును కల్గుచునుండును రాకపోకలున్ కాలము బట్టి వచ్చుమరి కల్మికి లేమికి రాకపోకలున్ కాలమె సర్వజీవులకు కారణమున్నిటి కంటె చూచినన్ కాలము లొంగ జేయనిదొకండును లేదు ధాత్రిలోన్. లోకమందు పెక్కు భీకర కృత్యముల్ కలుగు కారణంబు అరయ వలయు స్వార్థరహిత సేవ సన్నగిల్లుట చేత అర్థరహిత వాంఛలధికమయ్యె. ప్రేమస్వరూపులారా! కాలము అనంతమైనది. ఇది అప్రమాణమైనట్టిది. అగోచరమైనది. కాలము ఎవ్వరికిని లొంగదు. సర్వము కాలము ననుసరించ వలసినదే గాని కాలమెవ్వరిని అనుసరించదు. కాలము భగవత్స్వరూపము. కనుకనే కాలస్వరూపాయ అని భగవంతునకొక పేరు. ఈ కాలమే ఆత్మస్వరూపము. ఆత్మ కాలమునకు ప్రధానమైన స్థానము. కనుక భగవంతునకు కాలాత్మకాయ అని మరొక పేరు. చరాచరప్రపంచమంతయు భగవంతుని యందే యిమిడి వుండటం చేత భగవంతునకు కాలగర్భాయ అని మరొక పేరు. కనుక మానవత్వమునకు కాలము చాలా ప్రధానము. కాలము సద్వినియోగపరచి, కాలము సరియైన రీతిలో అనుభవించి కాయమును సార్థకము గావించుకునే కర్మనాచరించమని కాయము యొక్క ఉద్దేశ్యము. భగవంతునకు సంవత్సరాయనమః అని మరొక పేరు. సంవత్సరమనగా భక్తుని యొక్క స్థితిగతులను పురస్కరించుకొని వారికి శాంతిసుఖములందించే వాడని మరొక అర్థము.. ధీరత్వాయనమః అని మరొక పేరు. అనగా దేని యందు కూడను ఎట్టి బలహీనతలు లేక సంకల్పసిద్ధి చేత సర్వము సార్థకము గావించేటి సమర్థుడు అని దీని అర్థము. 'మేధాయనమః' అనగా లోక సంబంధమైన తెలివితేటలు గాని లేక మనస్సు యొక్క తత్వమునుగాని గుర్తించేటువంటి వాడు కాదు. తనకున్న తెలివితేటలను బుద్ధికుశలతను పదిమంది పైన మరల్చి అటువైపున పరితపించే క్రియకు ఎవరు పాల్గొందురో అట్టివారిని కాపాడువాడు 'మేధాయనమః' అని. కృతత్రేతా, ద్వాపర, కలియుగములకు ఆదియైన వాడు కనుకనే భగవంతునకు 'ఉగాది' అని కేవలము యుగములకు మాత్రమే ఆదియైన వాడు కాదు.
యుగములకు అంత్యమైనవాడు కూడను భగవంతుడే. కనుకనే యుగాది కృత్ అని మరొక పేరు వచ్చింది అతనికి. ఈ విధముగా నిత్యజీవితములో భగవంతుని నామము లేని నామి మనకు కనుపించదు! 'సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్' అన్ని దేహములు, అన్ని శిరస్సులు, అన్ని నేత్రములు, అన్ని పాదములు కూడను భగవంతుని యొక్క ప్రతిబింబములు. ప్రతి ప్రాణి భగవంతుని యొక్క ప్రతిబింబమే. ఇలాంటి స్థితి యందు దైవమునకు ఒక పుట్టుక రావటం పోవటం అనే యీ రాకపోకం తత్వమే దివ్యత్వము. ఈ కాయములను కాలము చేత కర్మం చేత సార్థకము గావించుకునే నిమిత్తమై ఆవిర్భవించినది. కనుక కాలాయనమః, కాలకాలాయనమః, కాలదర్పదమనాయనమః' కాలాతీతాయనమః' కాలస్వరూపాయనమః' కాలనిర్ణీతాయనమః అని సర్వము కాలమునకంకితము గావించుకున్న స్థితి దివ్యత్వము. ఇతను ఎట్టి ప్రమాణములకు వశము కానటువంటి వాడు. ప్రత్యక్షప్రమాణము, అనుమానప్రమాణము, శబ్దప్రమాణము అని మూడు విధములైన ప్రమాణములు. ఇవి కేవలము ప్రాకృతమైన జీవితమునకు మాత్రమే ప్రమాణములు గాని భగవంతుడు యిట్టి ప్రమాణములకు అతీతమైన వాడు కనుకనే అతనికి 'అప్రమేయుడు' అని మరొక పేరు. అట్టి అప్రమేయుడైన భగవంతుని త్యాగరాజు 'హృదయవాసి' అనే పేరుతో క్షీరసాగరశయనుడు అనే పేరుతో కీర్తించుతూ వచ్చాడు. 'చింతలు పెట్టవలెనా రామా! క్షీరసాగర శయనా నను' క్షీరసాగరశయనుడై సర్వులకు గోచరించు స్థానము నలంకరించిన నీవు నన్ను యిట్లా చింతలు పెట్టవలెనా? అని ప్రశ్నించుతూ వచ్చాడు రాముని. పశ్యతీతి పశుః బహిర్దృష్టి కలిగినవాడు మానవుడు. అంతర్దృష్టి కలిగినవాడు దైవము. కనుక మానవుడు అంతర్దృష్టిని అలవరచుకున్నప్పుడే దివ్యత్వాన్ని పొందగలడు. క్షీరసాగరముగా వుండవలసిన మానవుని యొక్క హృదయము అనేక విధమంతైన సమస్యలతో రాగద్వేషముల చేత కేవలము కల్మషమైన హృదయముగా రూపొందుతున్నది. మానవుడు క్షీరసాగరమైన హృదయాన్ని పవిత్రమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైన పరిశుద్ధమైన హృదయంగా తీర్చుకున్నప్పుడే అక్కడ శేషశాయిగా స్థిరనివాసుడై వుంటాడు. పాలయొక్క వర్ణము శుద్ధ తెలుపు. ఈ శుద్ధమైన తెలుపు సాత్వికమునకు చిహ్నము. హృదయము యొక్క మానసిక తత్వమే క్షీరసాగరం. క్షీరసాగరంగా మారిన హృదయమందే భగవంతుడు నివసిస్తూ వుంటాడు. రాగద్వేషములనే తిమింగలములు యిందులో ప్రవేశించినప్పుడు యీ హృదయమనే సాగరము మాలిన్యమవుతుంది. ఈ క్షీరసాగరము మలిన పరచుకో…ం చేత 'క్షారసాగరంగా' మారిపోతుంది. మానవ జీవితము యీ సాగరమునుండి ఆవిర్భవించినదే. విశాలమైన సాగరమందు అసంఖ్యాకమైన అలలు ఆవిర్భవిస్తూ వుంటాయి. ఒక అలవలె మరొక అల కనుపించదు. ఒకదానికొక… బేధముగా కనుపిస్తూ వుంటుంది. కాని ఒక్కొక్క అల భిన్న భిన్నముగా కనుపించినప్పటికిని అన్ని అలలకు ఆధారస్థానము సముద్రమే. అన్ని అలలందు వున్నది సముద్రజలమే. అదే విధముగనే సచ్చిదానంద సాగరము నందు సచ్చిదానందమయమైన దివ్యత్వము మానవత్వముగా, భిన్నభిన్నమంగా, అంశ అంశముగా కూడను అవతరిస్తూ వచ్చింది.
రూపనామములు వేరువేరుగా కనుపించినప్పటికి యీ అన్నింటికి ఆదియై మూలమై ఆధారమై వున్న తత్వము సచ్చిదానందమే. ప్రతి మానవుడు కూడను సచ్చిదానంద స్వరూపుడే. కాని రాగద్వేషములను గురికావటం చేత యీ సత్ చిత్ ఆనందమనేది మనము విస్మరించి భౌతికమైన, ప్రాకృతమైన వాంఛలకు లోబడి మన దివ్యమైన స్వస్వరూపాన్ని విస్మరిస్తున్నాము. ప్రతి మానవుని యందు స్థూల సూక్ష్మ, కారణ రూపములనేవి అంతర్భూతమై వుంటున్నవి. ఈ మూడింటి యొక్క స్వరూపము ప్రతి మానవుని యందు సాక్షాత్కరిస్తున్నది. ఈ త్రిమూర్తుల యొక్క స్వరూపమే త్రిగుణములుగా మారుతూ వచ్చాయి. ఈ మూడింటి యొక్క ఏకత్వము మనము బలపరచి దివ్యత్వమునకు అర్పితము గావించినప్పుడే అనేకత్వములోని ఏకత్వము గోచరిస్తుంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. ఈ మూడింటి ఏకత్వము చేత దైవత్వమునకు అర్పితము గావించటమే యీ బిల్వము యొక్క అర్పితము. తెలుగుదేశములో చింతగుల్ల అంటారు. చింతకాయ వేదాంతము బోధిస్తూ వచ్చింది. ఈ చింతపండు లోపల గింజలో కాయస్వరూపముగా మారును. చింతగుల్ల, చింతపండు, చింత విత్తనము యీ మూడింటి స్వరూపమే స్థూల సూక్ష్మ కారణ స్వరూపము. ఇదే unity in diversity. అనేకత్వములో వుండిన ఏకత్వమే యిది. పండు లేక విత్తనము కాదు. కనుకనే స్థూలదేహము చింతగుల్ల వంటిది. 'అనిత్యం అసుఖం లోకం' ఈ దేహము కేవలము నీటి బుడగ వంటిది. ఇలాంటి దేహము స్థూల రూపకంగా అన్నమయమైన రూపాన్ని ధరిస్తూ వచ్చింది. ఇది. మలినపు కొంప రోగముల మ్రుగ్గడు సేవక గంప జాతసం చలనము పొందు దుంప భవసాగర మదగ లేని కంప అం బులపారివెమ్ము చూడ మనమెప్పు దలంపగ దేహమింక ని త్యలమని నమ్మబోకు మనసా హరిపాదము లాశ్రయింపవే. …క హరితత్వాన్ని గుర్తించే నిమిత్తమై యీ యొక్క అస్థిరమైన దేహము ధరించారు. ఈ దేహమును నడిపించి కదిపించి, వినిపించి, అనిపించి, మరపించి తన్మయత్వము గావించేది మనస్ తత్వము. కన్నులు చూస్తున్నాయని మనం భావిస్తాం. చెవులు వింటున్నాయని మనం విశ్వసిస్తాము. నోరే మాట్లాడుతుందని మనం అను…ంటున్నాం. కనుపించేది కన్నులైతే, వినిపించేది చెవులైతే, పలికేది నోరైతే మరణించిన తరువాత అవే కన్నులు, అవే చెవులు, అదే నోరు వుంటున్నవి. ఎందుకని కనుపించటంలేదు? ఎందుకు వినిపించటంలేదు ఎందుకు కనుపించటం లేదు?
కాదు. కాదు. కనుపించి, వినుపించి, అనిపించి, మైమరపించే శక్తి అంతర్హితమై అన్నింటికిని ప్రాణము యిచ్చి ప్రోత్సహించి నడిపించేది ఆత్మతత్వము. ఇవన్నియు కేవలము పనిముట్లు. వీనికే కరణములని పేరు. కరణములనగా పనిముట్లు. చేతిలో ఒక కత్తిని పట్టుకున్నప్పుడు కత్తి కోస్తున్నదా? తన స్వశక్తితో ఫలమును కోస్తున్నాడా. కత్తి నిమిత్తమాత్రముగా పట్టుకొని వ్యక్తి ఆ ఫలమును కోస్తున్నాడు. కనుకనే భగవద్గీత యందు కూడను 'నిమిత్తమాత్రం భవసవ్యసాచి:' నిన్ను నిమిత్త మాత్రంగా వుంచుకొని సర్వవిధమైన కర్మలు నేను ఆచరింపచేస్తున్నాను. అర్జునునకు పార్థివ అని మరొక పేరు. పార్థివ అనగా పృథ్వీపుత్రుడు. మీరందరు పృథ్వీపుత్రులే. పార్థులే. మిమ్మల్ని నిమిత్తమాత్రంగా నిల్పుకొని యిన్ని విధములైన కర్మలు ఆచరింపచేసే సాధనలు సల్పునట్లు చేస్తూ వుండేది కేవలము దివ్యశక్తియే. అది అందరియందు వుండిన శక్తి. కనుక ఇది జ్యోతి. ఇరువురు ప్రొఫసర్లు చెప్పారు. ప్రేమజ్యోతి, సత్యజ్యోతి, ఆత్మజ్యోతి, అఖండజ్యోతి, అద్వైతజ్యోతి, ఆనందజ్యోతి. జ్యోతికి మించిన వస్తువు యీ ప్రాకృతమైన జగమునందు కనుపించదు. జ్యోతికి వుండిన శక్తి మరొక పదార్థమునకు లేదు. జ్యోతికి అంధకారమును దూరము చేసే శక్తి వుంది. అంధకారము దూరము చేసే శక్తి మరియే వస్తువుకు లేదు. కనుకనే 'తమసోమా జ్యోతిర్గమయ' అని. ఈ జ్యోతికి యీ ఒక్క శక్తి మాత్రమే కాదు రెండవది కూడా వుంటున్నది. జ్యోతి నిరంతరము ఊర్ధ్వస్థాయికి పోతుంటుంది. గుంతలో జ్యోతిని పెట్టినా వెలుతురు పైకి వస్తుందిగాని క్రిందికి పోదు. అంధకారము నిర్మూలము గావించటము, ఉన్నతస్థాయికి దూసుకొని పోవటం యీ జ్యోతి యొక్క ప్రధానమైన గుణములు. ఇటే జ్యోతిని నిరంతరము అఖండజ్యోతిగా వెలగవలెనంటే దీనికి ఆధారము ఒకటి వుండాలి. ఈ జ్యోతికి ప్రమిద అవసరము. ఇదికాక వత్తి ఒకటి వుంటుండాలి. ప్రమిదలో నూనె వుండాలి. ప్రమిద, వత్తి, నూనె వుండినంత మాత్రమున జ్యోతి వెలగదు. దానికి నిప్పు అవసరం. ప్రమిద నూనె వత్తి కలదు దీపము వెలుగునా స్వర్ణము రత్నములు గలవు సొమ్ములు నిర్మాణమగునా పూలు సూది దారము వుండి పుష్పమాల తానగునా! పూలు, దారము, సూది వుండి కాని కుట్టేవాడు ఒకరు వుండాలి కదా. స్వర్ణము, రత్నాలు వుండినప్పటికి సొమ్ములు చేసే కంసాలి ఒకడుండాలి. ప్రమిద, నూనె, వత్తి వుండినప్పటికి అంటించేవాడు ఒకడుండాలి. అతనే భగవంతుడు. అట్టి దైవమును ఆశ్రయించినప్పుడే మానవత్వము కూడను దివ్యత్వముగా మారిపోతుంది. ప్రేమస్వరూపులారా. మన యొక్క హృదయమే ప్రమిద. మన మనస్సే యిందులో వత్తి. మన భక్తియే యిందులో తైలము. వైరాగ్యమే దీనికి నిప్పుపెట్టె. ప్రేమయే యీ జ్యోతి యొక్క స్వరూపము. ఈ ప్రేమజ్యోతి లేనప్పుడు మానవుడు అజ్ఞానాంధకారములో మునిగిపోతాడు.
ప్రేమ ప్రతి ప్రాణికి కూడను ప్రధానమైనది. ఆనాడు గోపికలు ప్రేమజ్యోతిని వెలిగించమని కృష్ణుని ప్రార్థించారు ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశములో ప్రేమసుధావర్షము వర్షింపగ ప్రేమనదులు ప్రవహింపగ మురళీగానము సేయగదే కృష్ణా గానము సేయగదే. ప్రేమరహితమైన మా హృదయ భూమియందు ప్రేమ అనే వర్షము కురిపించి, ప్రేమ అనే బీజములు నాటి ప్రేమ ఫలములు పండించటానికి యీ ప్రేమ గుర్తించటానికి ప్రేమ మధురమైన మురళి వాయించమని కోరారు. ఈనాడు ప్రతి మానవుని యొక్క హృదయమందు కూడను ప్రేమ బీజములు నాటుకోవాలి. ప్రేమయే పరమార్థము. ద్వేషము యేమాత్రము యిందులో ప్రవేశిరు కూడదు. రాగద్వేషములకు అవకాశము అందించరాదు. అజ్ఞానములో మానవుడు వుండటం చేతనే మనకు రాగద్వేషములావిర్భవిస్తూ వుంటాయి. మానవుని యొక్క మంచి చెడ్డలు, మానవుని యొక్క ఉపకార అపకారములు, మానవుని యొక్క మిత్రులు, శత్రువులు మానవుడు చేసే కర్మలే. తాను చేసిన మంచి కర్మలే మిత్రుని వలె తనను వెంటాడి అన్ని విధముల కూడను సహాయపడతాయి. మనము నెరవేర్చిన చెడ్డకార్యములే మనలను బాధిస్తూ వుంటాయి. మనకు ఆనందము నిచ్చేవి దుఃఖము నిచ్చేవి మనము చేసే కర్మలే తప్ప వేరు కాదు. కనుక మనము మంచి కార్యములు చెయ్యాలి. ప్రేమ హృదయాన్ని మనం పెంచుకోవాలి. అప్పుడే మనము ప్రేమమయమైన జీవితాన్ని తెలుసుకోగలము. ప్రేపయే పరమాత్మస్వరూపము. ప్రేమ ఫలితమును ఆశించదు. ప్రేమ పరులకు భయపడదు. ప్రేమ నిమిత్తమై ప్రేమను పెంచుకోవాలి. ఇదే ప్రేమ యొక్క ప్రమాణము. కనుక ప్రేమజ్యోతి మనయందు వెలగాలంటే హృదయము ప్రమిదగాను మనస్సు వత్తిగాము, భక్తి తైలముగాను వుంచుకొని వైరాగ్యమనే జ్యోతిని మనము వెలిగించుకోవాలి. ప్రాకృతమైన జ్యోతులు బాహ్యమైన చీకటులను మాత్రమే పారద్రోలుతాయి. కాని యీ ప్రేమజ్యోతి, యీ అఖండజ్యోతి, యీ అద్వైతజ్యోతి అంతర్ముఖమైన ఆనందాన్ని ప్రకాశమును అభివృద్ధిపరుస్తుంది. భగవంతుని అష్టస్వరూపమైన నామములందు
శబ్దబ్రహ్మమయి చరాచరమయి జ్యోతిర్మయి వాఙ్మయి నిత్యానందమయి పరాత్పరమయి మాయామయి శ్రీమయి మూడవ స్థానములో వుంటున్నది జ్యోతిర్మయి. కనుక జ్యోతిర్మయ స్వరూపమైనది మానవ జీవితము. మానవుడు కేవలము అజ్ఞాని అనిగాని లేక మూర్ఖుడనిగాని లేక బలహీనుడనిగాని భావించరాదు. మానవుడు తలచుకుంటే 'శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ వుండినప్పుడు ఎంతటి కర్మమునైనా సాధించగలడు. ఈనాడు జ్యోతిని పుచ్చుకొని గ్రామగ్రామము వీధి వీధి వాడ వాడ ప్రచార ప్రబోధలు సల్పటమంటే యిది శ్రద్ధ వలన గలిగినదే గాని కేవలము ఒక విధమైన ఆడంబరము వలన జరిగినటువంటిది కాదు. ప్రతి మానవునకు శ్రద్ధ అవసరము. శ్రద్ధ కలిగినవారు ఏకార్యమునైనా సాధించగలరు. ఆధ్యాత్మిక మార్గమునందు అత్యంత శ్రద్ధ కలిగి వుండాలి. ప్రేమస్వరూపులారా! శ్రద్ధయే మనయింటా వెంటా జంటా కంటా వుంటుండి అన్నివిధాలా కాపాడేటువంటిది. శ్రద్ధ కలిగిన వానికి సాధించలేనిది జగత్తులో కానరాదు. ఈ శ్రద్ధకు యిచ్ఛాశక్తిని అభివృద్ధి పరచుకోవాలి. ఇచ్ఛాశక్తి వలన క్రియాశక్తి యీ యిచ్ఛా క్రియాశక్తి వలనే జ్ఞానశక్తి ఏర్పడుతుంది. ఈ మూడింటిని త్రికరణశుద్ధి అని వేదాంతము బోధిస్తూ వచ్చింది. మనసునందు భావము మాటయందు చెప్పి మాటయందున్న భావము క్రియయందు అనుభవించాలి. ప్రేమస్వరూపులారా! ప్రతిమానవుడు శాంతి శాంతి శాంతి కావాలని ఆశిస్తున్నాడు. శాంతి ఎక్కడా లేదు. ఈ అశాంతికి కారణము ఏమిటో మనము వెతకాలి. ఈ అశాంతికి కారణము మనము గుర్తించి దానిని పరిహారము గావించుకున్నప్పుడే శాంతి సహజముగానే ఆవిర్భవిస్తుంది. ఇంటిలో తల్లి, తండ్రి, కుమారుడు ముగ్గురు వుంటున్నారు. ఈ తల్లి తండ్రి కుమారుడు ప్రేమతో కాలాన్ని గడుపుతూ వుండినంత వరకు ఒకరినొకరు విశ్వసించి ఒకరినొకరు ప్రేమించుకుంటూ వుండినంత వరకు శాంతి యింటి యందు అభివృద్ధి అవుతుంది. ఈ తల్లి తండ్రి కుమారుడు యీ ముగ్గురు ఒకరికి ఒకరు యేమాత్రము కూడను సంబంధము లేకుండా ఒకరినొకరు అనుసరించకుండా ద్వేషముతో అసూయతో విరుద్ధమైన మార్గము అనుసరించునప్పుడు ఆయింటిలో వంటిలో అశాంతినే అనుభవించవలసి వస్తుంది. ఈ శాంతికి అశాంతికి కారణం ఏమిటి? కలయిక లేక ద్వేషము పెంచుకోటం చేతనే అశాంతి అభివృద్ధి అయింది. అది మన హృదయతత్వము. మాట యొక్క అర్థము క్రియ యొక్క ఆచరణ. ఇక్కడ మనస్సు మాట తల్లి తండ్రులు. క్రియయే కుమారుడు. ఈ ముగ్గురు ఏకమైనప్పుడు శాంతిని యేమాత్రము వెతుకోనక్కర లేదు. ఈనాడు శాంతి లేకుండా వుంటున్నాడంటే మనసు వేరు, మాట వేరు, క్రియ వేరుగా వుండటం చేతనే అశాంతికి గురై పోతున్నారు. ఈ మూడింటిని ఏకము గావించే వ్యక్తికి శాంతి వుంటుంది. ఈ అశాంతి కొకరు కారణమని మనము భావించరాదు. ఎవరు కూడను దీనికి కర్త కాదు.
నీ ప్రయత్నమే దీనికి కారణము 'మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం'. ఇదే నిజమైన శాంతి. ఈనాడు యీ మూడింటి ఏకత్వము లేకపోవటం చేతనే, భిన్నత్వంగా వుండటం చేతనే మానవుడు అశాంతికి గురైపోతున్నాడు. మన అశాంతికి వీరు కారణము, వారు కారణము, ఈ కర్మ కారణము అని భావిస్తున్నాము. ఇది కేవలము అల్పదృష్టి. నీ అశాంతికి నీవే కారణము. ఆ కారణమును గుర్తించి వర్తించినప్పుడే మనకు అశాంతి దూరమైపోతుంది. నిజమైన త్రికరణశుద్ధిని అభివృద్ధి గావించుకొని ప్రేమతత్వాన్ని పెంచుకున్నప్పుడు మనయొక్క జీవనజ్యోతి ప్రకాశంగా మనకు మనమే అనుభవించటం కాకుండా యితరులకు కూడను యీ ప్రకాశాన్ని అందించి వారికి కూడను అంధకార అజ్ఞానమును దూరముగావించినవారమవుతాము. నేను సాయిని తెలియుము నిక్కముగను మమత బాయుము యత్నముల్ మానుకొనుము బాహ్యసంబంధమిక కాదు నన్నుబట్ట ఎంతటి ఘనునికైన తప్పింప వీలుకాదు అని యీ పలుకులు పలికినప్పుడు తమ్మిరాజు కుటుంబము, హనుమంతరావు కుటుంబము, భోజరాజు కుటుంబము, శేషమరాజు కుటుంబము వీరందరు కూడను అనేక విధములుగా అడ్డుపడి వెళ్ళకూడదు అన్నారు. ఇది ఉరవకొండలో జరిగింది. జీవప్రజ్ఞతో బాటు దైవప్రజ్ఞ దైవప్రజ్ఞతో బాటు జీవప్రజ్ఞ అని యీ దేహమునకు కొన్ని సంబంధములు దూరము కావాలనుకున్నప్పుడు ఆదర్శముగా వైరాగ్యమును నిరూపించాలి. ఉరవకొండలో వుండగా మునిసిపల్ ఛైర్మెన్ రామరాజు వచ్చి స్వామిని చూచాడు. అప్పుడు రాజు రాజా అని పిలచేవారు. చూచి శేషమరాజును ప్రార్థించాడు. ఆ పిల్లవానిని హాలిడేస్ లో మాయింటిలో పెట్టుకుంటాము బళ్ళారి తీసుకు వెడతాము అన్నారు. 'శేషమరాజూ! ఈ బాలుని సామాన్యమైన సోదరునిగా భావిస్తున్నావు. ఇతని ముఖవర్చస్సు, యితని యొక్క పవిత్రత నా హృదయాన్ని కరగించింది. కదలించింది. ఇతనిలో యేదో దివ్యశక్తి ఒక దివ్యతేజస్సు వుంది. నీవు మోసపోతున్నావు. నీవు కూడా అబ్బాయితో వచ్చి మా యింటిలో వుండమన్నాడు. అక్కడ నుండి యీ మునిసిపల్ ఛైర్మన్ హంపికి తీసుకువెళ్ళాడు. ఇది కేవలము అతిశయోక్తి గాని, అహంకారముగాని మరొక విధమైన వర్ణనగాని అని భావించరాదు. అందరూ విరూపాక్ష దేవాలయములో ప్రవేశించారు. నేను రానని చెప్తే వత్తిడి చేయవచ్చు. కోపము పడవచ్చు. నా కడుపులో బాగలేదు నేను లోపలకు రానన్నాను. ఈ అందరూ తమ్మిరాజుతో గూడ 50,60మంది దేవాలయములో ప్రవేశించారు. కాని యీ రామరాజుకు స్వామి చింతన తప్ప అన్య చింతన లేదు. అతను చాలా వినయంగా కోరుతూ వచ్చాడు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. Please Please రాజా తప్పక రావాలి రావాలి అని చేతులు పట్టుకొని బాధపడ్డాడు. కాని నా యొక్క గట్టితనాన్ని బట్టి నన్ను ఎక్కువ తొందర పెట్టలేక పోయాడు. ఆ విరూపాక్షుని గుడిలో హారతి యిస్తున్నారు.
అక్కడ విరూపాక్షుడు లేడు. యీ రాజు వున్నాడు. శేషమరాజుకు కోపం వచ్చింది. నేను రానని చెప్పి ఎప్పుడో వెనక్కిపోయి లోపల నుంచున్నాడు ఎంత పొరపాటు. ఎంత తప్పు. చాలా కోపం వచ్చింది. కాని రామరాజు ఆవిధంగా భావించలేదు. విరూపాక్షుడే రాజు రాజే విరూపాక్షుడు అనుకున్నాడు. తక్షణం శేషమరాజు బయటకు వచ్చాడు చూచాడు. నేను అక్కడే చెట్టుక్రింద కూర్చున్నాను. ఆయనకు అనుమానం ఎక్కువ. మరి యింకొకరిని పంపించాడు అక్కడ కనుపిస్తున్నాడా లేడా అని. నేను యిక్కడ చూస్తూ వుంటాను లోనికి రాకుండా అని యిన్ని విధాల పరీక్షలు ప్రారంభించారు. రాజు అక్కడా వున్నాడు యిక్కడా వున్నాడు. చాలా ఆనందించారు. నా దగ్గర చెబితే బాగుండదనుకొని వారు కేవలం మనసు యొక్క ఆర్తి ఆవిధంగా కనుపించిందనుకున్నారు. అక్కడనుండి నేరుగా బళ్ళారి తీసుకొని వచ్చారు. కొన్నిదినములక్కడ వుండిన తరువాత ఆ మునిసిపల్ ఆఫీసర్సు అందరు రావటం వారినందరిని స్వామికి పరిచయం చేయటము (స్వామి అనే పేరు లేదు రాజు రాజు అని) యీ చిన్న పిల్లవానికి యీ మునిసిపల్ ఛైర్మన్ యింత గౌరవము యిస్తున్నారని కొంత మంది హాస్యాస్పదము చేశారు. నాకు అక్కడనుండి యీ వచ్చేదానికి ముందుగా మునిసిపల్ ఛైర్మన్ ఒక చిన్న నిక్కరు షర్టు కుట్టించాడు. ఇప్పుడే యింత ఎత్తు వున్నాను అప్పుడింకా... ఆనాడు అనగా 50 సంవత్సరముల పూర్వము యువకులందరికి ఒక ఫ్యాషన్ వుండేది. కాలర్ కు ఒక పిన్ను వేసుకునేవారు. అది కాలర్ పిన్. ఆనాడు కాలర్ పిన్ వేసుకుంటే అది ఒక పెద్ద స్థానమని, మంచి ఉన్నతమైన స్థితిలో వుండినవారని భావించేవారు. నాకు యింక యేమి యివ్వటానికి తోచలేదు. ఒక్క గంటలోనే కంసాలి దగ్గరకు పోయి గోల్డు కాలర్ పిన్ చేయించుకు వచ్చి నా కాలర్ కు తగిలించాడు. రాజా! యీ పిన్నును చూచినప్పుడంతా నేను జ్ఞాపకము రావాలి ఆ చేతులు తట్టుకొని ప్రార్థించాడు. సరే వచ్చాము. ఉరవకొండలో బస్సుదిగాము రెండవ దినమే స్కూలు ప్రారంభము. ఇంక స్కూలుకు వెడుతున్నాను. మధ్యలో యీ కాలర్ పిన్ను కింద పడిపోయింది. అప్పుడు నేనొక పాటపాడినాను. ఈ కాలర్ పిన్ పోయిన తక్షణమే బంధన వీడింది అన్నాను. అక్టోబరు యిరవయ్యి తేదీ హంపినుండి స్కూలు కరుగుచు బాబా కాలరు పిన్నొకటి జారికనబడలేదు మార్పుకలిగి వున్నాడు ప్రాపంచిక సంబంధము క్రింద ఇతనికెందుకు క్షేత్రదర్శనము అదికూడా చెల్లెను హద్దు మాయ తొలగెను ఆదినమే గృహము వీడెను
మార్పు రావటానికి యీ కాలర్ పిన్ను పోయింది. ఇదే మార్పు. ఆనాడే గృహాన్ని విడచిపెట్టాను. ఇదొక మాయ అనగా ప్రాపంచిక సంబంధమైన వస్తువే ఒక మాయ. ఈ వస్తువులు ఏనాడు మనలను వీడి పోతాయో అదే మాయ తప్పటం. ఆనాడే వెళ్ళి అంజనేయులు యొక్క గృహములోపల ఒక పెద్ద గుండు వుండేది. ఆ గుండు పైన కూర్చున్నాను. అతను ఎక్సైజు కమీషనరుగా వుండేవాడు. ఆయన కూడను స్వామిని చూస్తే యేదో అరచి తెలియనటువంటి ఆధ్యాత్మిక భావము వుట్టిపడేది. దోవలో వుంది అతని యిల్లు. అతను పకోడీలు యేవో చేసి లోపల పెట్టుకొని వుండేటువంటివాడు, ఆయన, ఆయన భార్య కాచుకొని వుండేవారు పాపం. పిల్లలుంటే యేమైనా అనుకుంటారేమోనని వారిని లోపలకు పంపించేవారు. నేను చిన్నగా లోపలికి ప్రవేశించేటప్పటికి కాళ్లను పట్టుకొని నమస్కారం చేసేవారు. సార్ మీరు పెద్దవారు యీ విధముగా చేయకూడదు నేను ఎంతో చెప్పేవాడిని. రాజా! ఈ దేహములో నేను పెద్దవాడిగా వుంటున్నాను. కాని జ్ఞానములో చాలా అల్పుడుగా వుంటున్నాను. నువ్వు సాక్షాత్తూ కృష్ణుడవే. యీవిధముగా వారు వర్ణించేవారు. అందరు ఎదురుగా వర్ణిస్తే ఎద్రైనా హాస్యాస్పదము చేస్తారేమోనని వంటరిగా పిల్చి చెప్పేవారు. ఈ విధముగా అనేక విషయాలు యీ అక్టోబరులో జరిగాయి. ఆనాడు ఎక్కడను పోలేదు. స్కూలుకు పోలేదు. స్కూలులో ప్రతిదినము ప్రార్థన చేసేవాడిని. steps పెట్టి ఒక వేదిక మాదిరి వుండేది. అనగా అప్పుడే సర్వమత సమన్వయాన్ని ఏమిటి? యీ పిల్లవాడు సర్వమత సమన్వయాన్ని బోధిస్తూ వున్నాడే. అని టీచర్సుకు విసుగు పుట్టేది పాపం. ఆనాడు స్కూలుకు పోకుండా వుండటం చేత ఎక్కడ రాజా ఎక్కడ రాజా అని ఒక పెద్ద విచారం ప్రారంభమైంది. పిల్లలు ఎవరూ ప్రార్థనలో లేరు. అందరు అంజనేయులు యొక్క గృహానికి పరుగెత్తి వచ్చారు. ఎవరిని నేను చూడలేదు. నేను వూరకే కూర్చున్నాను. ఒక గుండుపైన. హంపి నుండి వచ్చినప్పటినుండి మతిభ్రమణం కలిగింది. ఇంట్లో యేమైనా జరిగిందో ఏమిటో అని పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా వూహిస్తూ వచ్చారు. నా ఫొటో ఒకటి తీసుకోండి అని చెప్పాను. ఫొటో తీసుకుంటే నా ముందు షిరిడీ బాబా. ఆనాడు సాయిబాబా అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ గుంపులో కూడను అంజనేయులే నుంచున్నాడు. ఆయనే మన జిల్లా కంతా కూడను సత్యసాయి ఆర్గనైజేషన్ ఛైర్మన్. ఆ ఫొటో అతనికి కూడా తెలుసు. ప్రార్థన చేసి స్కూలు ప్రారంభించమని చెప్పాను. ఈలోపులనే శేషమరాజు పుట్టపర్తి టెలిగ్రాము యిచ్చేశాడు.
అక్కడికి వీరందరు పరుగెత్తి వచ్చారు. ఇంక అక్కడ వుండకూడదు పుట్టపర్తి పోవాలని అనుకున్నారు. అప్పుడు బస్సులు లేవు బుక్కపట్నం. పెనుకొండ వరకు మాత్రమే బస్సు. అక్కడనుండి ఎద్దుబండిలో రావాలి. ఇటువంటి పరిస్థితి ఆనాడు. ఈ పిల్లలంతా మేము కూడా రాజుతో వస్తామని బయలుదేరారు. అక్కడ చాలా విచారకర విషయము జరిగింది. ముగ్గురు పిల్లలు ఒకే డస్కులో కూర్చునే వారు ఒక పిల్లవాడు శిరస్తదారు కుమారుడు. యింకొక అబ్బాయి రెవిన్యూ యిన్స్పెక్టరు కొడుకు. వారు కొంతవరకు శ్రమించాలి. నేను మధ్యలో కూర్చునే వాడిని. ఒకరు యిటువైపు ఒకరు అటువైపు కూర్చునేవారు. ఈ పిల్లలకు ఆవిధమైన దర్శన స్పర్శన సంభాషణల చేత వారి హృదయాలు మారిపోయాయి. బాహ్యసంబంధం దినదినానికి అభివృద్ధి చెందింది. ఏనాడు ఆ స్కూలు వదిలానో ఆ పిల్లలిద్దరికి మతిభ్రమణ జరిగినట్లుగా రాజు రాజు అని ఆందోళన అభివృద్ధి అయింది. బస్సు ఎక్కాను. అదృశ్యము చూచాడు. వెళ్లి బావిలో పడిపోయాడు రాజును విడచి నేనుండలేనని చనిపోయాడు. రెండవ పిల్లవాడు రాజా రాజా అంటూ భోజనము చేయలేదు నీరు లేదు ఆహారము లేక పూర్తి స్తంభించి పోయాడు. ఈ రకమైన ఉన్నతత ఆధ్యాత్మికము యొక్క తత్వము. కాని చాలా మంది ఉన్నతత అంటే బాహ్యమైన జగద్భ్రాంతిని విస్మరించటమని భావిస్తూ వుంటారు. ఈ విధముగా యిరువురు పిల్లలు పోవటం చేతనే ఆనాడు స్కూలు మూసివేశారు. ఆ డస్కు సత్యసాయి బాబా డస్కు అని పెట్టారు. లక్ష్మీపతి గారని హెడ్మాష్టరు వుండేవాడు. ఆ లక్ష్మీపతి కూడను నేను స్కూలుకు వచ్చిన తక్షణమే ఆఫీసుకు రమ్మనేది. అది అందరికి లభించదు జన్మాంతర ప్రాప్తి వలన ఆవిధమైన భావాలు వస్తాయి. లోపలకు వెళ్ళిన తక్షణమే తలుపులు వేసేవాడు. నన్ను తన కుర్చీపైన కూర్చోమని చెప్పేవాడు. తాను క్రింద కూర్చొని పాదాలు వత్తేవాడు. సార్ యీ విధంగా చేయకూడదు మీరు అని చెప్పేవాడిని అమాయకుడిలా. ఆ లక్ష్మీపతి చెప్పేవాడు. నేను తెలీదు. నాకు తెలుసు నేదివ్యత్వము. ఈ విధముగా ఆనాడు ఉరవకొండలోపల యీ అనుభవములన్ని వున్నాయి. ఈ అక్టోబరు 20వ తేదీ ఉరవకొండలో పూర్తిగా మార్పు తెచ్చిన దినము. ఆనాడు విద్యార్థులందరిలో గొప్పమార్పు కలిగినది. వారి యొక్క ఆప్యాయత, వారి యొక్క ప్రేమతత్వము నా యందు ఎంతవరకు పెరిగిందంటే ఒక చిన్న ఉదాహరణము. రెండవదినము కొత్తవాడు ప్రార్థన చేయటానికి వేదిక ఎక్కాడు. ప్రార్థన చేయటానికి ప్రారంభించాడు. గట్టిగా ఏడ్చేశాడు. ఆ పిల్లవానికి స్వామి జ్ఞాపకం వచ్చాడు. ఈ పిల్లవాడు ఏడ్చేటప్పటికి అందరూ ఏడ్చేశారు. ప్రార్థన అంతా ఏడ్పుగా మారిపోయింది. అప్పుడు హెడ్మాష్టరు చెప్పాడు 'లోపలికి పొండి. అతని నిమిత్తమై మనము ఏడ్చిన ఏడుపే మన prayer. ఆనాటితో ఆ రూమకు తాళం వేసి ఒక పెద్ద Showroom గా తయారు చేశారు.
ఆనాటి మానవత్వము యింత అమాయకముగా వుండినప్పటికిని ఆనాడు విద్యార్థులు కేవలము పవిత్రమైన హృదయాలతో వుండేవారు. ఈనాటి విద్యార్థులవలె విమర్శలుగాని యింకే విధమైన కొన్ని క్రియలుగాని, ఆలోచనలుగాని, పరిశీలనలుగాని, పరిశోధనలుగాని యేమాత్రము ప్రారంభించలేదు. ఈనాటి విద్యార్థులకు తెలివితేటలు పెరుగుతూ వస్తున్నాయిగాని గుణము తరుగుతూ వస్తున్నది. ఈ తెలివితేటలు తక్కువ ఆరోజులలో. ఆదినాన్నే యీనాడు ఆంధ్రదేశము వారీవిధముగా ప్రశాంతి నిలయమునకు వచ్చి ఒక జ్ఞాపకార్థముగా పవిత్రముగా జరుపుకుంటున్నారు. ప్రేమస్వరూపులారా ఇది ఒక గర్వకారణంగా మీరు భావించుకోండి. ఇది సత్యదృష్టితో మీరు విశ్వసించాలి. 50 సంవత్సరముల లోపల యీ ప్రశాంతి నిలయములో సాధించిన ఘనత 500 సంవత్సరములైనప్పటికిని జరిగేది కాదు. 50 సంవత్సరముల లోపల యీ విధమైన ఘనమైన మార్పులు ఎక్కడ కూడను జరగలేదు. ఈ ఒక్క చేతి మీదుగా జరుగుతూ వచ్చాయి. ఒక పెద్ద యూనివర్శిటీ ప్రారంభించాము. నక్షత్రశాలను తెప్పించాము. ఈ చిన్న గ్రామములో air Field వచ్చింది. యావత్ప్రపంచమునకు ప్రశాంతినిలయం తెలిసింది. అన్ని దేశములవారు ప్రశాంతినిలయములో ప్రవేశిస్తున్నారు. ప్రశాంతి నిలయమనేది ఒక మినీ వరల్డు. ఇంకా ముందు ముందు మీరు చూస్తారు. నవంబరు 23వ తేదీకి అన్నిదేశములవారు యిక్కడకు వస్తున్నారు. పిలుస్తే వచ్చే స్వభావమా మనుష్యులది. ఎవ్వరికీ యే ప్రచారముగాని ఏ invitations గాని పంపటం లేదు. వచ్చేటువంటి వారిని వద్దు వద్దు అని చెబుతున్నారు. ఈ విధమైన ఆకర్షణ ఒక్కదైవానికి తప్ప అన్యులకు లేదు. పుష్పము యొక్క సుగంధము సర్వత్ర వ్యాపించుతుంది. పుష్పము తుమ్మెదను పిలుస్తుందా? తుమ్మెదే పరుగెత్తి వచ్చి యీ పుష్పములో ప్రవేశిస్తున్నాయి. ఈ పుష్పములో మధురమైన మకరందము వుండటం చేత తుమ్మెదలు వచ్చి వాలుతున్నాయిగాని లేకపోతే ప్రార్థించినా వాలుతాయా? ఎక్కడి అర్జంటైనా. ప్రపంచమునకు కట్టకడపటి స్థానములో వున్నది అర్జంటైనా. ఈ అర్జంటైనా లో యింటింటి లోపల భజనలు: 'మాయమా' అని వుంటున్నది. అక్కడ మిలట్రీ ఆఫీసర్సు అందరు నగరసంకీర్తన చేస్తున్నారు. పోయిన ఆరునెలలక్రితము ఆఫీసర్సు అంతా ఒక ప్రతిజ్ఞ పట్టారు. చాలామంది పేపర్లో కూడా చూచి వుంటారు. గవర్నమెంటు పోవాలి. సత్యసాయి గవర్నమెంటు రావాలని వారి ప్రతిజ్ఞ. మిలట్రీ ఆఫీసర్సుకు పిచ్చి పట్టిందని తీసుకువెళ్లి మెంటల్ హాస్పిటలులో చేర్చారు. మిలట్రీ ఆఫీసర్సు ఆసుపత్రిలో చేరి అక్కడ వున్న నర్సులను, పేషంట్లను భక్తులుగా మార్చివేశారు. ఇది అంత సులభముగా జరిగేటువంటిది కాదు. హృదయమునుండి ఆవిర్భవించాలి. ప్రేమస్వరూపులారా! ఈ జ్యోతి యింటింటికి తీసుకువెళ్ళి ఉత్సవములు జరుపుతున్నారంటే ఇది కేవలము బయటనుండి వచ్చేది కాదు లోపలనుండి వూరేది.
ఈ బహిర్ముఖమైన జ్యోతుల కంటె అంతర్ముఖమైన జీవన జ్యోతిని పరిశుద్ధ పరచుకొని కాంతివంతమైన జ్యోతిగా వెలిగించుకోవాలి. సత్యసాయి సంస్థలన్నీ ప్రేమమయమైన సంస్థలుగా మారాలి. వ్యక్తిగతమైన ద్వేషములు మనము నిర్మూలము గావించాలి. జాతి మత కుల బేధములను మనము దూరము పెట్టాలి. నీతియే మన జాతిగా భావించాలి. మమతనే మన యొక్క మతముగా విశ్వసించాలి. జాతి గౌరవంబు నీతిపై నిలుచును నీతి లేక యున్న జాతి చెడును నీతి కలుగు జాతి నిజమైన జాతిరా. కాబట్టి ఏ జాతి అంటే నీతిలో వుండిన జాతి అనాలి. నే మతమేదన్న మమతే నా మతం. ఈ భావములు మనస్సు నందుంచుకొని దైవభక్తిని మనము అభివృద్ధి గావించుకోవాలి. ఈ ప్రపంచాన్ని సర్వవిధములా రక్షించేది ఒక్క దైవభక్తే తప్ప అన్యము కాదు. ఏ ప్రభుత్వము ప్రపంచాన్ని రక్షించలేదు. కేవలము భక్తులు మాత్రమే యీ ప్రపంచాన్ని రక్షించాలి. కనుక మనము దేశక్షేమమును దృష్టియందుంచుకొని నిత్యకళ్యాణమును ఆశించి నగరసంకీర్తనము అభివృద్ధి గావించుకోవాలి.